అదనపు కలెక్టర్ ను అడ్డుకున్న పంచాయతీ కార్మికులు
Panchayat workers who blocked the additional collector
- నాగాన్ పల్లి పర్యటనకు వచ్చిన అదనపు కలెక్టర్
- తమ సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందజేత
తమ సమస్యలు పరిష్కరించాలని గత 29 రోజులుగా సమ్మె చేపడుతున్న గ్రామ పంచాయతీ కార్మికులు జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ ప్రయాణిస్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు. మండల పరిధిలోని నాగన్ పల్లి లో పర్యటించి ఇబ్రహీంపట్నం మీదుగా హైదరాబాద్ వెళుతున్న జాయింట్ కలెక్టర్ ను గురువారం సాయంత్రం తహసిల్దార్ కార్యాలయం సమీపంలో రోడ్డుపై కారుకు అడ్డంగా నిలబడ్డారు. తమ సమస్యలు పరిష్కరించాలని, సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని కారుకు అడ్డు పడ్డారు.
దీంతో పోలీసులు వారిని పక్కకు నెట్టే ప్రయత్నం చేశారు. సీఐటియు నాయకులు, పంచాయతీ కార్మిక సంఘం నాయకుల ఆధ్వర్యంలో తమ సమస్యలను పరిష్కరించాలని అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకుపోతామని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు జాయింట్ కలెక్టర్ ను కలిసేందుకు అనుమతించారు. కార్మికుల ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు వారి ప్రధాన డిమాండ్లను ఆమె దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జాయింట్ కలెక్టర్ కు అందజేశారు.
అనంతరం సీఐటీయూ నాయకులు, పంచాయతీ కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ.. అనేక సంవత్సరాలుగా అతి తక్కువ వేతనంతో గ్రామాలలో సేవ చేస్తున్న పంచాయతీ కార్మికులు సమ్మె చేస్తూఉంటే ప్రభుత్వం స్పందించకుండా కాలయాపన చేయడం సరైనది కాదన్నారు. 11వ పిఆర్సి నిర్ణయించిన మేరకు కనీస వేతనం రూ.19 వేలు అమలు చేసి, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. పని ప్రదేశాల్లో ప్రమాదవశాత్తు మరణించిన కార్మికులకు రూ. 10 లక్షలు నష్ట పరిహారం ఇవ్వాలన్నారు. ఆదివారం, పండగ సెలవులు, జాతీయ, అంతర్జాతీయ సెలవు దినాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తుతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.