- 4గురు గ్యాంగ్ రేప్ చేశారని బాలిక చెప్పినా చర్యలేవి
- సీఎంఓ ఒత్తిళ్లతో పనిచేయలేకపోతున్న పోలీసులు
- సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల్సిందే
- బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్
పెద్దపల్లి జిల్లాలో మైనర్ బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ ‘‘దిశ’’ కేసు కంటే ఘోరమైనదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. అయినా ఈ కేసును నీరుగార్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మండిపడ్డారు. తనను నలుగురు యువకులు గ్యాంగ్ రేప్ చేశారని స్వయంగా ఆ బాలిక చెప్పిన ఆడియో బయటకు వచ్చినా పట్టించుకోని పోలీసులు అమ్మాయి సూసైడ్ చేసుకుందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సీఎంఓ నుండి వచ్చిన సంకేతాలు, మంత్రి పేషీ నుండి వచ్చిన ఆదేశాలతో కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
దోషులను కఠినంగా శిక్షించేదాకా ఈ కేసును వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అంతర్జాతీయ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని బండి సంజయ్ కుమార్ ఈరోజు కరీంనగర్ లోని తన కార్యాయలంలో ఫోటో జర్నలిస్టులను ఘనంగా సన్మానించారు. వెయ్యి పదాలు చెప్పలేని భావాన్ని ఒక్క ఫొటో చెబుతుంది. సమాజంలో జరిగే మంచి చెడులకు సజీవ సాక్ష్యం ఫోటోలు తీపి గుర్తులుగా మిగిలేవి ఫోటోలు అన్నారు. దేశంలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ తన కంటితో ప్రపంచానికి చూపించే ఫోటో జర్నలిస్ట్ నిరంతర శ్రామికుడు. ఎన్నో శారీరక, మానసిక ఒత్తిళ్ళను తట్టుకుని ఎంతో కష్టపడి తీసిన ఫొటోలను ప్రపంచానికి చూపించే ఫొటో జర్నలిస్టు సేవలు నిజంగా మరువలేనివని పేర్కొన్నారు. బిజెపి సీనియర్ నేత మురళీధర్ రావు చేసిన వ్యాఖ్యలు తనకు తెలియదన్నారు. అధిష్టానం ఆదేశిస్తే అసెంబ్లీకైనా పార్లమెంట్ కైనా పోటీ చేయడానికి సిద్ధమే అని ప్రకటించారు.