- ‘మావో’ నేతల రివార్డు పోస్టర్లు అంటిస్తున్న పోలీసులు..
- విస్తృతంగా వాహనాల తనిఖీలు..
- 3న ముగియనున్న సంస్మరణ వారోత్సవాలు..
మావోయిస్టు పార్టీ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలపై పోలీసులు గట్టి నిఘా వేసినట్లు తెలుస్తోంది. వారోత్సవాలను పురస్కరించుకొని ఏవైనా సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు మావోయిస్టు పార్టీ నేతల ఫోటోలతో కూడిన వాల్ పోస్టర్లను జిల్లా అంతటా పోలీసులు గోడలపై అంటిస్తున్నారు. వారిని పట్టిస్తే తగిన బహుమతులు అందజేస్తామని పోస్టర్లలో పేర్కొన్నారు. రహదారుల వెంట వాహనాలను ఆపి అణువణువు తనిఖీలు నిర్వహించారు. ఒకప్పుడు మావోయిస్టులు, పోలీసుల చర్యలతో ఈ ప్రాంతం అట్టుడికింది. నిద్రలేని రాత్రులెన్నో ఈ ప్రాంత ప్రజలు గడిపారు. రోజులు గడిచిన కొలది మావోయిస్టుల ప్రాబల్యం తగ్గిపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
అప్పటినుండి మావోయిస్టుల కార్యకలాపాలు తగ్గిపోయినప్పటికీ, జిల్లాలో పార్టీ ఉనికి లేనప్పటికీ, ఈ ప్రాంతాలకు చెందిన వారు మావోయిస్టు పార్టీలో పనిచేస్తూ ఇంకా వివిధ హోదాల్లో కొనసాగుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలోని సరిహద్దు జిల్లాలైన జయశంకర్ భూపాలపల్లి, ములుగు ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పోలీసులు నిఘా వేస్తూనే ఉన్నారు. జూలై 28 నుండి ఆగస్టు 3 వరకు మావోయిస్టు పార్టీ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు జరుగుతాయి. కాగా వారోత్సవాల్లో భాగంగా మారుమూల ప్రాంత గ్రామాల్లో ఏవైనా కార్యక్రమాలు జరగవచ్చనే ఉద్దేశంతో పోలీసులు ఓవైపు తనిఖీలు, మరోవైపు పోస్టర్ల రూపేనా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మావోయిస్టు పార్టీ ఉద్యమంలో అసువులు బాసిన అమరులను స్మరించుకునేందుకు ఎలాంటి కార్యక్రమాలకు తావులేకుండా పోలీసులు ముందస్తు గట్టి చర్యలు చేపడుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో మావోయిస్టు పార్టీకి మంచి పట్టున్న క్రమంలో ప్రతి ఏటా వారోత్సవాలు నిర్వహించేది. పొరుగు రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో నక్సల్స్ అడపాదడపా ఈ ప్రాంత సరిహద్దు ప్రాంతాలకు వచ్చి వెళ్తుంటారని, అలాంటి అవకాశాలు ఉండకూడదని పోలీసులు అప్రమత్తమై, మావోయిస్టుల చర్యలకు అడ్డుకట్ట వేసేలా చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణలో పట్టుకోసం మావోయిస్టులు ప్రయత్నాలు చేస్తున్నారనే ఊహాగానాలు అప్పట్లో వినిపించినప్పటికీ పోలీసులు అలాంటి అవకాశాలకు తావు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.
పోస్టర్లలో పదిమంది నక్సల్స్ ఫోటోలు..
పదిమంది నక్సల్స్ ఫోటోలతో కూడిన వాల్ పోస్టర్లను పోలీసులు వివిధ మండలాలు, గ్రామాల్లోని గోడలపై అంటిస్తున్నారు. పోస్టర్లలో ముఖ్యంగా దామోదర్, వెంకటేష్, ఆజాద్, సుధాకర్, బద్రు, మహేష్, లచ్చన్న, మంతు, కరుణాకర్, మహేందర్ తదితర పేర్లను, ఫోటోలతో కూడిన పోస్టర్లను అంటించారు. పోస్టర్లలో ఉన్న మావోయిస్టుల సమాచారం తెలిపిన వారికి రూ.5 లక్షల నుండి రూ.20 లక్షల వరకు బహుమతి ఇవ్వబడుతుందని రాసి ఉంది. సమాచారం మాకు, బహుమతి మీకు అంటూ వాల్ పోస్టర్లను ఏర్పాటు చేసి పోలీసుల ఫోన్ నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఈ పోస్టర్లను ఆయా గ్రామాలకు వెళ్లి పోలీస్ కానిస్టేబుళ్లు గోడలపై అంటిస్తూ, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.