A place where you need to follow for what happening in world cup

HOT NEWS

అదానీ, చైనా, ఇతర అంశాలపై ”మౌన్ కీ బాత్” నడుస్తోంది

0

కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ వ్యంగ్యోక్తులు
న్యూఢిల్లీఏప్రిల్ 25: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెలవారీ రేడియా ప్రోగ్రాం “మన్ కీ బాత్” 100వ ఎపిసోడ్‌ ఈనెల 30న నభూతో నభవిష్యతి అన్న రీతిలో ప్రసారం చేసేందుకు బీజేపీ విస్తృత ఏర్పాట్లు చేస్తుండగా, ఈ ప్రోగ్రాంపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ వ్యంగ్యోక్తులు సంధించారు. అదానీ, చైనా, ఇతర అంశాలపై ”మౌన్ కీ బాత్” నడుస్తోందని అన్నారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు.”పీఎం శక్తివంతమైన పీఆర్ యంత్రాంగం ‘మన్ కీ బాత్’ 100 ఎపిసోడ్ అంటూ ఊదరగొడుతోంది. మరోవైపు అదానీ, చైనా, సత్యపాల్ మాలిక్ వెల్లడించిన అంశాలు, ఎంఎస్ఎంఈల విధ్వంసం, ఇతర కీలక అంశాలపై ‘మౌన్ కీ బాత్’ నడుస్తోంది” అని జైరామ్ రమేష్ ఆ ట్వీట్‌లో విమర్శించారు.

మోదీ ‘మన్ కీ బాత్’ 100వ ఎపిసోడ్‌ను దేశవ్యాప్తంగా ప్రసారం చేసేందుకు బీజపీ సన్నాహాలు చేస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేసే బాధ్యతను కేంద్ర మంత్రులు, ఎంపీలకు అప్పగించింది. ఆరోజన జరిగే వివిధ కార్యక్రమాల్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా పలువురు నేతలు పాల్గొంటారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం రూ.100 నాణేలను కూడా విడుదల చేస్తోంది.

దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని చేపట్టిన ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమం ఇప్పటి వరకూ 99 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. స్వచ్ఛ భారత్, బేటీ బచావో బేటీ బడావో, వాటర్ కన్జర్వేషన్, ఆయుష్, ఖాదీ తదితర అంశాలు ఆయా ఎపిసోడ్‌లో ప్రస్తావించడం, అంతగా గుర్తింపునకు నోచుకోని వ్యక్తులను వెలుగులోకి తేవడం సహా అనేక అంశాలతో ఈ రేడియో ప్రోగ్రాం జనబాహుళ్యానికి దగ్గరైంది. 2014 అక్టోబర్ 3న ‘మన్ కీ బాత్’ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రతి నెలా చివరి ఆదివారం మధ్యాహ్నం 11 గంటలకు ఆల్ ఇండియా రేడియా, డీడీ నెట్‌‌వర్క్‌లో ‘మన్ కీ బాత్’ ప్రసారం అవుతోంది.100వ ఎపిసోడ్‌ను దేశవ్యాప్తంగానే కాకుండా వివిధ దేశాల్లో లైవ్ ప్రసారం చేసేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తోంది.

Leave A Reply

Your email address will not be published.