A place where you need to follow for what happening in world cup

తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్….వికర్ష్…

0

హైదరాబాద్, జనవరి 30,
తెలంగాణ బీజేపీలో కనిపించని అసంతృప్తి అంతకంతకూ పాకిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తమ పార్టీలోనూ కోవర్టులున్నారని ఈటల రాజేందర్ ప్రకటించిన తర్వాత .. ఆ పార్టీలో అంతర్గత రాజకీయాలు మరింత విస్తృతం అయ్యాయి. టీ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ విషయంలో అడ్వాంటేజ్ తీసుకుని కేసీఆర్ ను ఓడించే విషయంలో బీజేపీ సీరియస్‌గా లేదని.. ఆ రెండు పార్టీల మధ్య అవగాహన ఉందని చెబుతున్నారు. కేసీఆర్ ను ఓడించాలన్న లక్ష్యం పెట్టుకున్న వారు బీజేపీలో ఉంటే సాధ్యం కాదని.. బయటకు రావాలని అంటున్నారు. అదే సమయంలో ప్రమాదాన్ని గ్రహించిన బండి సంజయ్.. బీజేపీని వీడిన వారు కూడా రావాలని పిలుపునిచ్చారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య పరస్పర వలసల యుద్ధం ప్రారంభమయిందన్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈటల రాజేందర్ బీజేపీపై ఎప్పుడు అసంతృప్త వ్యాఖ్యలు చేశారో అప్పుడే రేవంత్ రెడ్డి కూడా ఈటలపై సానుభూతి చూపించడం ప్రారంభించారు. ఈటల మంచి నేత అని రైట్ లీడర్ ఇన్ రాంగ్ పార్టీ అన్నట్లుగా సానుభూతి చూపిస్తున్నారు. ఆయన నేరుగా కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఈటలను పిలవడం లేదు .

కానీ ఆయన సందేశం మాత్రం సులువుగా అర్థమైపోతుంది. ఆయనను మాత్రమే కాదు మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి, వివేక్ తో పాటు విశ్వేశ్వర్ రెడ్డిని కూడా ఆయన టార్గెట్ చేశారు. వీరి లక్ష్యం బీజేపీలో ఉంటే నెరవేరదని.. ఆయన అంటున్నారు. నిజానికి వీరంతా బీజేపీలో చేరారు కానీ ఎలాంటి ప్రాధాన్యం లేకుండా గడిపేస్తున్నరు. విజయశాంతి రాజకీయాల్లోకి వచ్చి పాతికేళ్లయిన సందర్భంగా రేవంత్ కూడా సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలిపారు. అందుకే రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా రాజకీయం చేస్తున్నారని.. బీజేపీపీలో చేరిన వారందర్నీ మళ్లీ కాంగ్రెస్‌కు తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు. అసలే బీజేపీలో చేరికలు అంతంత మాత్రంగా ఉన్నాయి. చాలా పెద్ద మిషన్ పెట్టుకుని పెద్ద ఎత్తున చేరికల్ని ప్రోత్సహించాలనుకుంటున్నా సాధ్యం కావడం లేదు.

ఈ లోపు రేవంత్ రెడ్డి ఉన్న నేతల్ని కూడా ఆకర్షించేందుకు ప్రయత్నిస్తూండటంతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అప్రమత్తమయ్యారు. విజయశాంతి రాజకీయాల్లోకి వచ్చి పాతికేళ్లయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీని వీడిన వారు తిరిగి రావాలని పిలుపునిచ్చారు. కొత్త వారు కూడా రావాలని ఆయన కోరుతున్నారు. నిజానికి బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడయ్యాక.. తనకు ప్రాధాన్యత లేదని విజయశాంతి ఫీలవుతున్నారు. ఈ భావన తొలగించడానికి ఆయన విజయశాంతి కార్యక్రమాన్ని హాజరయ్యారు. ప్రధానంగా బీజేపీలో బండి సంజయ్ డామినేషన్ వల్లే ఎక్కువ మంది అసంతృప్తిలో ఉన్నారని చెబుతున్నారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అనే అడ్వాంటేజ్‌కు తోడు తెలంగాణలో పుంజుకున్నామన్న నమ్మకంతో ఉన్న బీజేపీలోకి నేతలు వెల్లువలా వస్తారని ఆ పార్టీ నేతలనుకున్నారు. కానీ అలా జరగడం లేదు. పై స్థాయిలో ఎంత పెద్ద హామీలు ఇచ్చినా నేతలు రావడం లేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ గుడ్ బై చెప్పాలనుకున్నారు కానీ.. బీజేపీలో మాత్రం చేరడానికి సంశయిస్తున్నారు. దీనికి కారణం… కాంగ్రెస్ పార్టీ ఇంకా క్షేత్ర స్థాయిలో బలంగా ఉండటమే. పార్టీ క్యాడర్ బలంగా ఉండటంతో.. కాంగ్రెస్ ఇంకా గట్టిపోటీ దారుగానే ఉంది. బలమైన అభ్యర్థులు ఉన్న చోట్ల మాత్రమే బీజేపీ పోటీ ఇస్తుందనే అంచనాలు ఉన్నాయి. అందుకే కాంగ్రెస్ , బీజేపీ రెండు పార్టీలు నేతల్ని ఆకర్షించేందుకు ఓ రకంగా వార్ ప్రారంభించాయి. ఎవరిది పైచేయి అవుతుందో మరి !

Leave A Reply

Your email address will not be published.