A place where you need to follow for what happening in world cup

HOT NEWS

 వివేక హత్య కేసు పై విచారణ

0

హైదరాబాద్, ఫిబ్రవరి 16:మాజీ ఎంపీ వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. వివేకా హత్య కేసులో A2గా ఉన్న సునీల్ యాదవ్ కు బెయిల్ ఇవ్వొద్దంటూ వివేకా కుటుంబం అభ్యంతరం వ్యక్తం చేశారు. హైకోర్టులో వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. కేసు విచారణ దశలో ఉన్నప్పుడు నిందితుడు సునీల్ యాదవ్ కు బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సౌభాగ్యమ్మ తెలిపారు. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 27కు వాయిదా వేసింది. ఈ నెల 27న సీబీఐ కూడా బెయిల్ పిటిషన్ పై తన వాదనలు వినిపించనున్నట్లు తెలుస్తోంది.  సీబీఐ కూడా అభ్యంతరాలు దాఖలు చేయనుంది.

పులివెందుల మండలం మోట్నూంతలపల్లి గ్రామానికి చెందిన సునీల్‌ యాదవ్‌ వైసీపీ కార్యకర్త. అతడి తల్లిదండ్రులు సావిత్రి, కృష్ణయ్య యాదవ్. అనంతపురం జిల్లాలోని ఓ లిక్కర్ పరిశ్రమలో కృష్ణయ్య పనిచేస్తూ..  అక్కడే ఉండేవాడు. కొన్ని రోజులపాటు ఆటోమెుబైల్ ఫైనాన్స్ సంస్థలో పని చేశారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవడంతో 2017లో పులివెందులకు వచ్చారు. భాకరాపురంలోని అద్దె ఇంట్లో ఉండేవారు. వైసీపీ ప్రభుత్వం… అధికారంలోకి వచ్చాక.. ఇసుక రీచ్ లో పని చేశాడు సునీల్. కొన్ని రోజుల తర్వాత.. ఎర్రగంగిరెడ్డి, దస్తగిరి ద్వారా వివేకాకు సునీల్ యాదవ్ పరిచయమయ్యాడు. అప్పటి నుంచి తరచూ వివేకా ఇంటికి వెళ్లేవాడు. వారి నడుమ ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు సమాచారం.

వివేకా హత్య కేసు విచారణలో భాగంగా సునీల్‌, ఆయన కుటుంబ సభ్యులను సీబీఐ అధికారులు పలుమార్లు విచారించారు. వాచ్‌మన్‌ రంగయ్యను చాలా సార్లు విచారించాక గత నెల 23న జమ్మలమడుగు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు ఎదుట హజరు పరిచి వాంగ్మూలం ఇప్పించారు. వివేకా 2019 మార్చి 14న అర్ధరాత్రి తన ఇంట్లో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. వివేకా కుమార్తె సునీత అభ్యర్థన మేరకు హైకోర్టు  మార్చి 11న సీబీఐకి దర్యాప్తు బాధ్యతలు అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

Leave A Reply

Your email address will not be published.