భద్రాచలం: గోదావరి నదిలో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు గల్లంతయారు. ఇద్దరు యువకులు వాసు,అక్బర్ మృతదేహాలు పోలీసుల సహాయ సహకారాలతో వెలికితీశారు. పట్టణ సీఐ నాగరాజు రెడ్డి, ఎస్సై మధు ప్రసాద్ నేతృత్వంలో కానిస్టేబుళ్లు కోటి, ఓదెలు స్వయంగా గోదావరి నదిలో దిగి మృతదేహాలు వెలికితీసారు. భద్రాచలంలోని అశోక్ నగర్, కొత్త కాలనీ, ఏఎంసీ కాలనీ ఎంపీ కాలనీ, జగదీష్ కాలనీకి చెందిన ఆరుగురు యువకులు ఆదివారం సాయంత్రం గోదావరి నదికి ఈతకు వెళ్లారు.
భద్రాచలానికి ఎటపాక గ్రామానికి మధ్య ఉన్న గోదావరి నది వద్దకు ఈతకు వెళ్లారు. లోతులోకి దిగిన ఇద్దరు విద్యార్థులు గోదావరిలో గల్లంతవగా నలుగురు విద్యార్థులు ప్రాణాలతో క్షేమంగా బయటపడ్డారు. క్షేమంగా బయటపడిన యువకులు భయపడి రాత్రి అయిన తర్వాత విషయం చెప్పడంతో పోలీసులు స్థానికులు గోదావరి నది వద్దకు చేరుకున్నారు. మృతదేహాలు లభ్యం కావడంతో ఆ ప్రాంతమంతా మృతుల బంధువుల ఆర్తనాదాల తో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు