Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

గులాబీ పార్టీలో నెంబర్ 2 హరీష్ రావేనా

0

హైదరాబాద్, ఫిబ్రవరి 15 (న్యూస్ పల్స్)
తెలంగాణ‌లో అధికార కాంగ్రెస్‌, ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్ మ‌ధ్య వాట‌ర్ వార్ తారాస్థాయికి చేరింది. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి కాళేశ్వ‌రం ప్రాజెక్టులో అవకతవకలు, లొసుగులపై దృష్టిసారించారు.  ప్ర‌తిప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో కాళేశ్వ‌రం ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి జ‌రిగింద‌ని ఆరోపణలు, విమర్శలు చేసిన   రేవంత్‌..   అధికారంలోకి రాగానే ఆ అవినీతిని వెలికితీయడంపై దృష్టిపెట్టారు. ఈ క్ర‌మంలో ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నారు. బీఆర్ ఎస్ ప్ర‌భుత్వంలో జ‌రిగిన అవినీతిని ప్ర‌జ‌ల ముందు పెట్ట‌డంలో రేవంత్ అండ్ కో స‌ఫ‌ల‌మ‌వుతోంది. గ‌త‌ ప్ర‌భుత్వ  హ‌యాంలో అవినీతిపై కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌శ్నిస్తుండ‌టంతో..  ప్ర‌తిప‌క్ష పార్టీ కొత్త వాద‌న తెర‌పైకి తెచ్చింది. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనెజ్ మెంట్ బోర్డుకు (కేఆర్ఎంబీ) అప్పగించడాన్ని బీఆర్ఎస్ పార్టీ తప్పుపట్టింది. కాంగ్రెస్ హ‌యాంలో తెలంగాణ‌కు నీటి పంప‌కాల విష‌యంలో తీవ్ర అన్యాయం జ‌రుగుతుంద‌ని ఆ పార్టీ నేత‌లు వాదిస్తున్నారు. అయితే, ఆ పాపమంతా మాజీ సీఎం కేసీఆర్‌దేన‌ని కాంగ్రెస్ నేత‌లు కౌంట‌ర్ ఇస్తున్నారు. ఈ క్ర‌మంలో అసెంబ్లీలో కృష్ణానది  ప్రాజెక్టులు, కేఆర్ఎంబీ సంబంధిత అంశాలపై చ‌ర్చ‌జ‌రిగింది.అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్త‌మ్‌, కోమ‌టిరెడ్డిలు గ‌త బీఆర్ ఎస్ ప్ర‌భుత్వంలోనే తెలంగాణ‌కు నీటివాటాను సాధించుకోవ‌టంలో అన్యాయం జ‌రిగింద‌ని తీవ్ర‌ స్థాయిలో మండిప‌డ్డారు.

 

కేసీఆర్ తెలంగాణ‌కు ద‌క్కాల్సిన నీటిని ఆంధ్రాకు అప్ప‌గించారంటూ విమ‌ర్శించారు. కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. బీఆర్ ఎస్ ప్ర‌భుత్వంలో ఆయ‌న ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన అవినీతి బ‌య‌ట‌ప‌డుతుంద‌నే కేసీఆర్ అసెంబ్లీకి రావ‌డం లేద‌ని కాంగ్రెస్ స‌భ్యులు అన్నారు. అయితే, అసెంబ్లీలో బీఆర్ ఎస్ త‌ర‌పున హ‌రీష్ రావు మాత్ర‌మే అధికార ప‌క్షానికి స‌మాధానం ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. నీటి వాటాపై చ‌ర్చ ప్రారంభ‌మైన స‌మ‌యం నుంచి హరీష్ రావు, ఇద్ద‌రు ముగ్గురు బీఆర్ ఎస్ స‌భ్యులు మాత్ర‌మే కాంగ్రెస్ స‌భ్యుల వాద‌న‌ల‌కు బ‌దులిచ్చే ప్ర‌య‌త్నం చేశారు. కేటీఆర్ స‌భ‌లో ఉన్న‌ప్ప‌టికీ కేవ‌లం బ్యాక్ బెంచ్ కే ప‌రిమితం అయ్యారు. కేసీఆర్ పై కాంగ్రెస్ స‌భ్యులు మాట్లాడుతున్నా.. కేటీఆర్ కౌంట‌ర్ ఇచ్చేందుకు ఏమాత్రం ప్ర‌య‌త్నం చేయ‌క‌పోవ‌టం బీఆర్ ఎస్ శ్రేణుల‌కు ఇబ్బందిక‌రంగా మారింది.

బీఆర్ ఎస్ లో కేసీఆర్ త‌రువాత ఆయ‌న త‌న‌యుడు కేటీఆరే అధ్య‌క్షుడిగా ఉంటాడ‌ని, మ‌ళ్లీ బీఆర్ ఎస్ అధికారంలోకి వ‌స్తే సీఎం కాబోయేది కేటీఆరేన‌ని బీఆర్ ఎస్ నేత‌లు చెబుతుంటాడు. కేటీఆర్ అభిమానులైతే అసెంబ్లీలో కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి స‌రియైన స‌మాధానం చెప్పేది ఒక్క కేటీఆరేన‌ని గొప్ప‌లు చెప్పుకోవ‌టం చూస్తూనే ఉంటాం. అంతే కాకుండా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్ కేసీఆర్ ఆబ్సెన్స్ లో  గట్టిగా మాట్లాడాల్సి ఉంది. అయితే కేటీఆర్  రాష్ట్రంలో అతిముఖ్య‌మైన ప్రాజెక్టులు, కృష్ణా జ‌లాల నీటి పంపకం వంటి అంశాల‌పై అసెంబ్లీలో చ‌ర్చ‌జ‌రుగుతుంటే కేటీఆర్ మాత్రం అసెంబ్లీలో వెనుక సీట్ల‌లో కూర్చొని రిలాక్స్ అవ్వ‌డం బీఆర్ ఎస్ శ్రేణుల‌కు మింగుడు ప‌డ‌ని అంశంగా మారింది.  ప్రాజెక్టుల అంశంపై చ‌ర్చ‌ కాబ‌ట్టి.. గ‌త ప్ర‌భుత్వంలో ఆ శాఖ‌కు మంత్రిగా హ‌రీష్ రావు ఉండ‌టం వ‌ల్ల‌.. హ‌రీష్ రావే అధికార ప‌క్షం వాద‌న‌ల‌కు స‌మాధానం చెప్పార‌ని ప‌లువురు బీఆర్ ఎస్ నేత‌లు చెబుతున్న‌ప్ప‌టికీ.. కేసీఆర్ త‌రువాత నేనే   అని చెప్పుకునే కేటీఆర్ కు అన్ని అంశాల‌పై అవ‌గాహ‌న ఉండాల‌ని, అన్ని విష‌యాల్లో ముందుండి అధికార ప‌క్షం వాద‌న‌ల‌ను తిప్పికొట్టాల‌ని, కానీ, పార్టీ క‌ష్ట‌కాలంలో నాయ‌కుడిగా ముందుండి న‌డిపే ల‌క్ష‌ణాలు కేటీఆర్ లో లేవ‌ని ప‌లువురు బీఆర్ ఎస్ నేత‌లు పేర్కొంటుండ‌టం గ‌మ‌నార్హం.

 

మ‌రోవైపు.. అసెంబ్లీ స‌మావేశం ముగిసిన త‌రువాత కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు.. ఆ ట్వీట్‌లో.. శాసనసభలో ఇవ్వాళ‌ తమ పార్టీ ఎమ్మెల్యే హరీశ్ రావు ఒంటిచేత్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, మంత్రులను ఎదుర్కొన్నారని ప్రశంసించారు. దీనికితోడు.. బీఆర్ ఎస్ లో కేసీఆర్ త‌రువాత కేటీఆరే నెంబ‌ర్-2 అనుకుంటున్న కొంద‌రు బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు, నేత‌లు.. అసెంబ్లీలో హ‌రీష్ రావు దూకుడు చూసిన త‌రువాత‌ కేసీఆర్ త‌రువాత హ‌రీశ్ రావే నెంబ‌ర్-2గా అర్హుడనే విష‌యాన్ని తెర‌పైకి తెస్తున్నారు. కేసీఆర్ త‌రువాత నెం.2 ఎవ‌రు అనే అంశంపై బీఆర్ ఎస్ లో కొన్నేళ్లుగా చ‌ర్చ జ‌రుగుతుంది. అధిక‌శాతం మంది బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు, పార్టీ కార్య‌క‌ర్త‌లుసైతం కేటీఆరే నెం.2 అని పేర్కొంటూ వ‌చ్చారు. ప్ర‌స్తుతం, బీఆర్ ఎస్ అధికారం కోల్పోవ‌డంతో..  కేటీఆర్ అసెంబ్లీలోనూ, బ‌య‌ట అధికార ప‌క్షానికి గ‌ట్టి కౌంట‌ర్ ఇవ్వలేక పోతున్నారు. ఇదే స‌మ‌యంలో హ‌రీష్ రావు దూకుడు పెంచ‌డంతోపాటు,  అన్ని అంశాల్లోనూ అసెంబ్లీలో అధికార ప‌క్షాన్ని ఇరుకున‌పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. దీంతో.. కేటీఆర్ వ‌ర్గీయులుగా ఉన్న ఎమ్మెల్యేలు, ప్ర‌జాప్ర‌తినిధులుసైతం ఎప్ప‌టికైనా బీఆర్ ఎస్ కు నెం.2 హ‌రీష్ రావేన‌న్న  అభిప్రాయానికి వ‌స్తున్నార‌ట‌. కేటీఆర్ రాబోయే రోజుల్లోనూ.. ఇది నా అంశం కాదులే.. గ‌తంలో ఇది నా శాఖ కాదులే.. నేను మాట్లాడ‌టం ఎందుక‌ని అసెంబ్లీలో బ్యాక్ బేంచీకి ప‌రిమితం అయితే.. పార్టీలోనూ బ్యాక్ బెంచ్ కు వెళ్లాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతుంద‌ని కేటీఆర్ అభిమానులు ఆందోళ‌న చెందుతున్నార‌ట‌.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie