ముద్ర, ప్రతినిధి , మంచిర్యాల : మంచిర్యాల హమాలివాడలో రహదారి విస్తరణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెళ్లి దివాకర్ రావు, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. అభివృద్ధి పనుల శంకుస్థాపన శిలాఫలకాలపై ప్రోటోకాల్ ప్రకారం వార్డు తమ పేర్లు లేవంటూ కాంగ్రెస్ కౌన్సిలర్లు పూదరి సునీత, సల్ల మహేష్ ఎంపీ వెంకటే ష్ ,ఎమ్మెల్యే దివాకర్ రావును నిలదీశారు. దీంతో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం జరిగింది. ధీంతో రెచ్చిపోయిన పెద్దపెల్లి ఎంపీ వెంకటేష్ నేత గుండాల్లారా ఖబర్దార్ అంటూ కాంగ్రెస్ నేతలకు వార్నింగ్ ఇచ్చారు.
కాంగ్రెస్ కౌన్సిలర్ లు మజీద్, మహేష్, సునీత, బానేశ్ ధీటుగా ప్రతిస్పందించారు. వివాదం హెచ్చు మీరడంతో పోలీస్ లు రంగంలోకి దిగారు. శంకుస్థాపన కార్యక్రమము నుంచి కాంగ్రెస్ నేతలను పక్కకు తొలగించారు. ప్రోటోకాల్ విషయంలో ఎంపీ ద్వంద వైఖరి అవలంభించడం శోచనీయమని కాంగ్రెస్ కౌన్సిలర్ లు అన్నారు. ప్రోటోకాల్ పాటించలేదని జడ్పి సీ.ఈ. ఓ పై ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయాన్ని విస్మరించడం విచారకరమని అన్నారు. అనంతరం ఎంపీ, ఎమ్మెల్యే హమాలివాడ నుంచి తిలక్ నగర్, రైల్వే స్టేషన్ వెనుక చౌరస్తా నుంచి గాంధీనగర్ వరకు 5 కోట్ల వ్యయంతో రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించారు.