కోట్ల క్యాంప్ ఆఫీసులోనారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు
ఎమ్మిగనూరు : ఈనెల 27న “యువ గళం” పేరుతో … టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 400 రోజులు 4000 కి.మీ. చేపట్టిన పాదయాత్రను రాష్ట్రవ్యాప్తంగా విజయవంతం చేసి 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేస్తామని, నారా లోకేష్ పాదయాత్రను అడ్డుకునే శక్తి ఎవరికీ లేదని తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు. సోమవారం స్థానిక కోట్ల క్యాంపు కార్యాలయము నందు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 40 వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా టిడిపి నేతలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా టిడిపి నేతలు మాట్లాడుతూ… చంద్రబాబు చేపట్టిన పర్యటనలకు ప్రజల బ్రహ్మరథం పట్టడాన్ని చూసి ఓర్వలేని ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ర్యాలీలు, రోడ్ షోలు నిషేధిస్తూ … జీవో నెంబర్ 1 చీకటి జీవోలను తీసుకువచ్చారని మండిపడ్డారు. గతంలో జగన్ పాదయాత్ర చేసినప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు అడ్డుకోలేదు కదా! అని గుర్తు చేశారు.నారా లోకేష్ పాదయాత్ర పై ఇప్పటికే ప్రజలలో ఆసక్తి పెరిగిందని ఈ విషయాన్ని గమనించిన వైసీపీ ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టిందన్నారు. లోకేష్ పాదయాత్రకు ఎన్ని అడ్డంకులు అవరోధాలు ఎదురైనా ప్రజల పక్షాన, ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాక్షస పాలనను తరిమికొట్టేందుకు పాదయాత్ర చేసి తీరుతామని తెలిపారు. ఒకవేళ ప్రభుత్వం పాదయాత్రను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.