A place where you need to follow for what happening in world cup

HOT NEWS

ఈటల రాజేందర్ ను ఓడించాలని కేసీఆర్ పంతం

0

కరీంనగర్, ఫిబ్రవరి 1,
ఈటల రాజేందర్‌ను ఎలాగైనా ఓడించాలని కేసీఆర్ చేసిన ప్రయత్నాలు ఉపఎన్నికల్లో ఫలించలేదు. కానీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఈటలను ఓడించాలని లక్ష్యంగా బీఆర్ఎస్ పెట్టుకుంది. ఈసారి బాధ్యతలను కేటీఆర్ తీసుకున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన కేటీఆర్.. అభ్యర్థిగా పాడి కౌశిక్ రెడ్డిని పరోక్షంగా ప్రకటించారు. వచ్చే 8 నెలలు ప్రజల్లోనే ఉండాలని సూచించారు. బైపోల్‌లో ఈటలపై గెల్లు శ్రీనివాస్‌ యాదవ్ పోటీ చేశారు. ఆయన సమక్షంలోనే కౌశిక్‌రెడ్డి పేరును కేటీఆర్ ప్రకటించారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఈటలను కౌశిక్ రెడ్డి ఢీ కొట్టనున్నట్లు తెలుస్తోంది. బహిరంగ సభతో బలం నిరూపించుకున్న కౌశిక్‌రెడ్డిని హుజురాబాద్ ప్రజలు కచ్చితంగా ఆశీర్వదిస్తారని మంత్రి కేటీఆర్ చెప్పారు. కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్‌కి కంచుకోట. ఎన్నికలు, ఉప ఎన్నికలు ఏదైనా ఇక్కడి ఓటర్లు బీఆర్ఎస్‌కే పట్టం‌ కట్టారు.

అయితే నియోజకవర్గాన్ని బీఆర్ఎస్‌లో ఉండి కంచుకోటగా మార్చుకుంది ఈటల రాజేందర్. ఆయన బీజేపీలో చేరి.. ఆ పార్టీ తరపున పోటీ చేయడంతో బీఆర్ఎస్ కంచుకోట కాస్తా ఈటల రాజేందర్ కంచుకోటగా మారింది. ఎమ్మెల్యేగా గెలుపొంది నేరుగా ముఖ్యమంత్రికే సవాల్‌ విసురుతున్నారు. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈటలను ఓడించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో భాగంగానే అభ్యర్థిని ప్రకటించినట్లుగా తెలుస్తోంది. హుజూరాబాద్‌లో ఇప్పటి వరకూ నియోజకవర్గంలో కుమ్ములాటలు ఉన్నాయి. మొత్తం మూడు వర్గాలు బీఆర్ఎస్ టిక్కెట్ కోసం పోటీ పడటం ప్రారంభించాయి. ఉప ఎన్నికలలో ఎవ్వరూ ఊహించని విధంగా బిసి కార్డు బాగా పని చేస్తుందని గెల్లు శ్రీనివాస్‌ని బరిలో దింపింది. ఈటెల రాజేందర్ కి ప్రధాన పోటీదారుడు అయిన కౌషిక్ రెడ్డిని కూడా కాంగ్రెస్ నుంచి చేర్చుకుని గులాబి కండువా కప్పి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు.

గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ని హుజురాబాద్ ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఎమ్మెల్యేగా గెల్లు శ్రీనివాస్ ఎమ్మెల్సీగా కౌషిక్ రెడ్డి ఇద్దరూ వన్ ప్లస్ వన్ ఆఫర్ తో నియోజకవర్గం అభివృద్ధి చేస్తారని ఉప ఎన్నికల సందర్భంగా టిఆర్ఎస్ అగ్ర నేతలు ప్రకటించారు. ఇక ఉప ఎన్నికల తర్వాత ఇక్కడ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. నాయకులు బలప్రదర్శన చేస్తూ ఒకరంటే ఒకరు హైకమాండ్ దృష్టిలో పడేందుకు ప్రయత్నించారు. ఉప ఎన్నికలలో ఓడిపోయిన‌ కూడా గెల్లు శ్రీనివాస్ టిఆర్ఎ నియోజకవర్గం ఇన్‌చార్జ్‌ పదవి ఇచ్చింది. ఎమ్మెల్సీగా గెలుపొందిన కౌషిక్ రెడ్డి ని నియోజకవర్గంలోని కార్యక్రమాలలో దూరంగా ఉండాలని అధిష్టానం సూచించారు. ఉప ఎన్నికల తరువాత గెల్లు శ్రీనివాస్ పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటు వస్తుండగా రెండు నెలల నుండి హుజురాబాద్ టిఆర్ఎస్ పార్టీలో ఒక్కసారిగా కౌషిక్ రెడ్డి దూకుడు పెంచారు.

పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తు బల ప్రదర్శన చేసుకుంటూ వస్తున్నారు.కౌషిక్ రెడ్డి దూకుడు పెంచడం తో వచ్చే ఎన్నికల లో కౌషిక్ రెడ్డే ఎమ్మెల్యేగా పోటి చేస్తారనే ప్రచారం చేస్తున్నారు. దీంతో గెల్లు శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించి తానే ఎమ్మెల్యేగా వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తానని ప్రకటించారు. పాడి కౌషిక్ రెడ్డి సవాల్‌కి తనకి సంబంధం లేదని తన వ్యక్తిగత సవాల్ అని నియోజకవర్గం ఇంచార్జ్ గా తనకి సంబంధం లేదని ప్రకటించారు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. హుజురాబాద్‌లో టిఆర్ఎస్ పార్టీ రెండు వర్గాలుగా కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో ఎవ్వరితో ఉండాలో ఎలా వ్యవహరించాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు ద్వితీయ శ్రేణి నాయకులు. ఏ పరిస్థితి ఎలా ఉంటాదోనని ఎందుకైనా మంచిదని ఇద్దరి కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. అయితే ఇప్పుడు గెల్లు శ్రీనివాస్ ను పక్కన పెట్టి.. కౌశిక్ రెడ్డికే కేటీఆర్ అభ్యర్థిత్వం ప్రకటించారు. అయితే ఈటల మాత్రం తాను సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తానని ప్రకటిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.