ముద్ర ప్రతినిధి, వనపర్తి: ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం అంటూ ప్రచారం చేస్తున్న ఆర్టీసీ అధికారులు బస్సులను నడిపే డ్రైవర్ల విషయంలో ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. డ్రైవర్ బస్సును అతివేగంగా, అజాగ్రత్తగా నడపడంతో అర్ధరాత్రి బస్సు బోల్తాపడటం, ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ప్రయాణికుల్లో నెలకొంది. ప్రయాణికులు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బయటకు వచ్చే పరిస్థితి ఏర్పడింది. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం ఎన్ హెచ్ 44 పై ఈ సంఘటన చోటుచేసుకుంది.
స్థానిక ఎస్సై నాగ శేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట డిపోకు చెందిన ఆర్టీసీ లగ్జరీ ts 30 Z 0025 నంబర్ గల బస్సు ప్రయాణికులతో శనివారం సాయంత్రం యాదగిరిగుట్ట నుండి తిరుపతికి బయలుదేరింది. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో వనపర్తి జిల్లా కొత్తకోట సమీపంలో మదర్ తెరిసా జంక్షన్ దగ్గరకు రాగానే బస్సు డ్రైవర్ ముందు వెళ్తున్న లారీని ఓవర్ టెక్ చేయడానికి వెళ్ళగా అదుపుతప్పి బస్సు బోల్తా పడింది.
బస్సు ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 37 మంది ప్రయాణికులు ఉన్నట్లు వీరిలో 15 మందికి గాయాలు కాగా అందులో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయని తెలిపారు. స్థానికుల సమాచారంతో ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకున్న పోలీసులు 108 అంబులెన్స్ లో వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు గాయపడిన వారి ఫిర్యాదు మేరకు ఆర్టీసీ డ్రైవర్ ఎండి రఫీక్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై నాగ శేఖర్ రెడ్డి తెలిపారు.