ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతో కొందరు వాహనదారులు నెంబర్ ప్లేట్ ను ట్యాంపరింగ్ చేస్తుంటారు. ఒక నెంబర్ ను కనిపించకుండా చేయడం, నెంబర్ ప్లేట్ కు మాస్క్ పెట్టడం, ప్లేట్ ను పక్కకు వంచడం ఇలా రకరకాల ట్రిక్స్ ప్రదర్శిస్తుంటారు. నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ పై దృష్టి పెట్టిన రాచకొండ ట్రాఫిక్ పోలీసులు..స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. నెంబర్ ప్లేట్ సరిగా లేకపోయిన, కనిపించకుండా వంచినా, అస్పష్ట నెంబర్ ప్లేట్ ఉన్నా కేంద్ర మోటారు వాహన చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఈ కేసుల్లో వాహనదారులు జైలుకు కూడా వెళ్లిన సందర్భాలు ఉన్నాయి.
జనవరి నుంచి ఇప్పటి వరకు రాచకొండ కమిషనరేట్ పరిధిలో 49 వేలకు పైగా నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ తో తొలిసారి దొరికిన వాహనదారులు వెంటనే వాటిని సరిచేసుకోవాలని, లేకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని రాచకొండ జాయింట్ సీపీ సత్యనారాయణ తెలిపారు. కొత్త వాహనాలకు 30 రోజుల్లోగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని నెంబర్ పొందాలని సూచించారు. నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ చేసి పలుమార్లు పట్టుబడిన ఆరుగురికి కోర్టు జరిమానా, జైలు శిక్ష విధించిందన్నారు.
కోర్టు వాహనదారులకు రూ.5 వేల వరకు జరిమానా, మూడు నుంచి ఐదు రోజుల వరకు జైలు శిక్ష కూడా విధించిందని తెలిపారు. నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే వారిపై కేసులు నమోదు చేసి ఛార్జ్ షీట్లు నమోదు చేస్తామని హెచ్చరించారు. కోట్లు పెట్టి కార్లు కొంటున్న కొందరు నేతలు ఫ్యాన్సీ నంబర్ల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రభుత్వానికి రావాల్సిన రాబడికి గండికొడుతున్నారు. కొత్త వాహనానికి ఫ్యాన్సీ నెంబర్ కావాలంటే నిబంధన ప్రకారం ఆన్‌లైన్‌లో రూ.2 లక్షల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎక్కువ మంది ఒకే ఫ్యాన్సీ నెంబర్ కు పోటీ పడితే ఆ నెంబర్ ను ఈ-వేలం వేస్తారు.ఈ వేలంలో ఎక్కువ ధర కోట్ చేసిన వారికే ఆ నెంబర్ కేటాయిస్తారు. 9999 నెంబర్ ఈ -వేలంలో రూ.10 లక్షల వరకూ వెళ్లిన సందర్భాలు కూడా లేకపోలేదు.
అయితే ఏపీలో కొందరు నేతలు ఈ-వేలం లేకుండా నంబరు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇటీవల ఓ వాహనానికి ఫ్యాన్సీ నెంబర్ వేలం లేకుండా ఇచ్చేందుకు కొందరు నేతలు తీవ్ర ప్రయత్నాలు చేయడం చర్చకు దారితీసింది. నెంబర్ కేటాయింపునకు రవాణా శాఖ అధికారులు ఫైల్ ను ప్రభుత్వానికి పంపగా ఆర్థిక శాఖ దానిని తిరస్కరించింది. ఆన్ లైన్ లో ఫ్యాన్సీ నెంబర్ వస్తే… అది ఎక్కువ సేపు ఆన్‌లైన్‌లో కనిపించకుండా అధికారులపై నేతలు ఒత్తిడి తెస్తున్నారు. అధికారులు సాఫ్ట్‌వేర్ ట్రిక్కులతో 5-10 నిమిషాలు మాత్రమే నెంబర్ కనిపించేలా చేస్తున్నారు. వేలంలో రావాల్సిన దానికంటే తక్కువ ఫీజుకే బ్లాక్ చేస్తున్నారు.