Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

కడియం నర్సరీలకు వేసవి తాపం. మండే ఎండలకు విలవిలలాడుతున్న మొక్కలు.

0

ప్రచండ భానుడు ప్రతాపానికి దేశ వ్యాప్త ప్రసిద్ధిచెందిన కడియం నర్సరీలు అల్లాడిపోతున్నాయి. మంగళవారం రికార్డు స్థాయిలో ఈ ప్రాంతంలో 49 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. దీంతో కొన్ని మొక్కలు ఒక్కసారిగా వేడికి తలలు వాలే సాయి. వీటిని సంరక్షించుకోవడం నర్సరీ రైతులకు పెను సవాలుగా మారింది. గ్రీన్ బెల్ట్ గా ప్రసిద్ధిగాంచిన ఈ కడియం నర్సరీలు గ్రీష్మ తాపానికి కళాహీనంగా మారుతున్నాయి.కడియం మండలంతో పాటు ఆలమూరు, మండపేట, రంగంపేట తదితర మండలాలలో వేలాది ఎకరాలలో మొక్కల పెంపకం జరుగుతుంది.

ప్రతి వేసవికి తప్పని పాట్లు

మన ఇంట్లో పెంచుకునే పదోపరకో మొక్కలను వేసవిలో సంరక్షించుకోవడానికి ఆపసోపాలు పడిపోతుంటాము. ఎప్పటికప్పుడు నీరు అందిస్తూ వాటిని ఎంత జాగ్రత్తగా చూసుకున్నా వేడికి తట్టుకోలేక కొన్ని మొక్కలు చనిపోతుంటాయి.మరి అలాంటిది ఒక్కొక్క నర్సరీలో లక్షలాది మొక్కలు వివిధ వయస్సులలో ఉంటాయి. వాటిని కంటికి రెప్పలా కాపాడుకోవడం ఎంత కష్టమో ఆ మొక్కలను పెంచి పోషించే రైతులకే తెలుస్తుంది. నిద్రాహారాలు మాని ఈ మొక్కలను బతికించుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రతి వేసవిలోనూ రైతుల ఎదుర్కొనే ప్రధాన సమస్య.

 

సాధారణంగా వేసవిని దృష్టిలో ఉంచుకుని తయారైన మొక్కలను మార్చి నెలకే అమ్మకాలు పూర్తి చేస్తారు.అయితే ఈ ఏడాది అంతంతమాత్రంగానే ఎగుమతులు జరగడం వల్ల మొక్కల నిల్వలు ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వాటిని బతికించుకోవడం ప్రతి రైతుకు సవాలుగానే మారుతుంది. ఓ పక్క విద్యుత్ కోతలు, మరో పక్క మండే ఎండలతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అదికాక ఈ వేసవి కూలీలు కూడా పనికి రావడానికి అంతగా మొగ్గుచూపరు. ఉదయం పూట మాత్రమే చాలామంది కూలీలు పనికి వస్తున్నారు. ఇలాంటి సమయంలో రెండు పూటలా ఈ మొక్కలకు నీరు అందించడం ఎంత కష్టమో వేరే చెప్పనవసరం లేదు.

 మొక్కకు మొక్కే తోడు…

ముల్లును ముల్లుతోనే తీయాలనే పాత సామెత మనందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే అలాంటి సామెత మాదిరిగానే నర్సరీ రైతులు కూడా ఈ వేసవి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంటారు. అది ఎలాగంటే ఖరీదైన నర్సరీ మొక్కలకు వేసవితాపం తగలకుండా వేరే మొక్కలను పెంచుతుంటారు. అవి కేవలం నీడని ఇవ్వడం తప్ప ఎందుకు పనికిరావు. అలాంటి అవిశ మొక్కలను వేసవికి ముందే నాటుతారు. అవి వేసవి సమయానికి ఏపుగా ఎదిగి కింద ఉండే మొక్కలకు నీడనిస్తాయి. ఆ నీడలో ఎండలను తట్టుకుని ఈ మొక్కలు జీవిస్తాయి.

 

మొక్కలకు ఎంత నీరు అందించినా భగభగ మండే ఎండలను తట్టుకోలేవు. అందుకుని ఈ నీడనిచ్చే అవిశ మొక్కలను ముందు జాగ్రత్తగా రైతులు రంగంలోకి దింపుతారు. ఎండకాలం వెళ్లిపోయిన వెంటనే ఈ నీడనిచ్చే మొక్కలను తొలగిస్తారు.  ఎప్పుడు కడియం నర్సరీలకు వెళ్ళినా కొత్త కొత్త అందాలతో అద్భుతంగా కనిపించే ఈ మొక్కలు ఇప్పుడు వెళ్తే కనబడవు.నీడనిచ్చే మొక్కల మధ్య బతుకుజీవుడా అంటూ కాలం గడుపుతాయి.తన అందచందాలతో మిడిసిపడే మొక్కలు ఎండవేడిని తాళలేక నీడనిచ్చే మొక్కల కింద తలదాచుకుంటాయి.

ఇండోర్ మొక్కలకు ప్రత్యేక ఏర్పాట్లు

ఎంతో సున్నితంగా ఉండే ఇండోర్ మొక్కలకు ఈ వేసవిలో ప్రత్యేక ఏర్పాట్లు చేయక తప్పదు. ఈ మొక్కల కోసం లక్షలాది రూపాయల వ్యయంతో ఫాలీ హౌసులు, సెమీ షేడ్ నెట్ లను ఏర్పాటు చేస్తుంటారు. ఆ మొక్కలు నీడలోనే  జీవించగలవు. అందుకనే గతంలో నాలుగైదు పెద్ద నర్సరీలలో మాత్రమే ఉండే ఈ ఫాలి హౌసులు ఇప్పుడు పదుల సంఖ్యలో పెరిగాయి.  ఎండకు వేడిగాలులకు ఇవి ఎంతో రక్షణ కల్పిస్తాయి. అలంకరణకు వినియోగించే ఇండోర్ మొక్కల కొనుగోలు ఇటీవల పెరగడంతో నర్సరీ రైతులు కూడా వీటిని అధిక మొత్తంలో అందుబాటులో ఉంచుతున్నారు. దేశ విదేశాల నుంచి తీసుకొచ్చిన ఈ మొక్కలు కు వేసవి వేడి తగలకుండా రైతులు ప్రత్యేక శ్రద్ధ చూపెడతారు.

ఎగుమతులు, దిగుమతులకు కష్టమే

నేల మీద ఉండే మొక్కలను  సంరక్షించుకోవడమే వేసవిలో కష్టమవుతుంది. అలాంటిది ఇతర రాష్ట్రాల నుంచి మొక్కలు దిగుమతి చేసుకోవడం లేదా ఎగుమతి చేయడం ఎంత కష్టమో వేరే చెప్పనవసరం లేదు. సాధారణ రోజుల్లో లారీలపై చేసే లోడింగ్ మాదిరిగా కాకుండా ఎండ వేడి తగలకుండా ఆ మొక్కలపై అరటి సొరుగు ఇతర ఏర్పాట్లను రైతులు చేస్తుంటారు. ఎందుకంటే ఇలాంటి ఎండల్లో ఈ మొక్కలకు తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ఎగుమతి చేస్తే అక్కడికి వెళ్ళేసరికి వాటి రూపురేఖలు మారిపోతాయి. అందుకునే తగినన్న జాగ్రత్తలతో మొక్కల ఎగుమతులు చేస్తారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie