Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

అడకత్తెరలో పోక చెక్కలా … స్పీకర్ పరిస్థితి

0

శ్రీకాకుళం, జనవరి 11, 

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు పట్టుమని మూడు నెలల వ్యవధి కూడా లేదు. సంక్రాంతి తరువాత ఏ క్షణం అయినా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. మార్చిలో నోటిఫికేషన్, ఏప్రిల్ లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది. అటు రాజకీయ పార్టీలు సైతం తమ అభ్యర్థుల ఎంపిక, పొత్తులు, సీట్ల సర్దుబాటు వంటి వాటిపై ఫోకస్ పెట్టాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం తెరపైకి రావడం విశేషం. దీని వెనుక రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయనడం వాస్తవం. అనర్హత వేటు ద్వారా టిడిపి సంఖ్యా బలాన్ని తగ్గించాలని వైసిపి భావిస్తోంది. అదే సమయంలో తమ పార్టీ నుంచి వైసీపీలోకి ఫిరాయించిన ఆ నలుగురు పరిస్థితి ఏంటని టిడిపి ప్రశ్నిస్తోంది. వారిపై వేటు వేస్తే.. వీరి పైన కూడా వేయాలని చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు.సాధారణంగా ఫిరాయింపులకు సంబంధించి అనర్హత వేటు వేయాలంటే కొన్ని రకాల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.

స్పీకర్ ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి వారి సమాధానం తీసుకోవాలి. వారు సమయం అడిగితే ఇవ్వాల్సి ఉంటుంది. వారి సమాధానం అనుసరించి అనర్హత వేటు వేయాల్సి ఉంటుంది. కానీ వైసీపీ ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా నిర్వహించాలని స్పీకర్ పై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. మార్చిలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల సమయం నాటికి ఆ నలుగురిపై అనర్హత వేటు పడాలన్నదే వైసిపి వ్యూహం. దానికి చంద్రబాబు ప్రతి వ్యూహం రూపొందిస్తున్నారు. తమ పార్టీ నుంచి వెళ్లిన నలుగురిపై కూడా అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు కోరనున్నారు. లేఖ ఇవ్వాలని నిర్ణయించారు.శాసనసభలో వైసీపీకి 151 మంది, టిడిపికి 23, జనసేనకు ఒక ఎమ్మెల్యే ఉన్నారు. అయితే టిడిపి నుంచి కరణం బలరాం, వల్లభనేని వంశీ మోహన్, మద్దాలి గిరి, వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీలోకి ఫిరాయించారు.

అదే సమయంలో వైసిపి నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవెల్లి శ్రీదేవి లు టిడిపిలోకి వచ్చారు. తమ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యవహరించారని ఆ నలుగురిపై వైసీపీ హై కమాండ్ వేటు వేసింది. ఇప్పుడు ఆ నలుగురిపై అనర్హత వేటు వేయాలని పట్టుబడుతోంది. అయితే తమ పార్టీ నుంచి వెళ్లిన వారిపై సైతం అనర్హత వేటు వర్తిస్తుందని టిడిపి వాదిస్తోంది. స్పీకర్ కు ఫిర్యాదు చేయనుంది.ఇప్పుడు స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం కీలకం కానుంది. వచ్చే ఎన్నికల్లో తమ్మినేని సీతారాంకు సైతం టికెట్ ఇవ్వరని ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన పేరు ప్రకటించక పోవడానికి కారణం.. అనర్హత వేటు అవసరం కావడమేనని తేలుతోంది. ఆముదాల వలస నియోజకవర్గం నుంచి ఓ మహిళా అభ్యర్థిని జగన్ ఎంపిక చేసినట్లు టాక్ నడుస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే అనర్హత వేటు అంశం తెరపైకి రావడం విశేషం. ఇప్పటికే తన మార్పు విషయమై స్పష్టమైన సంకేతాలు రావడంతో.. స్పీకర్ తమ్మినేని సీతారాం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie