Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

12 ఏళ్ల తర్వాత బైపాస్ కు మోక్షం

0

విజయవాడ, ఫిబ్రవరి 9,
విజయవాడ మీద ట్రాఫిక్ ఒత్తిడి తగ్గించేందుకు ఎన్టీఆర్ జిల్లా పొట్టిపాడు నుంచి గుంటూరు జిల్లా కాజ వరకు 49.3 కి.మీ. పొడవున ఈస్ట్ బైపాస్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. దాదాపు రూ.4,607 కోట్ల రుపాయల అంచనాతో ఈ నిర్మాణం చేపట్టనున్నారు. కృష్ణాజిల్లా పొట్టిపాడు నుంచి గుంటూరు జిల్లా కాజ వరకు మొత్తం 49.3 కి.మీ. మేర నిర్మించేలా కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలు రూపొందించింది.కృష్ణానదిపై వారధి దిగువున 3.750 కి.మీ. వంతెన కూడా నిర్మిస్తారు. మొత్తం ఈ ప్రాజెక్టుకు రూ.4,607.80 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. విజయవాడకు పశ్చిమం వైపు చిన్నఅవుటపల్లి నుంచి గొల్లపూడి మీదుగా కాజ వరకు బైపాస్‌ నిర్మాణం జరుగుతుండగా, తూర్పువైపు కూడా బైపాస్‌ కావాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రభుత్వ ప్రతిపాదనకు సమ్మతి తెలిపిన భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎలైన్‌మెంటు ఖరారు, డీపీఆర్‌ సిద్ధం చేయిస్తోంది.ఈస్ట్‌ బైపాస్‌ నిర్మాణానికి మొదట 40కి.మీ.

మేర పొడవున నిర్మించాలని భావించారు. ఇందులో నాలుగు మార్గాలను పరిశీలించి తీసుకున్నారు. ఇందులో 49.3 కి.మీ. ఎలైన్‌మెంటుకు ఎన్‌హెచ్‌ఏఐ ఆమోదం తెలిపే వీలుందని అధికారులు చెబుతున్నారు. దాదాపుగా ఖరారైన ఎలైన్‌మెంటు కృష్ణాజిల్లా పరిధిలో 29.5 కి.మీ., గుంటూరు జిల్లా పరిధిలో 19.770 కి.మీ. మేర ఉంటుంది. 100 కి.మీ. వేగంతో వాహనాలు ప్రయాణించేందుకు వీలుగా నాలుగు వరుసలుగా ఈస్ట్ బైపాస్ నిర్మాణం చేపడుతున్నారు. భవిష్యత్తులో ఆరు వరుసల విస్తరణకు వీలుగా 60 మీటర్ల వెడల్పుతో ఎలైన్‌మెంటు ఖరారు చేస్తున్నారు.మొత్తం 295 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంటుందని అంచనా వేశారు. జాతీయ రహదారి నిర్మాణ వ్యయం 2,215.48 కోట్లు, 295 ఎకరాల భూసేకరణతో పాటు, వాటిలో ఉన్న నిర్మాణాలకు పరిహారంగా రూ.1,176.08 కోట్లు, విద్యుత్‌ స్తంభాలు, కాల్వలను పక్కకు మార్చేందుకు రూ.39.41 కోట్లు, జీఎస్టీ రూ.1,176.82 కోట్లు కలిపి మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.4,607.80 కోట్లు ఖర్చు అవుతుందని అంచనాలు రూపొందించారు. తూర్పు బైపాస్‌ నిర్మాణంలో కృష్ణానదిపై వంతెనతో పాటు , 22 ప్రధాన వంతెనలు, 2 ఆర్వోబీలు, ఒక ఫ్లైఓవర్‌, 2 ఇంటర్‌ఛేంజ్‌లు నిర్మించేలా ప్రాథమిక డిజైన్ ఖరారు చేశారు.

కృష్ణా తూర్పు బైపాస్ కృష్ణాజిల్లా ఉంగుటూరు, గన్నవరం, కంకిపాడు, తోట్లవల్లూరు, పెనమలూరు, ఉయ్యూరు మండలాల్లోని.. ఆత్కూరు, పెదఅవుటపల్లి, అల్లాపురం, బుతిమిల్లిపాడు, తెన్నేరు, తరిగొప్పుల, మారేడుమాక, కోమటిగుంట, మానికొండ, కోలవెన్ను, దావులూరు, నేపల్లె, చలివేంద్రపాలెం, బొడ్డపాడు, రొయ్యూరు మీదుగా వెళ్లనుంది. అక్కడినుంచి కృష్ణా నదిపై వంతెన దాటాక గుంటూరు జిల్లాలోని కొల్లిపర్ల, దుగ్గిరాల, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని.. వల్లభాపురం, పెరకలపూడి, చుక్కపల్లివారిపాలెం, మోరంపూడి, చిలువూరు, తుమ్మపూడి, చినకాకాని, కాజ గ్రామాల మీదగా ఎన్‌హెచ్‌-16లో కలుస్తుంది.తరిగొప్పుల, మోరంపూడిల వద్ద రైల్వేలైన్లు, దావులూరు వద్ద మచిలీపట్నం-విజయవాడ జాతీయరహదారి మీదగా తూర్పుబైపాస్‌ వెళ్లేలా ఎలైన్‌మెంటు రూపొందించారు. డిపిఆర్‌కు తుది ఆమోదం లభించాల్సి ఉందని, చివర్లో స్వల్ప మార్పులు ఉండే వీలుందని అధికారులు చెబుతున్నారు.

బైపాస్‌ నిర్మాణానికి భూసేకరణ వ్యయాన్ని రాష్ట్రప్రభుత్వం భరించాలని తొలుత కేంద్రం కోరింది.ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో నిధులు వెచ్చించే పరిస్థితి లేదని రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి తెలిపింది. దీంతో ప్రాజెక్టు నిర్మాణంలో వినియోగించే వివిధ ఖనిజాలకు తీసుకునే సీనరేజి ఫీజు, నిర్మాణ సామగ్రికి రాష్ట్ర జీఎస్టీని మినహాయించాలని కేంద్రం సూచించింది. విజయవాడకు సమీపంలో నిర్మించనున్న మల్టీమోడల్‌ లాజిస్టిక్‌ పార్క్‌కు 100 ఎకరాలు ఉచితంగా కేటాయించాలని కేంద్రం కోరింది. దీంతో మంగళగిరిలో 100 ఎకరాలను రాష్ట్రప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ మేరకు నిధులను సర్దుబాటు చేయనున్నారు.

 

 

 

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie