Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ఆస్కార్ అవార్డు విజేతల సన్మానసభకు పిలుపులేవీ: నట్టి కుమార్ ఫైర్

0

తెలుగు చిత్ర పరిశ్రమ తరపున ఆదివారం సాయంత్రం జరిగిన ఆస్కార్ విజేతల సన్మాన సభను  మొక్కుబడిగా నిర్వహించినట్లుగా ఉందని ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని తన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ, “ఆర్ ఆర్ ఆర్” సినిమాకు అత్యంత ప్రతిష్టాత్మకమైన, అరుదైన ఆస్కార్ అవార్డు లభించడం చాలా చాలా సంతోషం. ప్రపంచలోని అన్ని సినిమా రంగాలు ఎదురుచూసే అవార్డు మన తెలుగు సినిమాకు దక్కడం తెలుగు వాళ్లు, తెలుగు సినిమా పరిశ్రమ గర్వించదగ్గ అంశం. దీంతో ఒక శిఖరానికి ఎక్కారు మనవాళ్ళు. అయితే అలాంటి ఆస్కార్ విజేతలకు తెలుగు చిత్ర పరిశ్రమ సన్మానం జరిపిన తీరు మాత్రం త్రీవ విమర్శలకు తావిస్తోంది. తెలుగు ఫిలిం ఛాంబర్, తెలుగు నిర్మాతల మండలి వాళ్లు అంత హడావిడిగా, మొక్కుబడిగా ఈ వేడుకను నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందని నేను ప్రశ్నిస్తున్నాను. చిత్ర పరిశ్రమలోని వివిధ శాఖలకు, అలాగే వివిధ అసోసియేషన్లకు, వివిధ ప్రముఖలకు, సాంకేతిక నిపుణలకు పిలుపులు లేకుండా, ఎవరో థర్డ్ పార్టీ ఆర్గనైజర్లుకు వేడుక నిర్వహించమని చేతులు దులిపేసుకోవడం ఎంతవరకు కరెక్ట్. నిర్మాతల మండలిలో జాయింట్ సెక్రటరీగా ఉన్న నాకు ఆదివారం వేడుక అయితే శుక్రవారం మీటింగ్ లో  వేడుకకు రమ్మని, బాధ్యతలు పంచుకోమని చెప్పారు.

దాంతో వారి నిర్వహణ తీరు నచ్చక, నేను వేడుకకు అసలు పోదలచుకోలేదు. ఇతర నిర్మాతలను, ఇతర ప్రముఖులను పిలకపోవడం అటుంచి కనీసం  “ఆర్ ఆర్ ఆర్” సినిమా హీరోలు కానీ నిర్మాత  కానీ హాజరు కాలేదంటే, వారి వీలు చూసుకోకుండా అంత అర్జెంటు గా పెట్టాల్సిన అవసరం ఎందుకొచ్చింది. అలాగే వేదికపై తెలంగాణ కు చెందిన మంత్రులు, ఎఫ్.డి. సి. చైర్మన్ వంటి ప్రముఖులు హాజరు కావడం సంతోషం. అయితే ఏపీ ప్రభుత్వానికి సంబందించిన మంత్రులు, ఎఫ్.డి. సి. చైర్మన్, ఎలక్ట్రానిక్ మీడియా చైర్మన్ వంటి ప్రముఖులు ఎందుకు హాజరు కాలేదు. పరిశ్రమ తరపున మీరు పిలువ లేదా? లేక పిలిచినా వారు హాజరు కాలేదా?. దీనిపై అటు ఏపీ ప్రభుత్వం తరపున, ఇటు చిత్ర పరిశ్రమ తరపున సంబంధిత వ్యక్తులు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది ఓ రకంగా ఏపీ ప్రభుత్వాన్ని అవమానించినట్లుగా నేను భావిస్తున్నాను.  తెలుగు నిర్మాతల మండలిలో నిధులు తగినంతగా లేక మెడి క్లెయిమ్ వంటి అత్యంత ముఖ్యమైన సభ్యుల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కట్టేందుకు మీన మేషాలు లెక్కిస్తుంటే… ఈ వేడుకకు తగినంత టైం తీసుకుని, స్పాన్సర్స్ ద్వారా జరిపి ఉంటే, నిర్మాతల మండలి ఎదురు డబ్బు పెట్టకుండా, మెడి క్లెయిమ్ పాలిసీకి చెల్లించాల్సిన డబ్బు కూడా సమకూరేది. ఆ మధ్య మైత్రీ మూవీ మేకర్స్ కు చెందిన నిర్మాత వై.రవిశంకర్ కూడా ఏవైనా ఈవెంట్స్ నిర్వహించి, నిర్మాతల మండలికి నిధులు సమకూర్చుకుని, సభ్యులకు సాయపడదామని అన్నారు కూడా. ఆ కోణంలో ఈ వేడుకను జరిపి ఉంటే, గ్రాండ్ గా ఉండటంతో పాటు నిర్మాతల మండలికి నిధులు సమకూరేవి. అయితే నిర్మాతల మండలిని నిధులను ఎదురు పెట్టేందుకు నేను ఎంత మాత్రం ఒప్పుకోను” అని అన్నారు.

