గూడూరు: మండలం తీపనూరు-మేకనూరు అటవీ ప్రాంతం పరిధిలో 7గురు స్మగ్లర్లను అరెస్టు చేయడంతో పాటు వీరి నుంచి 12ఎర్రచందనం దుంగలు, ఎటియోస్ లివా కారు, మోటారు సైకిల్ లను టాస్క్ ఫోర్సు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్సు ఎస్పీ కే.చక్రవర్తి ఆదేశాల మేరకు డీఎస్పీ మురళీదర్ అధ్వర్యంలో ఆర్ఎస్ఐ వినోద్ కుమార్ టీమ్ మంగళవారం రాత్రి నుంచి గూడురు సెక్షన్ పరిధిలో తీపనూరు-మేకనూరు రోడ్డులోని అటవీ పరిసర ప్రాంతాల్లో కూంబింగ్ చేపట్టారు. ఆ రోడ్డులో పడమర వైపు ఒక కారు, మోటారు సైకిలు నిలుపబడి ఉండటంతో, వారిని సమీపించారు. పోలీసులను చూసి వారు పారిపోయే ప్రయత్నం చేశారు. వారిని వెంబడించి పట్టుకున్నారు.
వీరి నుంచి 12ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారు 7గురు ఉండగా, వారిని పుత్తూరు మండలం డి.సుబ్రమణ్యం (60), నగరికి చెందిన ఎస్.పళనివేలు (50), ఎంజీ శేఖర్ (42), గూడూరు మండలం నేలటూరుకు చెందిన గోర్తల కృష్ణయ్య, (42), దేవిపాలెంకు చెందిన సిద్దపురెడ్డి ప్రసాద్ (26), మందడి మనోహర్ (57), వరదయ్యపాలెంకు చెందిన సలవారి రవి (35)లుగా గుర్తించి అరెస్టు చేశారు. వీరిని తిరుపతి టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషన్ కు తీసుకుని వచ్చి కేసు నమోదు చేశారు. ఎస్ఐ మోహన్ నాయక్ కేసు విచారిస్తున్నారు. వినోద్ కుమార్ టీమ్ ను ఎస్పీ అభినందించారు.