A place where you need to follow for what happening in world cup

HOT NEWS

జనగామ కాంగ్రెస్ లో లోకల్ పంచాయితీ

0

హైదరాబాద్: తెలంగాణలో ఆరు జిల్లాల డీసీసీ అధ్యక్షుల నియామకానికి బ్రేక్ పడింది. ఇందులో జనగామ డీసీసీ ఒకటి. జనగామ డీసీసీ నియామకం పై పార్టీలో పెద్ద రగడ మొదలైంది. నిన్నమొన్నటి వరకు ఎడమొహం పెడమొహంగా ఉన్న నాయకులు కూడా జనగామ డీసీసీ విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చారు. ఇప్పుడు జనగామ డీసీసీ నియామకం రంజుగా మారిపోయింది. జనగామ డీసీసీ నియామకం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పెద్ద చర్చకు దారితీసింది. సీనియర్ నాయకులు అంతా పోటీపడి ఎవరి వ్యూహం వారు అమలు చేసే పనిలో ఉన్నారు.

గాంధీ భవన్ మెట్లు ఎక్కనన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం గాంధీభవన్‌కు వచ్చారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, వెంకటరెడ్డి చాలాసేపు మంతనాలు జరిపారు. అంతకుముందు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ థాక్రేతో సమావేశమయ్యారు. ఇన్‌ఛార్జ్‌తో జరిగిన భేటీలో జనగామ డీసీసీ అధ్యక్ష పదవి ఆశిస్తున్న కొమ్మూరి ప్రతాప్‌రెడ్డిని పరిచయం చేశారు. డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరారు వెంకటరెడ్డి. జనగామ నియోజకవర్గం ఎంపీ కోమటిరెడ్డి పరిధిలో ఉండటంతో డీసీసీ నియామకం ప్రక్రియలో ఆయన జోక్యం చేసుకున్నారు. అయితే పొన్నాల లక్ష్మయ్యకు, కోమటిరెడ్డి మధ్య గ్యాప్ ఉంది.

ఇదిలావుంటే, కొమ్మూరి ప్రతాప్‌ రెడ్డిని డీసీసీ చేయాలని రేవంత్ రెడ్డి కూడా ప్రతిపాదించారు. రాజకీయంగా నిన్నమొన్నటి వరకు ఎవరికివారు అన్నట్లుగా ఉన్న రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు… జనగామ డీసీసీ విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చారు. అయితే కొమ్మూరి ప్రతాప్‌ రెడ్డిని డీసీసీగా పొన్నాల లక్ష్మయ్య వ్యతిరేకిస్తున్నారు. జనగామ జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లోని పార్టీ నేతల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన ఒక్కో పేరును సూచించారు. వారిలో ఎవరికి ఇచ్చినా అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. కానీ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నాన్‌ లోకల్‌ అనేది పొన్నాల వర్గం ప్రధాన అభ్యంతరంగా తెలుస్తోంది.

మరోవైపు జనగామ డీసీసీ పదవిని జంగా రాఘవకు ఇవ్వాలని పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఇక్కడ జంగా రాఘవనే డీసీసీగా పనిచేశారు. ఆయన్ను కొనసాగించాలని ఉత్తమ్ అధిష్టానం వద్ద ఒత్తిడి పెంచారు. కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కోసం రేవంత్ ప్రయత్నం చేయడం, జంగా రాఘవ, కొమ్మూరి ప్రతాపరెడ్డిలను పొన్నాల లక్ష్మయ్య వ్యతిరేకించడంతో జనగామ డీసీసీ నియామకం మరింత జటిలమైంది. అయితే తాజాగా చోటుచేసుకున్న పరిణామాలతో జనగామ డీసీసీ నియామకంపై కొంత క్లారిటీ వచ్చినట్టు కనపడుతోంది. ప్రతాప్‌రెడ్డికి అనుకూలంగా పీసీసీ రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు నిలబడ్డారు. వీరిద్దరూ కొమ్మూరికి మద్దతు పలకడంతో… పొన్నాల లక్ష్మయ్య, జంగా రాఘవలు సైలెంట్‌గా ఉంటారా? ఉత్తమ్ వ్యూహం ఎలా ఉంటుంది? వంటి ప్రశ్నలు రేకెత్తాయి. మొత్తానికి జనగామ డీసీసీ అంశంపై జగడం కొనసాగుతోంది. మరి ఈ రచ్చ ఇప్పట్లో ముగుస్తుందా? కంటిన్యూ అవుతుందా? ఎవరు పంతం నెగ్గించుకుంటారు? అనేది చూడాలి.

Leave A Reply

Your email address will not be published.