Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

కాంగ్రెస్ కు తలనొప్పిగా మారిన పిట్రోడా….

0

న్యూఢిల్లీ, దక్షిణాది భారతదేశానికి చెందినవారు ఆఫ్రికన్ల లాగా, ఈశాన్య భారతదేశంలో ప్రజలు చైనీయుల లాగా, ఉత్తర భారత దేశానికి చెందినవారు తెల్లగా, పశ్చిమ భారతదేశంలో వారు అరబ్బుల్లాగా కనిపిస్తారని కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ చీఫ్ శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు ఎన్నికల ముందు దేశంలో పెద్ద దుమారానికి కారణమయ్యాయి. శామ్ చేసిన ఈ వ్యాఖ్యలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్రంగా పరిగణించారు. “ఇది కాంగ్రెస్ పార్టీ వారి అసలు ముఖచిత్రం. వారు వారసత్వ పన్ను వేస్తారు. దేశాన్ని విభజిస్తారు. ఒక కుటుంబం కోసం ఏదైనా చేస్తారు. శామ్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం కాదు. అవి కాంగ్రెస్ పార్టీ అసలు ముఖచిత్రాన్ని ప్రదర్శిస్తున్నాయని” మోడీ విమర్శించారు. ఇక ఎన్నికల ముందు శామ్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ కి ఇబ్బంది కలగజేస్తున్నాయి.. సోషల్ మీడియాలో సైతం శామ్ పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. చాలామంది ఇండియా కూటమి, రాహుల్ గాంధీ ని టార్గెట్ చేసుకొని ఆరోపణలు చేస్తున్నారు. ఇంటా బయటా విమర్శలు తీవ్రం కావడంతో శామ్ పిట్రోడా తన పదవికి రాజీనామా చేశారు.శామ్ పిట్రోడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. బుధవారం ఆయన చేసిన వ్యాఖ్యలు పెను దుమారానికి కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నష్ట నివారణ చర్యలకు దిగింది. అధిష్టానం అంతరంగాన్ని అర్థం చేసుకున్న శామ్ పిట్రోడా తన పదవికి రాజీనామా చేశారు. దీనిని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదించారు. శామ్ పిట్రోడా రాజీనామాను కాంగ్రెస్ పార్టీ సీనియర్ జై రామ్ రమేష్ ట్విట్టర్ ఎక్స్ ద్వారా ప్రకటించారు. వాస్తవానికి శామ్ పిట్రోడా అలాంటి వ్యాఖ్యలు చేసే ముందు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది. ప్రస్తుతం దేశభక్తి అనేది తారాస్థాయిలో ఉన్న నేపథ్యంలో.. ఒక బాధ్యత గల రాజకీయ నాయకుడిగా ఆయన అలాంటి వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ పార్టీకి ప్రతిబంధకంగా మారింది.. ఆఫ్రికన్లు, చైనీయులు, అరబ్బులతో భారతదేశ ప్రజలను పోల్చడం నిజంగా శామ్ పిట్రోడా అవివేకానికి నిదర్శనం.శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు మంటలు రేపుతున్న నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ వివాదంపై నోరు మెదపకుండా సైలెంట్ గా ఉన్నారు. శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యల పట్ల మేధావులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అనేక విప్లవాత్మక నిర్ణయాలను తెరపైకి తీసుకొచ్చిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని”అంటున్నారు.. మరోవైపు ఈ వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని, అటువంటి వాటిని ఇండియా కుటమి సమర్ధించదని ఆప్ నేత సంజయ్ సింగ్ పేర్కొన్నారు. శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో.. సోషల్ మీడియాలో ఆయనకు వ్యతిరేకంగా పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.. నిన్నటిదాకా ప్రజ్వల్ ఉదంతంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డ భారతీయ జనతా పార్టీకి..శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలతో కాస్త ఉపశమనం లభించినట్టయింది.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie