Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

టీడీపీ, బీజేపి పొత్తులు.. చర్చోపర్చలు

0

విజయవాడ, ఏప్రిల్ 27:ఏపీలో ఇప్పుడు రాజకీయ పొత్తులపై చర్చ జరుగుతోంది. ఓ ఇంగ్లిష్ టీవీ చానల్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు మోదీ విధానాలను సమర్థిస్తానని ప్రకటించారు. అయితే కలిసి పని చేస్తారా అన్న దానిపై కాలం నిర్ణయిస్తుందన్నారు. అంతే ఏపీలో మళ్లీ 2014 కూటమి ఖాయమన్న ప్రచారం ఊపందుకుంది. అయితే పొత్తుల వల్ల ఎవరికీ లాభం ఉండదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. పొత్తుల వల్ల ఎవరికి ఎక్కువ లాభం అనే చర్చ  ఇప్పుడు రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. దేశం మొత్తం మీద బీజేపీ అత్యంత బలహీనంగా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. నోటా కంటే తక్కువ ఓట్లు గత ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చాయి.  ఆ పార్టీతో పొత్తు వల్ల  టీడీపీకి ఓట్ల పరంగా కలసి వచ్చే అవకాశం లేదు.  కానీ పొత్తు అంటే పెట్టుకుంటే.. టీడీపీ నష్టపోయే అవకాశాలు ఉన్నాయి.

బీజేపీ పొత్తును వ్యతిరేకించే వర్గాలు ఆ పార్టీకి దూరమవుతాయి.  అదే సమయంలో అర శాతం బీజేపీ ఓటర్లు కూడా టీడీపీ తో పొత్తు పెట్టుకున్నాం కదా అని టీడీపీకి  ఓట్లు వేయరనే అంచనా ఉంది. టీడీపీని సంస్థాగతంగా వ్యతిరేకిస్తారు ఆ పార్టీ ఓటర్లు. అయితే  జనసేన పార్టీతో మాత్రం పొత్తు కోరుకుంటున్నారు టీడీపీ నేతలు. ఆ పార్టీకి ఆరు శాతం వరకూ ఓటు బ్యాంక్ ఉంది. ఆ ఓట్లు గేమ్ ఛేంజర్ అని గట్టిగా నమ్ముతున్నారు. అందుకే ఆ పార్టీతో కలవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఏపీలో వచ్చే ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్‌గా జరగవని టీడీపీ నేతలు గట్టిగా నమ్ముతున్నారు. వ్యవస్థల్ని అదుపులో పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి అరాచకాలకు పాల్పడతారని నమ్ముతున్నారు. అలాంటి పరిస్థితి రాకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు జరగాలంటే కేంద్రం మద్దతు ఉండాలని భావిస్తున్నారు. బీజేపీ తమకు మద్దతుగా ఉండకపోయినా…  వైసీపీకి సపోర్ట్ గా ఉండవద్దని కనీసం న్యూట్రల్ గా అయినా ఉండాలని చంద్రబాబు కోరుకుంటున్నారు.

అందుకే తాము హితులమే అని చెప్పడానికి చంద్రబాబు  ప్రయత్నిస్తున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.   కలుస్తాయో లేదో కానీ టీడీపీ, బీజేపీ కలిసినప్పుడు మంచి ఫలితాలు వచ్చాయి.  2014లో బీజేపీతో కలిసి చంద్రబాబు పోటీ చేశారు. విజయం సాధించారు.  2019 ఎన్నికల నాటికి కాంగ్రెస్ తో కలిసి ఘోర పరాజయం పాలయ్యారు. అంతకు ముందు కూడా బీజేపీ, టీడీపీ కూటమిగా మారితే చాలా విజయాలు దక్కాయి.  ఇటీవల అండమాన్‌లో మేయర్ పోస్టును పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించి బీజేపీ. అక్కడ టీడీపీకి ఉంది రెండే రెండు సీట్లు. అయినా మేయర్ సీటు ఇచ్చింది. బీజేపీ అధ్యక్షుడు నడ్డా ట్విట్టర్‌లో టీడీపీ, బీజేపీ కూటమికి  శుభాకాంక్షలు అని ప్రకటించారు.  నమ్మకమైన మిత్రపక్షాలు బీజేపీకి దూరమయ్యారు.

బీజేపీ రెండు సార్లు పూర్తి మెజార్టీతో అధికారంలోకి రావడానికి కారణం ఉత్తరాది… హింందీ రాష్ట్రాలు. అక్కడ 95 శాతం సీట్లు సాధించడం ద్వారానే ఢిల్లీ పీఠం దక్కింది.  రెండు సార్లు జరిగిన అద్భుతం మూడో సారి జరగకపోతే సీట్ల కోత పడుతుంది. దక్షిణాదిపై ఆ పార్టీకి ఆశలు లేవు.  అందుకే ఇప్పుడు బీజేపీకి నమ్మకమైన మిత్రపక్షం కావాలి.  వైసీపీ ఎలాగూ కూటమిలో చేరదు. టీడీపీకి కూటమిలో చేరే ఆప్షన్ ఉంది. ఎలా చూసినా రెండు పార్టీలు పొత్తులు పెట్టుకోవడం వల్ల ఇరువురికి వచ్చే లాభం అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదని అంచనా వేయవచ్చు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie