సామూహిక అత్యాచారాలకు ఉరి!
లైంగికదాడులు చేస్తే యావజ్జీవం
ఉగ్రవాద కేసులలలోనూ మరణశిక్షలు
కొత్త చట్టాలతో బాధితులకు భరోసా ఉంటుంది
ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ఇక రద్దు
ఇకనుంచి రాజద్రోహ చట్టమూ ఉండబోదు
వాటి స్థానంలో ‘భారతీయ న్యాయ సంహిత’ ‘భారతీయ సాక్ష్య’ ‘భారతీయ నాగరిక్ సురక్షా సంహిత’
లోక్ సభలో బిల్లులను ప్రవేశపెట్టిన అమిత్ షా
శిక్షించడం కంటే నేరాలను నియంత్రించడమేనని తమ లక్ష్యమని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్షా అన్నారు. అలాగని నేరం చేసినవారిని వదిలివేసే ప్రసక్తే లేదన్నారు. బాధితులకు పూర్తి భరోసా కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. తాము చట్టాలలో తీసుకువస్తున్న మార్పులతో దేశంలో గణనీయంగా నేరాలను నిరోధించగలమననే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మహిళలు, బాలికల భద్రతను దృష్టిలో ఉంచుకొని కీలక సవరణలతో నూతన చట్టాలను రూపొందించామన్నారు. దేశంలో భవిష్యత్ తరాలు సురక్షితంగా ఉండడమే తమ అభిమతమని పేర్కొన్నారు. రాజద్రోహం చట్టాన్ని పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. ఇక నుంచి దేశభద్రతకు, రాజద్రోహానికి పాల్పడితే మాత్రం సెక్షన్150 ప్రకారం చర్యలు ఉంటాయని అన్నారు. అత్యాచారానికి పాల్పడితే ఉరిశిక్ష తప్పదన్నారు.
భారతీయ చట్టాలలో కీలక మార్పులు చేస్తూ మూడు నూతన బిల్లులను అమిత్షా శుక్రవారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఐపీసీ స్థానంలో ‘భారతీయ న్యాయ సంహిత’ ఐఈఏ స్థానంలో ‘భారతీయ సాక్ష్య’ సీసీపీ స్థానంలో ‘భారతీయ నాగరిక్ సురక్షా సంహిత’ చట్టాలను తీసుకొస్తున్నారు. ఈ బిల్లులను పరిశీలన కోసం పార్లమెంటరీ స్థాయి సంఘానికి పంపించనున్నారు. ఆమోదం పొందితే ఐపీసీ–1860, క్రిమినల్ ప్రొసిజర్ యాక్ట్–1898, ఎవిడెన్స్ యాక్ట్–1872 స్థానంలో ఇవి అమలులోకి వస్తాయి. కొత్త చట్టాలతో 90 శాతానికి పైగా నేరస్థులకు శిక్షలు పడడం ఖాయమని అమిత్ షా పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్ర్యం రాకముందు బ్రిటిష్ పాలకుల కాలంలో తీసుకువచ్చిన సీఆర్‌పీసీ, స్వాతంత్ర్యం అనంతరం తెచ్చిన ఐపీసీ ద్వారానే ఇప్పటివరకు నేరం చేసినవారికి కోర్టులు శిక్షలు విధిస్తున్నాయి. ఈ క్రమంలోనే, కాలం చెల్లిన చట్టాలను రద్దు చేయాలని ఇప్పటికే చాలాసార్లు సుప్రీంకోర్టు సహా వివిధ హైకోర్టులు కేంద్ర ప్రభుత్వానికి సూచించాయని మంత్రి చెప్పారు. దీంతో చాలా మార్పులతో కొత్త చట్టాలను తీసుకువస్తున్నట్లు వెల్లడించారు.
మార్పులు ఇలా
1. మహిళల మీద అత్యాచారం కేసులలో శిక్షను ఏడేండ్ల నుంచి పదేండ్లకు పెంపు
2. బాలికల మీద లైంగిక దాడికి పాల్పడితే యావజ్జీవ కారాగార శిక్ష
3. బాలికల మీద సామూహిక అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష
4. అసహజ లైంగిక నేరాల కింద సెక్షన్ 377 పూర్తిగా రద్దు చేశారు
5. పిల్లలపై నేరాలకు సంబంధించి నూతన సెక్షన్లను చేర్చారు.
6. నిర్లక్ష్యంతో మృతికి కారణమైతే శిక్షను రెండేళ్ల నుంచి ఏడేళ్లకు పెంచారు.
7. వ్యవస్థీకృత నేరాలతో మృతికి కారణమైనవారికి కూడా మరణశిక్ష విధించనున్నారు.
8. ఉగ్రవాదానికి కూడా ఓ కొత్త సెక్షన్ను చేర్చారు. ఇందులోనూ మరణశిక్ష కోసం నిబంధనను రూపొందించారు.
9. దేశద్రోహ చట్టం కింద అమలు చేసే శిక్షను మూడేండ్ల నుంచి ఏడేండ్లకు పెంచారు.
10. మహిళలు, పిల్లలపై నేరాలకు పాల్పడితే కొత్త సెక్షన్లను చేర్చారు.
హత్యలు, బాలికల మీద అత్యాచారాలు వంటి వాటికి గరిష్ఠంగా మరణశిక్ష విధించేలా నిబంధనలు ఉన్నాయి. చిన్న నేరాలకు సంబంధించి సమాజ సేవ వంటి శిక్షలు కూడా బిల్లులో ఉన్నాయని మంత్రి తెలిపారు. ఇక తిరుగుబాటు, విధ్వంసక కార్యకలాపాలు, వేర్పాటువాద, దేశ సార్వభౌమత్వం, ఐక్యత, సమగ్రతకు అపాయం కలిగించే వాటికి కూడా పలు సెక్షన్ల కింద శిక్షలను బిల్లులో చేర్చారు.