A place where you need to follow for what happening in world cup

ఏపీ బీజేపీలో మాస్ లీడర్ల కొరత !

0

విజయవాడ, ఫిబ్రవరి 17:ఆంధ్రప్రదేశ్ బీజేపీకి కన్నా లక్ష్మినారాయణ రాజకీనామా చేశారు. కొన్నాళ్లుగా ఆయన పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. కానీ ఎవరూ పట్టించుకోలేదు. ఏపీ బీజేపీ చీఫ్ గా పని చేస్తూండగా హఠాత్తుగా ఆయనకు ఉద్వాసన చెప్పారు. తర్వాత రాజకీయాల్లో ఉన్నారా లేరా అన్నట్లుగా ఆయన కనిపించడం మానేశారు. బీజేపీలో ఆయనకు ఎక్కడా ప్రాధాన్యం దక్కలేదు. జాతీయ కార్యవర్గంలో సభ్యత్వం ఇవ్వడం మినహా రాష్ట్ర రాజకీయాల్లో ఆయనకు పాత్ర లేకుండా చేశారు. దీంతో ఆయన చివరికి పార్టీకి గుడ్ బై చెప్పారు. అయితే ఈ విషయంలో హైకమాండ్ కూడా కన్నాను పార్టీలోనే ఉంచడానికి పెద్దగా ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. ఈ విషయం కూడా చర్చనీయాంశం అవుతోంది. తెలంగాణలో జోరుగా ఉన్న పార్టీ.. ఏపీలో ఎందుకు ముందుకు వెళ్లలేకపోతోంది ? ఏపీ విషయంలో హైకమాండ్ ఇంకా జాతీయ రాజకీయాలనే చూసుకుంటోందా ?రాజకీయ పార్టీకి ఓ మాస్ లీడర్ ఉన్నప్పటికీ రాష్ట్రాలు, జిల్లాలు, నియోజకవర్గాల్లో కూడా మాస్ లీడర్లు ఉండాలి.

లేకపోతే పార్టీ బలోపేతం కాదు. బీజేపీకి జాతీయ స్థాయిలో నరేంద్రమోదీ ఉన్నారు. కానీ రాష్ట్ర స్థాయిలో అసలు ఎవరూ లేరు. ఏపీ బీజేపీలో ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచిన నాయకుడు ఒక్కరంటే ఒక్కరు లేరు. ఎమ్మెల్యే స్థానం కాదు కదా.. చివరికి వారి స్వగ్రామాల్లో లేదా వార్డుల్లో బీజేపీ అభ్యర్థిగా నిలబడితే గెలుస్తారన్న గ్యారంటీ ముఖ్య నేతలకూ లేదు. సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు లాంటి నేతలు కేవలం మీడియాలో మాత్రం ప్రముఖులు. వారికి జనాల్లో ఉన్న క్రేజ్ తక్కువ. అది ఎన్నికల్లో పోటీ చేయడానికి సరిపోదు. అయితే విచిత్రంగా పార్టీ వారి చేతుల్లోనే ఉంది. ఎన్నికల తర్వాత కేసుల భయమో.. భద్రత భయమో.. కారణం ఏదైనా కొంత మంది మాస్ లీడర్లు బీజేపీలో చేరారు. కన్నా లక్ష్మినారాయణ ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. పదిహేనేళ్లు మంత్రిగా ఉన్నారు. అలాంటి నేత సారధ్యంలో చాలా మంది నేతలు ఇతర పార్టీల నుంచి వచ్చి చేరారు.

రాయలసీమలో ఆదినారాయణ రెడ్డి,  వరదాపురం సూరి,  బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, కర్నూలు ఎంపీ టీజీ వెంకటేష్ వంటి వారు చేరారు. కోస్తా.. ఉత్తరాంధ్రల నుంచి కూడా చేరారు. అయితే ఇలా చేరిన వారందర్నీ పక్కన పెట్టేసింది బీజేపీ హైకమాండ్. కన్నాను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించిన తర్వాత అలా పార్టీలో చేరిన వారందర్నీ పక్కన పెట్టేశారు. ఫలితంగా వారంతా పక్క చూపులు చూస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీలో ఉన్న మాస్ లీడర్లంతా పార్టీలో ఉండటం కష్టమేనన్న వాదన వినిపిస్తోంది. సోము వీర్రాజు ఏం చేసినా హైకమాండ్ ఆదేశాలతోనే చేశారని జీవీఎల్ నరసింహారావు ప్రకటించారు. అంటే.. ఇలా మాస్ లీడర్లందర్నీ పక్కన పెట్టేసి.. కేవలం పార్టీని అంటి పెట్టుకుని..

అటు ప్రజల్లో పలుకుబడి తెచ్చుకోలేక.. పార్టీని బలోపేతం చేయలేని నాయకులే చాలని హైకమాండ్ అనుకుంటోందా అన్నది ఇక్కడ ముఖ్యమైన విషయం. ఒకప్పుడు తెలంగాణలో కంటే ఏపీలోనే బీజేపీ ఎక్కువ  బలంగా ఉండేది. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ పుంజుకుంది. కానీ ఏపీలో మాత్రం మరింతగా దిగజారిపోయింది. ఏపీలో జాతీయ రాజకీయాల కోణంలో పార్టీ బలోపేతం కన్నా.. మిత్రులకు అండగా ఉండేలా నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఈ  సమస్య ఏర్పడిందన్న వాదన వినిపిస్తోంది. అందుకే  ఏపీలో బీజేపీ అధికారంలోకి తేవడం కన్నా.. జాతీయ రాజకీయల కోణంలో పార్టీని ఉపయోగించుకుంటే చాలన్న అభిప్రాయంతో హైకమాండ్ ఉందన్న అభిప్రాయం ఎక్కువగా వినిపించడానికి కారణం అవుతోంది.

Leave A Reply

Your email address will not be published.