Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ఉప్పల్ స్కై వాక్..

0

8 లిఫ్టులు, 6 స్టేర్ కేసులు, 4 ఎస్కలేటర్లు
హైదరాబాద్, ఏప్రిల్ 27:ఉప్పల్ రింగురోడ్డు! హైదరాబాదీలకు అదొక బాదరబందీ! అటు నాగోల్ ఇటు సికింద్రాబాద్! ముందుకు వరంగల్, వెనక్కి రామాంతపూర్! అదొక ఎడతెగని పద్మవ్యూహం! ఎంత సిగ్నల్ ఫ్రీ చేసినా, పాదచారులకు ఆగమ్యగోచరం! వాళ్లని పట్టించుకునే నాథుడే లేడు! కాలువనిండా నీళ్లు ప్రవహించినట్టు, రోడ్డంతా వాహనాల ప్రవాహం! స్కూటర్ పట్టే సందులో ఆటో దూరుతుంటే, కాలినడకన వెళ్లేవడి పరిస్థితి ఏంటి? ఆడవారు, చిన్నపిల్లలు, వృద్ధులు రోడ్డు దాటాలంటే నిత్య నరకం! వైతరణీ నదిని దాటినంత పనయ్యేది! ఇదీ నిన్నటి వరకు దుస్థితి! ఈ గజిబిజి గందరగోళానికి చరమగీతం పాడింది సర్కారు! అక్కడ సగటు పాదచారుడికి ఆకాశంలో నడిచే అదృష్టం కల్పించింది.

ఉప్పల్ స్కై వాక్! మంత్రి కేటీఆర్ డ్రీమ్ ప్రాజెక్టుల్లో ఒకటి. దాదాపు రూ.25 కోట్ల వ్యయంతో నిర్మాణమైన ఉప్పల్ బోర్డ్ వాక్ ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నది. 8 లిఫ్టులు, 6 స్టేర్ కేసులు, 4 ఎస్కలేటర్లతో వందేళ్లు మన్నేలా స్కైవాక్ నిర్మించారు. ప్రాజెక్టు నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు సెయిల్, విశాఖ స్టీల్ లతోపాటు జిందాల్ స్టీల్ వాడారు, జంట నగరాలు, శివారు ప్రాంతాల అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ త్వరలో ఇన్నర్ రింగ్ రోడ్డు ఉప్పల్ చౌరస్తా వద్ద పాదచారుల రక్షణ కోసం నలువైపుల రోడ్డు దాటేందుకు వీలుగా ఆకాశ వంతెనను ప్రజానీకానికి అందుబాటులోకి తీసుకురానుంది. సుమారు రూ.25 కోట్ల వ్యయంతో రూపుదిద్దుకుంటున్న ఉప్పల్ స్కైవాక్ ప్రాజెక్టు పనులు చివరి దశకు చేరుకున్నాయి.

రాబోయే వంద సంవత్సరాలకు పైగా మనుగడలో ఉండే లక్ష్యంతో పాదచారుల వంతెన(ఉప్పల్ స్కైవాక్ ప్రాజెక్టు) రూపకల్పన జరిగింది. ఈ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో సుమారు వెయ్యి టన్నులకుపైగా స్ట్రక్చరల్ స్టీల్ వాడారు.మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ తూర్పువైపు అభివృద్ధిని, పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకొని కొత్త ప్రాజెక్టులు చేపట్టాలని మూడేళ్ల క్రితం సూచించారు.  అధికారులు రూపొందించిన అనేక నమూనాల నుంచి స్కై వాక్ డిజైన్‌ని ఎంపిక చేశారు.  దాదాపు రూ.25 కోట్ల అంచనా వ్యయంతో  ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను హెచ్ ఎండీఏకు అప్పగించారు. ఉప్పల్ చౌరస్తాలో రోడ్డు దాటే సమయంలో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడం, ఎక్కువ శాతం మహిళలు,స్కూల్ పిల్లలు గాయపడుతున్న అంశాలను దృష్టిలో పెట్టుకొని, అక్కడ పాదచారుల వంతెన నిర్మాణం శ్రేయస్కారమని ప్రభుత్వం నిర్ణయించింది.

మొత్తం 37 పిల్లర్లు, 660 మీటర్ల పొడవు, మూడు(3), నాలుగు(4), అరు(6) మీటర్ల వెడల్పు కలిగిన ఉప్పల్ స్కైవాక్ భూమిపై నుంచి అరు(6) మీటర్ల ఎత్తులో ఉంటుంది. మొత్తం 660 మీటర్ల పొడవు కలిగిన ఉప్పల్ స్కైవాక్ సుందరీకరణ కోసం పైభాగంలో కేవలం 40 శాతం మేరకు రూఫ్ కవరింగ్ చేశారు. వాస్తవానికి 2020 ఏడాది చివర్లో ఉప్పల్ స్కైవాక్ ప్రాజెక్టు పనులు మొదలైనప్పటికీ వరుసగా రెండు సంవత్సరాల పాటు కోవిడ్ పరిస్థితుల కారణంగా ఆలస్యమైంది. ప్రాజెక్టులో 90 శాతం స్ట్రక్చరల్ స్టీల్ వాడకం ఉండడం, వెల్డింగ్ పనుల కోసం ఆక్సిజన్ సిలిండర్ల కొరత కారణంగా అనుకున్న టైంకి ప్రాజెక్టు కంప్లీట్ కాలేదు.  ఉప్పల్ చౌరస్తాలో నలువైపులా ప్రతినిత్యం సుమారు 20 వేలమందికిపైగా పాదచారులు  అటు ఇటు రోడ్ క్రాసింగ్ చేస్తారని అంచనా.

ఉప్పల్ స్కై వాక్ అందుబాటులోకి రావడం ద్వారా కాలిబాటన రోడ్డు దాటే పాదచారులు స్కైవాక్ ను వినియోగించడం వల్ల ఉప్పల్ చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్ ఫ్రీ గా వాహనాల రాకపోకలకు అవకాశం కలుగుతుంది. ఉప్పల్ మెట్రో రైలు స్టేషన్ ద్వారా ప్రతి రోజు సుమారు 25 వేల నుంచి 30 వేల మంది ప్రయాణికుల రద్దీ  ఉంటుంది. వాళ్లంతా మెట్రో కాన్ కోర్ (ఫ్లోర్) నుంచి పాదచారుల వంతెన (స్కై వాక్) మీదుగా వారి వారి గమ్య స్థానాలవైపు వెళ్లేందుకు అవకాశం కలుగుతుంది. లిఫ్టులు, మెట్ల మార్గాల పరిసరాల్లో HMDA అర్బన్ ఫారెస్ట్ యంత్రాంగం పచ్చదనాన్ని (గ్రీనరీ) పెంచుతుంది.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie