A place where you need to follow for what happening in world cup

HOT NEWS

పేరుకే పదవీ… అధికారాలపై నేతల్లో ఆవేదన

0

విజయవాడ, జనవరి 28,
పేరుకే మేం మేయరు.. డిప్యూటీ మేయరు. కార్పొరేటర్లం. మేం చెబితే వినే అధికారి లేడు. అంతా ఎమ్మెల్యేదే పెత్తనం. ఆయన చెబితేనే అధికారులు పని చేస్తారు. ఆ మాత్రం దానికి మాకు ఈ పదవులెందుకు?. అధికారానికి రాక ముందు నుంచి పార్టీ జెండాలు మోస్తున్నాం. ఇప్పటికీ అదే చాకిరీ. ఇక మేం ఎదిగేదెప్పుడు?. ఇలాగైతే మమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తల్లో చులకనై పోమా !” ఓ నగరానికి చెందిన మేయర్, డిప్యూటీ మేయరు, కార్పొరేటర్ల ఆవేదన ఇది. ఇక మండల కేంద్రాల్లో జడ్పీటీసీలు, ఎంపీపీల పరిస్ధితీ దీనికి భిన్నంగా ఏమీ లేదు. చివరకు రెడ్డి సామాజిక వర్గం తప్ప ఇతర మంత్రులు కూడా తమను డమ్మీలుగా మార్చేశారని వాపోతున్నారు. వైసీపీలో ఈ ఆక్రోశానికి ఎక్కడో ఒకచోట ఫుల్స్టాప్పెట్టకుంటే అసలుకే మోసం రావొచ్చని ఆ పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.ఇలాంటి పెత్తందారీ పోకడలు ఇప్పుడు కొత్తగా వచ్చినవేం కాదు. గత ప్రభుత్వంలో హోంమంత్రిగా ఉన్న చినరాజప్ప కనీసం ఓ కానిస్టేబుల్ను బదిలీ చేయలేక పోయినట్లు వార్తలొచ్చాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చాక గుంటూరు జిల్లా పత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత హోంమంత్రిగా చేశారు.

పేరుకే తాను హోంమంత్రిని అని ఆమె వాపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇంకా రెడ్డి సామాజిక వర్గం కాని మంత్రులందరూ ఇదే అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఎమ్మెల్యేల పరిస్థితీ అలాగే ఉంది. కింది స్థాయి ప్రజాప్రతినిధుల్లోనూ ఇదే వివక్ష కొనసాగుతోందని తెలిసిన వాళ్ల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల కార్యకర్తల్లో తమ పరువు పోతోందని వాపోతున్నారు.వైసీపీ ప్రభుత్వం అధికారానికి వచ్చినప్పటి నుంచి గల్లా పెట్టె సీఎం జగన్చేతుల్లోకి వెళ్లిపోయింది. ఆయన ఆదేశాలు లేనిదే ఏ ఒక్క పనికి నిధులు ఇచ్చేది లేదు. బిల్లులు చెల్లించేది లేదు. సీఎం చుట్టూ ఉన్న కోటరీదే పెత్తనమంతా. ప్రతీ నెలా సంక్షేమ పథకాల అమలుకు నిధుల్లేమి వెంటాడుతోంది. ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని దుస్థితిని ఎదుర్కోవాల్సి వస్తోంది. దీంతో ఖజానా నిబంధనలన్నింటినీ తోసిరాజని వస్తోన్న ఆదాయం, తెస్తోన్న అప్పులు ద్వారా వచ్చే సొమ్మంతా సీఎం కనుసన్నల్లోనే వెచ్చిస్తున్నారు.

ఇక మంత్రులు స్వతంత్రంగా పనులు మంజూరు చేసే అవకాశం లేకుండా పోతోంది. కనీసం చేసిన పనులకు బిల్లులు కూడా ఇప్పించలేకపోతున్నామనే ఆవేదన నెలకొంది. చివరకు తమ శాఖల పరిధిలో ఏం చెప్పాలన్నా తమకు స్వేచ్ఛ లేదనే భావనలో పడిపోయారు.ప్రస్తుతం ఉన్న మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరగడానికి ఇదో కారణమైనట్లు తెలుస్తోంది. స్థానిక ప్రతినిధులపై ఎమ్మెల్యేల పెత్తనం, ఎమ్మెల్యేల నెత్తిన మంత్రులు తిష్ట వేయడం, అంతిమంగా అధికారం మొత్తం సీఎంవోలో కేంద్రీకృతం కావడం వల్లేనని పార్టీ వర్గాల్లో నెలకొంది. రానున్నదంతా ఎన్నికల సమయం. భేషజాలను వదిలేసి పై నుంచి కింది స్థాయి కార్యకర్తదాకా ఐక్యంగా కృషి చేయాల్సిన అవసరముంది. ఇప్పుడు గత ఎన్నికలను నెగ్గినంత తేలిక్కాదు. ఇలాంటి ఆక్రోశాలకు, అసంతృప్తులకు సీఎం జగన్ఎక్కడో ఒకచోట చెక్పెట్టాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి.

Leave A Reply

Your email address will not be published.