Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ఎయిర్ పోర్టు వరకు మెట్రో

0

హైదరాబాద్, ఫిబ్రవరి 21: భాగ్యనగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీర్ఘ కాలిక ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. జంటనగరాలకు నలువైపులా విస్తరించేందుకు అవకాశం ఉండడంతో ప్రభుత్వ పరంగా మెరుగైన మౌలిక వసతులు కల్పించడంపై దృష్టి సారించింది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు మెట్రో లైన్‌కు పొడిగింపుగా.. శంషాబాద్‌ ఔటర్‌ రింగు రోడ్డు వెంబడి తుక్కుగూడ ఓఆర్‌ఆర్‌(ఔటర్ రింగ్ రోడ్డు) ఇంటర్‌చేంజ్‌ వరకు మెట్రో మార్గం నిర్మాణంపై అధ్యయనం చేయనున్నారు. నగరానికి వెస్ట్‌ జోన్‌లో ఉన్న ఐటీ కారిడార్‌లో అభివృద్ధి జరిగినట్లే, సౌత్‌ జోన్‌గా ఉన్న శంషాబాద్‌, తుక్కుగూడ, మహేశ్వరం, ఆదిభట్ల ప్రాంతాల్లో క్రమంగా అభివృద్ధి చెందుతున్నాయి.

అంతేకాక హర్డ్‌వేర్‌ పార్కు, ఈ-సిటీ, రంగారెడ్డి కలెక్టరేట్‌, ఫార్మాసిటీ, అమెజాన్‌ డేటా సెంటర్‌ వంటి సంస్థలు ఇటువైపే ఉండడంతో నగరం నుంచి మెట్రో మార్గం కల్పించడం ద్వారా భవిష్యత్‌ ప్రజా రవాణా అవసరాలు తీర్చే ప్రాజెక్టుగా మెట్రో మారనుంది.ఓఆర్ఆర్ చుట్టూ ఇప్పటికే రైల్వే మార్గం కోసం కావలసిన స్థలం అందుబాటులో ఉంది. ఈ క్రమంలో దాని నిర్మాణ పనులను చేపట్టడం సులభం అవడమే కాకుండా తక్కువ వ్యయంతోనే అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రజా రవాణా వ్యవస్థను కోర్‌ సిటీ నుంచి అభివృద్ధి చెందుతున్న శివారు ప్రాంతాలకు తీసుకువచ్చేందుకు ఇది దోహదం చేస్తుంది. శంషాబాద్‌,తుక్కుగూడ,మహేశ్వరం, ఆదిభట్ల ప్రాంతాలను పరిగణలోకి తీసుకొని హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేయనుంది. ప్రస్తుతం రాయదుర్గం నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు 31 కి.మీ మెట్రో మార్గాన్ని నిర్మిస్తుండగా.. అక్కడి నుంచి తుక్కుగూడ వరకు 15 కి.మీ దూరం ఉంది.

ఈ దూరం పూర్తిగా ఓఆర్‌ఆర్‌ పరిధిలోనే ఉండడంతో ప్రాజెక్టు వ్యయంపైనా అంచనా వేయనున్నారు. మెట్రో ప్రయాణం అంటే పూర్తిగా కాలుష్య రహిత ప్రజా రవాణా వ్యవస్థ. దీనిని గ్రేటర్‌ వ్యాప్తంగా అమలు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు రాష్ట్రపాలకులు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఈ-మొబిలిటీ వీక్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. భవిష్యత్‌లో కాలుష్య రహిత ఇంధన వినియోగంపై తమ భవిష్యత్‌ను స్పష్టం చేసింది. ఏకంగా 4 చోట్ల ఎలక్ట్రిక్‌ వాహనాలకు సంబంధించిన రకరకాల ఉత్పత్తుల తయారీకి పారిశ్రామిక కారిడార్‌లను సిద్ధం చేసింది. వేలాది కోట్ల పెట్టుబడులతో పలు కంపెనీల తమ కార్యకలాపాలను ఇప్పటికే ప్రారంభించాయి. వీటిలో ఈ-సిటీ ప్రాజెక్టు మహేశ్వరంలోనే ఉంది.

రూట్ మ్యాప్ పరిశీలన
మెట్రో రూట్ మ్యాప్ ను పరిశీలించారు. మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి సహా పలువురు ఇంజినీర్లు… ఈ రూట్ లో ఎదురయ్యే సవాళ్లపై అధ్యయనం చేశారు. రాయదుర్గం స్టేషన్, నానక్ రామ్ గూడ జంక్షన్, మైండ్ స్పేస్ జంక్షన్ వద్ద అవకాశం ఉన్న నిర్మాణాలపై పరిశీలన జరిపారు.ఎయిర్ పోర్ట్ మెట్రో నిర్మాణంలో పలు సవాళ్లు ఎదురవుతాయని.. సమగ్ర అధ్యయనం, పరిశీలనతో వాటిని అధిగమిస్తూ నిర్మాణాలు చేస్తామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. రాయదుర్గం స్టేషన్ – నానక్ రామ్ గూడ జంక్షన్ క్లిష్టమైన మార్గమన్న ఆయన… అత్యుత్తమైన ఇంజినీరింగ్ పరిష్కారం కోసం అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. 21 మీటర్ల ఎత్తులో మైండ్ స్పేస్ జంక్షన్ దాటడం పెద్ద సవాల్ అని…. మైండ్ స్పేస్ జంక్షన్ లో అండర్ పాస్, మధ్య రోటరీ, పైన ఫ్లై ఓవర్ ఉన్నాయని పేర్కొన్నారు.

మూడు అడ్డంకులు దాటేందుకు ప్రత్యేక స్పాన్ నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందని వివరించారు. ఎయిర్ పోర్ట్ మెట్రో పిల్లర్లను ఫై ఓవర్ పిల్లర్లకు దూరంగా నిర్మించాలని పేర్కొన్నారు.రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి శంషాబాద్ వరకు ఎయిర్ పోర్ట్ మెట్రోను… రూ. 6,250 కోట్ల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించనుంది. మొత్తం 31 కిలోమీటర్ల మేర మెట్రోరైలు రెండవ దశ పూర్తి కానుంది. మూడు సంవత్సరాల కాలంలో పూర్తి అయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మెట్రో నిర్మాణం పూర్తైతే హైదరాబాద్ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి 26నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ప్రయాణికులకు మెట్రో కారిడార్‌లోనే విమానాశ్రయ ప్రయాణాలకు చెక్‌ ఇన్‌ చేసుకోవచ్చు.

తద్వారా విమానాశ్రయాల్లో రద్దీని కూడా గణనీయంగా తగ్గించవచ్చు. ఈ మార్గంలో అనేక అంతర్జాతీయ కంపెనీలు తమ కార్యాలయాలను నిర్మిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మితమవుతున్న ఎయిర్ పోర్ట్ ఎక్స్ ప్రెస్ మెట్రో మూడేళ్లలో పూర్తి చేయాలని తెలంగాణ సర్కార్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. మరో 31 కిలో మీటర్ల పనులపై కేంద్రానికి డీపీఆర్ సమర్పించామని…. బీహెచ్ఈఎల్ నుంచి లక్డీకాపూల్ 26 కిలోమీటర్లు…… నాగోల్ నుంచి ఎల్బీనగర్ 5 కిలోమీటర్లకు మెట్రో విస్తరణకు సంబంధించి డీపీఆర్ ఇచ్చామని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie