Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

గరం గరంగా గోదావరి రాజకీయం

0

కాకినాడ, మార్చి 1  (న్యూస్ పల్స్)
గోదావరి తీరంలో రాజకీయం గరం గరంగా మారుతోంది. పొత్తు రాజకీయంపై అసంతృప్తి ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. తమ పార్టీకి కేటాయించిన సీట్లపై జనసైనికులు సంతృప్తి చెందడం లేదు. తాము పోటీ చేస్తామంటే.. తాము పోటీ చేస్తామని నానా యాగీ చేస్తున్నారు. ఆమరణ నిరాహారదీక్షలు, పాదయాత్రలు, ధర్నాలు, ఆందోళనలతో జససేనానిపై ఒత్తిడి పెంచుతున్నారు. గోదావరి తీరంలో ఎందుకీ అల్లకల్లోలం..? సీట్ల ప్రకటనపై జనసైనికులకు ఉన్న అభ్యంతరాలేంటి?టీడీపీ-జనసేన పొత్తు ఎలాంటి ఫలితం ఇస్తుందనే ఉత్కంఠ పెరిగిపోతోంది. రెండు పార్టీలూ ఉమ్మడిగా తొలి జాబితా విడుదల నాటి నుంచి చాలా నియోజకవర్గాల్లో అసంతృప్తి స్వరాలు వినిపించాయి. ముఖ్యంగా జనసేన బలంగా ఉన్నట్లు చెబుతున్న గోదావరి జిల్లాల్లో ఈ పరిస్థితి మరీ తీవ్రంగా ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సీట్ల సర్దుబాటును ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు జనసైనికులు. మూడు రోజులుగా అసంతృప్తి స్వరాలు వినిపిస్తున్నా.. అధిష్టానం నుంచి బుజ్జగింపులు, భరోసా వంటివేవీ కనిపించకపోవడంతో మరింత రగిలిపోతున్నారుఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 19 స్థానాలు ఉన్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక అసెంబ్లీ స్థానాలు ఉన్న ఏకైక జిల్లా ఇదే.. ఈ జిల్లాలో మొత్తం 11 మంది అభ్యర్థులను ప్రకటించాయి టీడీపీ-జనసేన. ఇందులో టీడీపీ అభ్యర్థులు 9మంది కాగా, జనసేన అభ్యర్థులు ఇద్దరు. ఐతే ఈ జిల్లాలో 9 సీట్ల నుంచి పోటీకి జనసేన నేతలు ప్రణాళిక వేసుకున్నారు. కనీసం ఆరు నియోజకవర్గాల్లోనైనా సర్దుకుపోవాలని భావించారు.

కానీ, ప్రస్తుతం ప్రకటించిన రెండుతోపాటు గతంలో గెలిచిన రాజోలులో జనసేన పోటీ చేయనుంది. ఇక మిగిలిన ఏడు స్థానాల్లో జనసేనకు ఎన్ని ఇస్తారో క్లారిటీ లేకపోవడంతో ఎమ్మెల్యే ఆశావహులు ఆందోళన చెందుతున్నారు.జిల్లాలో జగ్గంపేట, పెద్దాపురం, మండపేట, కొత్తపేట, ముమ్మిడివరం సీట్లను టీడీపీ తీసుకోవడంపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఐదు సీట్లలో కచ్చితంగా పోటీ చేయాలనే ఉద్దేశంతో చాలా కాలంగా అక్కడ పని చేసుకుంటున్నారు జనసేన నేతలు. ఐతే ముందస్తు సమాచారం ఏదీ లేకుండా, ఏకంగా టికెట్లు ప్రకటనతో కంగుతిన్న జనసేన నేతలు.. తమ భవిష్యత్‌ ఏంటని అధిష్టానాన్ని నిలదీస్తున్నారు. ఈ సీట్లలో కొన్ని అయినా తిరిగి తీసుకోవాలని అధినేత పవన్‌కు అల్టిమేటం జారీ చేస్తున్నారుప్రధానంగా జనసేన కచ్చితంగా పోటీ చేస్తామనుకున్న సీట్లను టీడీపీకి తీసుకోవడంతోనే ఎక్కువగా అసంతృప్తి కనిపిస్తోంది. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేశ్‌కు సైతం ఇదే అనుభవం ఎదురవడంతో.. మిగిలిన చోట అసంతృప్తిని అడ్డుకోలేకపోతున్నారు. రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే ఉద్దేశంతో దుర్గేశ్‌ చాలా కాలంగా పనిచేస్తున్నారు. పొత్తు ఖరారయ్యాక.. జనసేన పోటీ చేసే మొదటి సీటు రాజమండ్రి రూరల్‌ అనే ప్రచారం కూడా జరిగింది. దీంతో దుర్గేశ్‌ కూడా పోటీకి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.ఈ దశలో ఆయన్ను నిడదవోలు వెళ్లాల్సిందిగా పార్టీ కోరుతోంది. ఈ పరిణామంతో షాక్‌ తిన్న దుర్గేశ్‌ అభిమానులు కడియం నుంచి రాజమండ్రికి పాదయాత్ర చేస్తూ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. రాజమండ్రి రూరల్‌కి ఎవరినీ అభ్యర్థిగా ప్రకటించకపోవడం వల్ల జనసేన తీసుకోవాలని కోరుతున్నారు. ఇక జనసేనకు కేటాయిస్తామంటున్న నిడదవోలులో టీడీపీ నేతలు సహాయ నిరాకరణ ప్రకటనలు చేస్తున్నారు. కాకినాడ రూరల్‌లో కూడా ఇలాంటి లొల్లే కనిపిస్తోంది.ఇక జగ్గంపేట, కొత్తపేట, పెద్దాపురం నియోజకవర్గాల్లోనూ అసంతృప్తి నేతలు ధిక్కార స్వరాలు వినిపిస్తున్నారు.

జగ్గంపేట జనసేన ఇన్‌చార్జి పాటంశెట్టి సూర్యచంద్ర రెండు రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్నారు. జగ్గంపేటను టీడీపీకి కేటాయించడాన్ని జీర్ణించుకోలేని సూర్యచంద్ర అచ్యుతాపురంలో అమ్మవారి గుడిలోకి వెళ్లి ఆమరణ దీక్షకు పూనుకోవడం హీట్‌ పుట్టిస్తోంది. మరోవైపు పి.గన్నవరం నియోజకవర్గంలోనూ గందరగోళం నెలకొనడం కూటమిపై ప్రభావం చూపుతోంది. రాజోలు నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించడంతో పి.గన్నవరం టికెట్‌ ఆశించిన మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు టీడీపీకి రాజీనామా చేశారు.పి.గన్నవరం టికెట్‌ను తనకు కాదని మహాసేన రాజేశ్‌కు కేటాయించడంతో సూర్యారావు వైసీపీలో చేరిపోయారు. ఇక్కడ రెండు పార్టీల కార్యకర్తలు కూడా మహాసేన రాజేశ్‌ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నాయని చెబుతున్నారు. అంబాజీపేటలో జరిగిన సమావేశంలో కార్యకర్తలు, పరసర్పం దాడులు చేసుకోవడమే కాకుండా, అమలాపురం పార్లమెంట్‌ ఇన్‌చార్జి హారీశ్‌ మాదుర్‌ వాహనాన్ని ధ్వంసం చేశారు.ఇలా కీలకమైన తూర్పుగోదావరి జిల్లాలో కూటమి రాజకీయం గరంగరంగా మారడంతో పొత్తు రాజకీయం సాఫీగా కొనసాగుతుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రెండు పార్టీల అగ్రనేతలు సమన్వయంతో పనిచేస్తున్నా, క్షేత్రస్థాయిలో ఇరువైపులా సర్దిచెప్పే పరిస్థితి కనిపించకపోవడంతోనే అలకలు, అసంతృప్తులు ఎక్కువగా కనిపిస్తున్నాయంటున్నారు పరిశీలకులు. ఈ పరిస్థితుల్లో ఓటు బదిలీ సక్రమంగా జరుగుతుందా? లేదా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie