A place where you need to follow for what happening in world cup

HOT NEWS

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు

0

సీఎం జగన్ వ్యాఖ్యలు కోర్టు ఆఫ్ కంటెప్ట్ పరిధిలోకి వస్తాయి
అమరావతి ఫిబ్రవరి 6: ఇటీవల ఢిల్లీలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ల సన్నాహక సదస్సులో పాల్గొన్న ఏపీ సీఎం వైఎస్ జగన్ రాజధానిపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాను త్వరలోనే విశాఖపట్నానికి షిప్టు అవుతున్నానని వెల్లడించారు. అక్కడి నుంచే పరిపాలన సాగిస్తానని తెలిపారు. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు పారిశ్రామిక వేత్తలు విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టాలని సీఎం జగన్ కోరారు. సీఎం జగన్ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. జగన్ మూడు రాజధానులు ఏర్పాటు చేస్తూ తెచ్చిన జీవోలను హైకోర్టు కొట్టేసింది. దీంతో జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో రాజధాని అంశంపై విచారణ సాగుతోంది. కోర్టు పరిధిలో రాజధాని అంశం ఉన్నప్పుడు జగన్ రాజధాని అంశంపై వ్యాఖ్యలు ఎందుకు చేస్తారని ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. జగన్ వ్యాఖ్యలపై కోర్టుధిక్కరణ కింద సుప్రీంకోర్టుకు లేఖ రాస్తానని జై భీమ్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ తెలిపారు.

మరోవైపు సీఎం జగన్ త్వరలోనే విశాఖకు షిప్టు అవుతానని చేసిన వ్యాఖ్యలపై సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. సీఎం జగన్ వ్యాఖ్యలు కోర్టు ఆఫ్ కంటెప్ట్ పరిధిలోకి వస్తాయన్నారు. రాజధాని అంశం కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని లక్ష్మీనారాయణ తెలిపారు. కాగా సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో జగన్ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. ఇతరుల మొబైల్ ఫోన్లను ట్యాపింగ్ చేయడం అంత సులువు కాదని ఆయన అన్నారు. ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) రా వంటి అత్యున్నత ఏజెన్సీలకు మాత్రమే ఎవరి టెలిఫోన్నైనా ట్యాప్ చేసే అధికారం ఉంటుందని తెలిపారు. అవన్నీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయని.. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేవని స్పష్టం చేశారు.

ఈ ఏజెన్సీలు కూడా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కేంద్ర హోంశాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని లక్ష్మీనారాయణ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా టెలిఫోన్ ట్యాపింగ్ చేయగలిగినప్పటికీ.. అయితే అసాధారణమైన పరిస్థితులలో మాత్రమే చేయగలదన్నారు. అది కూడా కేంద్ర హోం కార్యదర్శి అనుమతితో మాత్రమేనని చెప్పారు. అయితే అసాధారణ పరిస్థితుల్లో ఇచ్చిన ట్యాపింగ్ అధికారాలను రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేసే అవకాశం కూడా ఉందన్నారు. రాజకీయ కారణాలతో ట్యాపింగ్ జరిగితే అది ఖచ్చితంగా చట్టవిరుద్ధమని లక్ష్మీనారాయణ తేల్చిచెప్పారు. అదే సమయంలో.. కేంద్రం నుండి అనుమతి తీసుకోకుండానే రాష్ట్ర ప్రభుత్వాలు తరచుగా ప్రైవేట్ సంస్థల నుంచి ట్యాపింగ్ పరికరాలను కొనుగోలు చేస్తున్నాయని లక్ష్మీనారాయణ తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం వాటిని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందన్నారు. కాగా ఇటీవల రోడ్లపై బహిరంగ సభలు సమావేశాలు ర్యాలీలు రోడ్ షోలను నిషేధిస్తూ జగన్ ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 1కు అనుకూలంగానూ జేడీ లక్ష్మీనారాయణ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.