- ‘పల్లా’కు సపోర్ట్ కోసం ఎర
- లీడర్ల స్థాయిని బట్టి రేటు
- ఒక్కొక్కరికి రూ.లక్ష నుంచి రూ.10 లక్షలు వరకు
- మితిమీరుతున్న గ్రూపు రాజకీయాలు
- మండిపడుతున్న సీనియర్ లీడర్లు
జనగామ బీఆర్‌ఎస్ గ్రూప్ రాజకీయాలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయా..? పార్టీని కాపాడాల్సిన జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్‌రెడ్డే బీఆర్‌ఎస్‌ను బ్రష్టు పట్టిస్తున్నాడా..? అంటే అవును అనే సమాధానం వస్తోంది. ఇటీవల పార్టీ అధినేత కేసీఆర్ రాష్ట్రంలోని 115 అసెంబ్లీలకు అభ్యర్థులను ప్రకటించినా.. నాలుగింటిని పెండింగ్‌లో పెట్టారు. అందులో జనగామ కూడా ఉండడంతో ఇక్కడ రాజకీయం రసవత్తరంగా మారింది. ముఖ్యంగా పార్టీకి పెద్ద దిక్కుగా ఉండి కాపాడాల్సిన జిల్లా అధ్యక్షుడే గ్రూపు రాజకీయాలకు తెరలేపడంతో క్యాడర్ అయోమయానికి గురవుతోంది. పల్లాకు సపోర్ట్ చేయాలని… జనగామ టికెట్ ఒకే అయ్యిందని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి కొన్ని రోజులుగా నియోజవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల సీక్రెట్ మీటింగ్‌లు పెట్టి చాలా మందిని తనవైపు తిప్పుకున్నారు. ఇందులో జిల్లా పార్టీ అధ్యక్షుడు పాగాల కీలకంగా వ్యహరించారు.
జిల్లాకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ముఖ్య లీడర్లకు డబ్బుల ఎరవేసి సపోర్ట్ చేయాలని కోరినట్టు తెలుస్తోంది. లీడర్ల స్థాయిని బట్టి ఒక్కొక్కరికి రూ.1 లక్ష నుంచి రూ.10 లక్షల వరకు ముట్టజెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించిన ఆడియోలు, వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. అయితే పాగాల అంతటితో ఆగకుండా తాజాగా బహిరంగ మీటింగ్‌లు పెట్టేందుకు ప్లాన్ చేశారు. జిల్లాలోని రఘునాథపల్లి మండలం నిడిగొండలో శనివారం పల్లా వర్గీయులతో సమావేశం ఏర్పాటు చేశారు. దాదాపు 3 వేల మందితో ప్లాన్ చేసిన ఈ మీటింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి హాజరు కావాల్సిన ఉన్నా ఆయన రాలేదు.
పల్లాకు మంత్రి కేటీఆర్ హెచ్చరిక..?
నిడిగొండ సమావేశానికి వస్తున్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి మంత్రి కేటీఆర్ ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. జనగామ గ్రూపు రాజకీయాలపై కేటీఆర్ సీరియస్ అయినట్టు సమాచారం. పార్టీ అధినేత ఎవరి నిర్ణయిస్తే వారు ఎన్నికల్లో పోటీ చేస్తారని, అప్పటి వరకు ఎవరు కూడా రహస్య మీటింగ్ పెట్టొద్దని హెచ్చరించినట్టు తెలుస్తోంది. దీంతో పల్లా రాజేశ్వర్‌రెడ్డి చివరి నిమిషంలో సభకు డుమ్మా కొట్టారు. అయితే జిల్లా అధ్యక్షుడు సంపత్‌రెడ్డి మాత్రం పల్లాకు ఫోన్ చేసి లౌడ్ స్పీకర్‌తో మీటింగ్‌లో మాట్లాడించారు. అయితే పార్టీ జిల్లా అధ్యక్షుడే ఇలా గ్రూపుకు తెరలేపారని, బీఆర్‌ఎస్‌ను విచ్ఛిన్నం చేస్తున్నారని పార్టీ సీనియర్ లీడర్లు మండిపడుతున్నారు.