Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

కాంగ్రెస్ సీఎం రేసులోకి సీతక్క.

0

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎంగా సీతక్కే అవుతారని ఆ పార్టీలో మెజారిటీ భావిస్తోంది. అందుకు తెలంగాణ కాంగ్రెస్ లో నెలకొన్న పరిస్థితులే కారణమని చెబుతున్నారు. తెలంగాణ ఆవిర్భావం తరువాత ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్ లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. కొత్త సంవత్సరంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది.ఈ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.  ఈ సారి ఎలాగైనా తెలంగాణలో కేసీఆర్ పాలనకు చెక్ పెట్టి.. కాషాయం జెండా రెపరెపలాడించాలని కేంద్ర పెద్దల మార్గదర్శనంలో.. టీ బీజేపీ నేతలూ ఒక ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు.

 

అదే విధంగా  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ  సైతం ప్రజల్లోకి నేరుగా దూసుకుపోతోంది. ఆయన అధ్యక్షతన జరుగుతోన్న సభలు, సమావేశాలకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్,  ఆయన ఫ్యామిలీపై నేరుగా విమర్శలు గుప్పించ గల సత్తా తెలంగాణలో ఎవరికైనా ఉందా? అంటే అది రేవంత్ ఒక్కరే అన్న భావన ప్రజలలో బలంగా వ్యక్తమౌతోంది. అదీ కాకుండా  రాష్ట్ర ఆవిర్భావం తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి నానాటికీ తీసికట్లు అన్నట్లుగా మారిపోయింది. అలాంటి పార్టీ ఇప్పుడు జవసత్వాలు పుంజుకుని  బీఆర్ఎస్, బీజేపీలకు దీటుగా పోటీగా నిలిచిందంటే అందుకు కారణం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నాయకత్వమేనని పార్టీ అధిష్ఠానం సైతం నమ్ముతోంది.

 

వాస్తవానికి   తెలంగాణ తెచ్చింది  తానేనని కేసీఆర్ చెప్పుకుంటున్నా.. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది మాత్రం అప్పటి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ  అన్న విషయాన్ని ప్రజలకు చేరువ చేయలేకపోవడమే అప్పటి పార్టీ రాష్ట్ర నాయకత్వం తప్పిదమని అప్పట్లోనే కాదు ఇప్పుడూ విమర్శలు ఉన్నాయి.  రాష్ట్రంలో కాంగ్రెస్ అన్ని విధాలుగా దిగజారిపోయిన కాంగ్రెస్ ను తెలుగుదేశం పార్టీ వీడి వచ్చిన రేవంత్ రెడ్డి రాష్ట్రంలో  కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చే దిశగా ప్రయత్నాలు సాగించారు. చాలా వరకూ సక్సెస్ అయ్యారు కూడా.అయితే వేరే పార్టీ నుంచి వ్యక్తికి పీసీసీ పగ్గాలు కట్టబెట్టడాన్ని జీర్ణించుకోలేని ‘సీనియర్లు’ ఆయనకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు.

అమర వీరుల స్మృతివనం అమరవీరుల ఫోటోలు చరిత్రను పెట్టాలి. అమరవీరుల కుటుంబాల డిమాండ్.

ఒక దశలో ఆయన రాజీనామాకు కూడా సిద్ధమయ్యారన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే అధిష్ఠానం రేవంత్ కు అనుకూలంగా నిలబడటంతో రేవంత్ నిలదొక్కుకున్నారు. పార్టీని నిలబెట్టారు. ఈ క్రమంలోనే కర్నాటక ఫలితాల తరువాత ఒక్క సారిగా కాంగ్రెస్ పార్టీలో ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. రేవంత్ దూకుడును నియంత్రించుకున్నారు. సీనియర్లు ధిక్కారాన్ని తగ్గించుకున్నారు. ముందు రాష్ట్రంలో అధికారం ఆ తరువాతే అధికారం, పెత్తనం గురించి ఆలోచిద్దాం అన్న ధోరణి కనబరుస్తున్నారు.కర్నాటకలో డీకే , సిద్ధూ ఐక్యంగా పార్టీని విజయపథంలో నడిపించిన తీరును అనుకరించాలని నిర్ణయించుకున్నారు.

 

ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చే ఎన్నికలలో విజయం సాధించి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిగా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే నేత ఎవరన్న దానిపై పార్టీలో జరిగిన చర్చలో సీతక్క పేరు తెరమీదకు వచ్చిందని ఆ పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.  ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు ఎమ్మెల్యే సీతక్క  మావోయిస్టుగా ఉన్నా  అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి హయాంలో జన జీవన స్రవంతిలోకి అడుగుపెట్టారు. అనంతరం  తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు.రాష్ట్ర విభజన.. అనంతరం చోటు చేసుకొన్న వరుస పరిణామాల నేపథ్యంలో తెలంగాణలోని పలువురు టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ గూటికి చేరారు.

 

ఆ కొద్ది రోజులకే రేవంత్‌కి పీసీసీ చీఫ్ కట్టబెట్టడంపై అప్పటికే పార్టీలోని సీనియర్లు, సూపర్ సీనియర్లు.. అంతా అలిగి  ధిక్కార స్వరం వినిపించిన నేపథ్యంలో సీతక్క, వేం నరేంద్రరెడ్డి తదితరులు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. కాంగ్రెస్ లోనే కొనసాగుతూ రేవంత్ నాయకత్వానికి అండదండగా మద్దతుగా నడుస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరినా రేవంత్ విషయంలో వ్యక్తమైన వ్యతిరేకత కాంగ్రెస్ పాత కాపుల నుంచి సీతక్కకు ఎదురు కాలేదు. ఎందుకంటే  గతంలో ఆమె మావోయిస్టుగా ఉన్నప్పడూ.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత సైతం ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేశారు.

 

అలాగే కరోనా సమయంలో ఆమె ప్రజలమధ్యే నిత్యం ఉంటూ.. వారి కోసం అహర్నిశలు కష్టపడ్డారు.. ఎవరూ బయటకు అడుగుపెట్టేందుకు కూడా సాహసం చేయని ఆ సమయంలో నెత్తిన ఆహార పదార్థాలు, ఔషదాలు గంప పెట్టుకుని కొండల్లో కోనల్లో ఉంటున్న గిరిజనులకు అందజేయడానికి మైళ్లకు మైళ్లు ఒక్కర్తే నడిచి వెళ్లారు. ఇప్పుడూ ఆమె జనం కష్ట నష్టాలకు వెంటనే స్పందించి ఆదుకోవడానికి ముందుంటారు.

జనరల్‌ రూట్‌ పాస్‌కు రాయతీలు. 27 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్న సౌకర్యం.

గత ఏడాది సంభవించిన భారీ వరదల సమయంలో వరద బాధితులను ఆదుకోవడానికి ఎంతో సాహసోపేతంగా పడవపై వరద నీటిలో బాధితుల వద్దకు వెళ్లిన సందర్భాలున్నాయి.  అంతే కాదు వాదాలకు, వివాదాలతో సంబంధం లేకుండా జనం మధ్యే ఉండే ఆమె పార్టీలో అందరికీ అభిమానపాత్రురాలే అంటారు. ఈ నేపథ్యంలోనే  2023 ఏడాది చివర జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటి.. అత్యధిక స్థానాలను గెలుచుకొంటే.. ముఖ్యమంత్రి అభ్యర్థిగా సీతక్క పేరు పరిశీలించే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie