- నోరు అదుపులో పెట్టుకోకపోతే భౌతిక దాడులు తప్పవంటూ వార్నింగ్
- హరీశ్ రావు ప్యాకేజీ తీసుకునే ప్రకాశ్ విమర్శలు చేస్తున్నారని ఆరోపణ
- కాళేశ్వరం అవినీతిలో ప్రకాశ్కు కూడా వాటా ఉందని వ్యాఖ్యలు
తెలంగాణ నీటి వనరుల అభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్ వి. ప్రకాశ్పై జాగృతి నాయకులు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్సీ కవితపై వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించేది లేదని, చెప్పులతో దాడి చేస్తామని తీవ్రంగా హెచ్చరించారు. కవితపై మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోకపోతే భౌతిక దాడులు తప్పవని స్పష్టం చేశారు.
జాగృతి కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వారు ప్రకాశ్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. “ప్రకాశ్ మేధావి కాదు, మేత మేసే ఆవు” అని ఘాటుగా విమర్శించారు. మాజీ మంత్రి హరీశ్ రావు నుంచి ప్యాకేజీ తీసుకుని ప్రకాశ్ కవితపై ఆరోపణలు చేస్తున్నారని, ఎంతకు అమ్ముడుపోయావని ప్రశ్నించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి బయటపడితే తన పేరు కూడా వస్తుందనే భయంతోనే ప్రకాశ్ కవితను టార్గెట్ చేశారని జాగృతి నాయకులు ఆరోపించారు. హరీశ్ రావు, మేఘా కృష్ణారెడ్డితో పాటు ప్రకాశ్కు కూడా ఆ ప్రాజెక్టులో వాటా ఉందని, అందుకే ఆయనలో ఆందోళన మొదలైందని అన్నారు. నీటి వనరుల సంస్థ ఛైర్మన్గా ఆయనకు ఎంత వాటా వచ్చిందని ప్రశ్నించారు.
గతంలోనూ ప్రకాశ్ అనేక అక్రమాలకు పాల్పడ్డారని జాగృతి నాయకులు ఆరోపించారు. అభ్యుదయవాది మారోజు వీరన్న హత్యలో ఆయన పాత్ర ఉందని, చంద్రబాబుతో కలిసి నిధులు కాజేశారని విమర్శించారు. దేవేందర్ గౌడ్, కపిలవాయి దిలీప్లతో కొత్త పార్టీలు పెట్టించి తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చాలని ప్రయత్నించారని మండిపడ్డారు. సొంత చెల్లెలిపై ఇలాంటి ఆరోపణలు వస్తున్నప్పటికీ కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదని జాగృతి నాయకులు ప్రశ్నించారు. ఈ విషయంలో ఆయన మౌనం తమను బాధించిందని వ్యాఖ్యానించారు.
Read also : RainfallAlert : తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