ఇక ఏపీ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి గతంలో ఇచ్చిన నంది అవార్డులను కమ్మ అవార్డులుగా పోల్చడం ఎంతమాత్రం సరికాదు. చిత్ర పరిశ్రమ వాళ్లదంతా ఒకే కులం, ఒకే మతం. ఇక్కడ చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అన్న వ్యత్యాసం మాత్రం బోలెడంత ఉంది.కానీ కులం మాత్రం ఒకటే అది సినిమా కులం. పెద్ద వాళ్లు చెప్పిందే రెండు తెలుగు ప్రభుత్వాలు వింటున్నాయి తప్ప చిన్న వాళ్ళను పట్టించుకోవడం లేదు. చిన్న సినిమాలకు ఏపీ ప్రభుత్వమైనా కొంత న్యాయం చేస్తున్నది కానీ తెలంగాణ ప్రభుత్వం తమ దృష్టికి సరిగా రాకనో ఏమో తెలియదు కానీ చిన్న సినిమాల  సమస్యలను పరిష్కరించడం లేదు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు కూడా తాము చిత్ర పరిశ్రమకు ఎంతో చేసినట్లు చెప్పారు. అయితే వాస్తవంలో సినిమాలకు తెలంగాణలో 32 పర్చెంట్ వాటా వస్తే, ఏపీలో 68 పర్చెంట్ వస్తోంది. అయినప్పటికీ చాలా కంపెనీలు తెలంగాణాలోనే రిజిస్టర్ అయ్యి, ఇక్కడే తమ జీఎస్టీని చెల్లిస్తున్నాయి. ఈ విషయాలన్నీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి తెలుసో, లేదో నాకు తెలియదు. వారు ఇవన్నీ తెలుసుకోవాలని నా విన్నపం. అలాగే 2014 తర్వాత తెలంగాణ లో షూటింగ్ లొకేషన్స్ చార్జీలు 30 రెట్లు పెరిగాయి. చిన్న నిర్మాతలు తమ సినిమాలను తెలంగాణలోని థియేటర్లలో వేసుకోవాలంటే చాలా కష్టమైపోతోంది.

పర్చెంట్ పద్దతిలో కాకుండా చిన్న నిర్మాతలను రెంటల్స్ చెల్లించమని అడుగుతుండటంతో చిన్న సినిమాలు బతకడం లేదు. అలాగే చిన్న సినిమాలకు మధ్యాహ్నం 2-30 గంటలకు తప్పనిసరిగా ఒక మాట్నీ షో  ఇవ్వమని కోరిన కోరిక ఇంతవరకు ఫలించలేదు. ఏపీలో షూటింగులు చేస్తే రాయితీలు, ప్రోత్సహకాలు ఇస్తామని ప్రభుత్వం వారు చెబుతున్నారు కూడా. 30 పర్చెంట్ షూటింగ్ లు చేస్తామని పరిశ్రమ తరపున సినీ పెద్దలు మాట కూడా ఇచ్చారు. అయినప్పటికీ చాలామంది చేయడం కూడా లేదు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఏపీ ఫైబర్ నెట్ ద్వారా  సినిమాలను రిలీజ్ చేస్తామని మొన్న ఓ మీటింగ్ పెట్టారు. వాస్తవానికి ఈ ప్రతిపాదన ఎప్పుడో 2013లో నేను ప్రొడ్యూసర్స్ సెక్టార్ చైర్మన్ గా ఉన్నప్పుడే వివిధ సంస్థల ద్వారా వచ్చింది. అయితే అది వర్కవుట్ కావడం కష్టమని అనిపించింది. మళ్ళీ దానిని తీసుకుని వస్తే, చిత్ర పరిశ్రమలోని అందరితో కలిసి మీటింగ్ పెడితే బావుండేది. పోసాని గారు కానీ అలీ గారు కానీ చిత్ర పరిశ్రమలోని వారితో మమేకమై ముందుకు వెళితే బావుంటుంది’ అని అన్నారు

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie