Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

లోకేష్ క్రెడిట్ పెరిగిందా…

0

తిరుపతి, జనవరి 30, 
అవును.. వచ్చే ఎన్నికల్లో గెలిచినా అది తన వల్లనే అని చెప్పుకోవడానికి లోకేష్ కు ఒక మంచి అవకాశం దొరికింది. లోకేష్ తనను తాను నాయకుడిగా చెప్పుకోవడానికి ఛాన్స్ లభించింది. నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్రకు లోకేష్ సిద్ధమయ్యారు. ఈరోజు నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభమై దాదాపు పదిహేను నెలలు సాగనుంది. నాలుగు వేల కిలోమీటర్ల మేరకు పాదయాత్ర చేయనున్నారు. నాలుగు వందల రోజుల పాటు ప్రజలతో మమేకం కానున్నారు. పాదయాత్రతో లోకేష్ లో సమూలమైన మార్పు వచ్చే అవకాశముంది. అదే సమయంలో ఆయన మాటతీరు, నడవడిక, నేతలతో బిహేవియర్ లో కూడా ఈ యాత్రతో మార్పు వచ్చే అవకాశముంది. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు, జగన్ పాదయాత్రలు చేసినప్పుడు కూడా ఇదే మార్పును గమనించాం.

చంద్రబాబు కూడా కోరుకుంటున్నదదే. కష్టమైనా లోకేష్ పాదయాత్రతో రాజకీయంగా రాటుదేలతారని భావించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతారు. 2014 ఎన్నికల్లో తాను మద్దతు ఇవ్వబట్టే టీడీపీ అధికారంలోకి వచ్చిందని జనసేనాని పవన్ కల్యాణ్ ఇప్పటికీ సూటి పోటి మాటలు అంటుంటారు. తాను లేకపోతే ఆనాడే తెలిసి వచ్చేదని కూడా పవన్ చేసిన కామెంట్స్ చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలకు ఎక్కడో తగులుతాయి. కానీ ఏమీ అనలేరు. కానీ లోకేష్ పాదయాత్ర చేసిన తర్వాత ఆ క్రెడిట్ ఖచ్చితంగా చినబాబుకే వస్తుందన్నది టీడీపీ నేతల భావన. వచ్చే ఎన్నికల్లో జనసేనతోనే కలసి పోటీ చేయాలని ఒక నిర్ణయానికి వచ్చారు.

జగన్ ప్రభుత్వంపైన ఉన్న వ్యతిరేకత కావచ్చు. అందరూ కలవడం వల్ల కావచ్చు. అధికారంలోకి వచ్చినా లోకేష్ పాదయాత్ర వల్లనే అధికారంలోకి వచ్చిందని తమ్ముళ్లు చెప్పుకునే వీలుంది. పవన్ కల్యాణ్ కూడా వారాహితో బస్సు యాత్ర చేయనున్నారు.వాహనాన్ని కూడా సిద్ధం చేసుకున్నారు. ఎప్పటి నుంచి అన్నది తెలియకపోయినా త్వరలోనే ఆయన కూడా రోడ్డు మీదకు రానున్నారు. ఇద్దరూ జగన్ ను అధికారంలో నుంచి దించేయడానికే యాత్రలు చేస్తున్నారు. అందులో ఎటువంటి సందేహం లేదు యాత్రలతో వ్యక్తిగతంగా పేరు తెచ్చుకోవడం ఒకవైపు కాగా, పార్టీని యాక్టివేట్ చేయడం కోసం, బలోపేతం చేయడం కోసం ఇవి ఉపయోగపడతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. అగ్రనేతల చూపుల్లో పడేందుకు నేతలు ప్రయత్నిస్తారు. క్యాడర్ లో కూడా ఉత్సాహం ఏర్పడుతుంది.

అయితే పాదయాత్రలతోనే అధికారంలోకి వస్తారా? అంటే చెప్పలేం. పొరుగునే ఉన్న తెలంగాణలోనూ పాదయాత్రలు నేతలు చేస్తున్నారు. వైఎస్ షర్మిల పాదయాత్ర దాదాపుగా పూర్తి చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా పాదయాత్రలు విడతల వారీగా చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా యాత్రను ప్రారంభించారు. అయితే కేసీఆర్ మాత్రం ఎలాంటి పాదయాత్ర లేకుండానే అధికారంలోకి రెండుసార్లు వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రజలు నమ్మితే యాత్రలు చేయకపోయినా గెలుస్తారని, లేకుంటే ఏం చేసినా ఫలితం ఉండదన్నది విశ్లేషకుల మాట.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie