Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ఏపీలో బీజేపీ ఫ్యూచర్ ఏంటీ

0

విజయవాడ, డిసెంబర్ 23, 

 ఏపీలో పొలిటికల్ గేమ్కు ప్లేయర్లు రెడీ అయిపోయారు. ఇటు అధికార వైసీపీ మళ్లీ ఒంటరిగా బరిలో దిగుతుండగా.. టీడీపీ-జనసేన పొత్తుతో కదనరంగానికి సిద్ధమవుతున్నాయి. మరిప్పుడు బీజేపీ ఏం చేయబోతుందనేదే ప్రశ్న. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తమతో కలుస్తుందన్న లోకేశ్-పవన్‌ సానుకూల వ్యాఖ్యల నేపథ్యంలో ఏపీలో కమలనాథుల అడుగు ఎటువైపు వెళ్లబోతోంది?మరో మూడు నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి. వైసీపీతో ఢీకొట్టడానికి టీడీపీ-జనసేన రెడీ అవుతున్నాయి. మళ్లీ పవర్ మాదే అని సీఎం జగన్ అంటుంటే.. పవర్ స్టార్ పొత్తుతో అధికారంలోకి వచ్చేది మేమే అని చంద్రబాబు చెబుతున్నారు. ఇప్పటికే వైసీపీలో అభ్యర్థుల ఎంపిక, మార్పు, కొందరు సిట్టింగ్లకు సీట్ల నిరాకరణ ప్రక్రియ ప్రారంభమైపోయింది. ఇటు టీడీపీ-జనసేన.. ఉమ్మడి కమిటీల నుంచి మ్యానిఫెస్టోపై కార్యాచరణ మొదలుపెట్టేశాయి. పోటీ చేసే సీట్లపై కూడా రెండు పార్టీలు దృష్టి పెట్టాయి. అయితే ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏపీలో ఏం చేయబోతోంది? టీడీపీ-జనసేనతో కలిసి వెళ్లబోతోందా? లేక తటస్థంగా ఉండబోతోందా?బీజేపీ తమతో కలిసి వస్తుందన్న అంచనాలో ఉన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. పొత్తుపై అమిత్ షా ఆశీస్సులు కోరానని తాజాగా వ్యాఖ్యానించారు కూడా. ఇటు టీడీపీ నేత నారా లోకేష్ కూడా బీజేపీ రాకను స్వాగతిస్తామంటూ సంకేతాలిచ్చేశారు.

అయితే బీజేపీ స్పందన ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే జనసేనతో బీజేపీ పొత్తులో ఉంది. పవన్ టీడీపీతో చేతులు కలిపారు కాబట్టి జనసేనతో వెళ్లాలా లేక తటస్థంగా ఉండిపోవాలా అన్న ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ-జనసేనతో బీజేపీ చేతులు కలిపితే ఓకే.. లేకపోతే జగన్‌కు దూరంగా తటస్థంగా ఉండిపోవాలని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ కూడా సేమ్ టు సేమ్ ఇదే ఆలోచనలో ఉంది. మొత్తంగా కమలనాథులు ఏ రూపంలోనూ వైసీపీకి సహకారం అందించకుండా ఉంటే చాలనేది వారి ఆలోచన. అలా అయితే పోల్ మేనేజ్‌మెంట్‌లోనూ తమకు కలిసోస్తుందనే అనే ద్విముఖ వ్యూహంతో ఉన్నాయి రెండు పార్టీలు.టీడీపీ, జనసేన పొత్తు ఆలోచనలు ఇలా ఉంటే.. బీజేపీ మాత్రం తమకు కలిగే ప్రయోజనం మీదే ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం ఉంది. టీడీపీ -జనసేనతో పొత్తు పెట్టుకుంటే మంచిదా.. తటస్థంగా ఉంటే మంచిదా అనే లెక్కలు వేసుకుంటోందని కొందరంటున్నారు. రెండు పొట్టేళ్లు తలపడుతున్నప్పుడు మధ్యలో మనం వెళ్లి దెబ్బతినే కంటే.. గెలిచిన పోట్టేలుతో అప్పటి పరిస్థితులను బట్టి చెట్టాపట్టాలేసుకొని ప్రయోజనాలు నెరవేర్చుకునే ఆలోచన చేస్తోందంటున్నారు. బీజేపీకి ఏపీలో అసెంబ్లీ ఫలితాలు, సమీకరణాలతో పని లేదు. వారికి కావాల్సింది పక్కాగా ఎంపీ సీట్లు. ఒకటి వాళ్లు గెలుచుకునేవి. ఏపీలో ఒంటరిగా బీజేపీకి అలాంటి పరిస్థితి లేదు.

ఇక రెండోది.. వైసీపీతోపాటు టీడీపీ-జనసేన కూటమి గెలుచుకునేవి. వీరిలో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తాయో వాళ్ల సపోర్టును అప్పటి పరిస్థితిని బట్టి వాడుకోవడమనే వ్యూహ రచన కూడా బిజెపి చేయోచ్చని కొందరు విశ్లేషకులంటున్నారు.రానున్న ఎన్నికల్లో వైసీపీ, టీడీపీల్లో ఒకరు ఎర, మరొకరు సొర కానున్నారని కొందరు బీజేపీ నేతలంటున్నారు. అయితే ఎవరు ఎర అవుతారో ఎవరు సొరగా మిగులుతారో.. వేచి చూసే వ్యూహాత్మక వైఖరిని తమ పార్టీ అనుసరిస్తోందని చెబుతున్నారు కొందరు నేతలు. బీజేపీలో మరో వర్గం మాత్రం వేరే ఆలోచన చేస్తుందంటున్నారు. ఏపీలో గత ఎన్నికల్లో బిజెపికి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ఎలాగూ ఒంటరిగా పోటీ చేసి సీట్లు సాధించే పరిస్థితి లేదు. ఈ క్రమంలో టీడీపీ-జనసేనతో పొత్తు పెట్టుకొని మూడు నాలుగు ఎంపీ సీట్లు, 10 లోపు అసెంబ్లీ సీట్లు సాధించుకొని రాష్ట్రంలో రాజకీయంగా గుర్తింపు కోల్పోకుండా ఉండొచ్చన్నది ఆలోచన అని చెబుతున్నారు. కొందరు నేతలు కూడా పార్టీ హైకమాండ్ ముందు ఇదే ప్రతిపాదన పెట్టారట. మరోవైపు పొత్తు పెట్టుకుంటే బిజెపికి కొన్ని సీట్లు ఇచ్చేందుకు టీడీపీ-జనసేన కూటమి కూడా సిద్ధంగానే ఉంది.దక్షిణాదిలో అధికారంలో ఉన్న ఒక్క రాష్ట్రమైన కర్ణాటకను కూడా కోల్పోయింది బిజెపి. కేరళలో కాంగ్రెస్, లెఫ్ట్ బలంగా ఉన్నాయి. ఇక తమిళనాడులో కాంగ్రెస్ దోస్త్ డీఎంకే పవర్లో ఉంది. తెలంగాణలో ఈ మధ్యనే కాంగ్రెస్ పవర్‌లోకి వచ్చింది. అందుకే దక్షిణాదిలో ఎంపీ సీట్లు గెలుచుకోవడంతో పాటు.. మిత్రులను తయారు చేసుకోవడంలోనూ బీజేపీ నేతలు ఆచితూచి అడుగులు వేసే అవకాశముంది. అందుకే లోక్‌సభతో పాటు ఎన్నికలు జరిగే ఏపీ విషయంలో ఫైనల్‌గా తమకు జరిగే విస్తృత ప్రయోజనాల ప్రాతిపదికగానే కమలనాథుల వ్యూహం ఉండటం ఖాయంగా కనిపిస్తోంది.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie