Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

విశాఖ స్టీల్ ప్లాంట్ పై వెనక్కి తగ్గని కేంద్రం

0

విశాఖపట్టణం,జనవరి 18, (న్యూస్ పల్స్)
ఏపీలో పొలిటికల్ హీట్ నెలకొంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా అన్ని రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే అధికార వైసిపి ఒంటరి పోరుకు సిద్ధమైంది. పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతోంది. మరోవైపు జగన్ ను ఎలాగైనా కట్టడి చేయాలని టిడిపి,జనసేన జతకట్టాయి. బిజెపి తమ వెంట వస్తే తాము అనుకున్నది సాధించగలమని భావిస్తున్నాయి. ఈ వారంలోనే బిజెపి నుంచి సానుకూల ప్రకటన వస్తుందని అంచనా వేస్తున్నాయి. సరిగ్గా ఇటువంటి నేపథ్యంలోనే కేంద్రం తీసుకుంటున్న తాజా నిర్ణయాలు పొత్తు పైన ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. దీంతో బీజేపీతో కలిసి నడవడంపై చంద్రబాబు, పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని కామెంట్స్ వినిపిస్తున్నాయి.గత కొద్ది సంవత్సరాలుగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కానీ ఎన్నికల దృష్ట్యా బిజెపి ఈ అంశాన్ని తాత్కాలికంగా విడిచిపెట్టిందని నాయకులు చెబుతూ వచ్చారు. కానీ అలా విడిచిపెట్టలేదని సంకేతాలిచ్చింది. స్టీల్ ప్లాంట్ కార్మికుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో బిజెపితో పొత్తు పెట్టుకోవాలన్న చంద్రబాబు, పవన్ ల ఆలోచనకు, సమర్థతకు ఇప్పుడు పెద్ద పరీక్ష ఎదురుకానుంది.

 

వారు పునరాలోచనలో పడక తప్పదని తెలుస్తోంది.ఇటీవల స్టీల్ ప్లాంట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజుల కిందట బోర్డు ప్రత్యేకంగా సమావేశమైంది. ప్లాంట్లు ఉద్యోగుల సంఖ్యను తగ్గించడానికి నిర్ణయించింది. కనీసం 1500 మందిని వివిధ కారణాలు చూపుతూ బయటకు పంపాలని డిసైడ్ అయ్యింది. ఫిబ్రవరి 2 లోగా అమలుకు విధి విధానాలు రూపొందించాలని ఆదేశించింది. ఆ తరువాత జరిగే బోర్డు సమావేశం నాటికి అమలు చేయాలని తీర్మానించింది. దీనిపై కార్మిక సంఘాలు భగ్గు మంటున్నాయి. ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు కల్పించకుండా కార్మికులను బయటకు గెంటి వేయాలన్న ప్రయత్నాలను కార్మిక సంఘాలు తప్పుపడుతున్నాయి. కానీ స్టీల్ ప్లాంట్ బోర్డు మాత్రం ఇవేవి పట్టించుకోవడం లేదు.వాలంటరీ సేపరేషన్ స్కీమ్ పేరిట విఆర్ఎస్ తీసుకునేలా కార్మికులపై ఒత్తిడి పెంచడమే దీని ఉద్దేశం. 30 సంవత్సరాల సర్వీసు దాటిన వారికి దీనిని వర్తింపజేయనున్నారు. ఇంకా మిగిలిన సర్వీస్ కు బేసిక్ పేతో పాటు డీఏ మొత్తం ఎన్ని నెలలు అయితే అంత ఇచ్చి పంపేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీని ద్వారా వెళ్లిపోయే ఉద్యోగికి పనిచేయకుండానే మిగిలిన సర్వీస్ కు కొంత మొత్తం చేతికి వస్తుంది. ఇది ఉభయులకు లాభదాయకం కాబట్టి ఉద్యోగ వర్గాల నుంచి పెద్దగా వ్యతిరేకత వ్యక్తం కావడం లేదు. 2021 లోనూ ఇదే తరహా ప్రయత్నం చేశారు. అయితే గతం మాదిరిగా విఆర్ఎస్ కాకుండా.. వాలంటరీ సేపరేషన్ స్కీం తీసుకురావాలని నిర్ణయించడం విశేషం.

ఆరోగ్యం బాగాలేదని సాకుగా చూపి 700 మందిని, విఎస్ఎస్ ద్వారా మరో 800 మందిని.. మొత్తం 1500 మందిని తగ్గించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై కార్మిక సంఘాల్లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో బిజెపిపై ఉక్కు కార్మికులు ఆగ్రహంగా ఉన్నారు. కోర్టు కేసులు సైతం నడుస్తున్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే పుండు మీద కారం చల్లిన మాదిరిగా ఉద్యోగులను తగ్గించేందుకు స్టీల్ ప్లాంట్ బోర్డు ప్రయత్నిస్తుండడం ఆందోళన కలిగిస్తుంది. ఇది తప్పకుండా పొత్తు పై ప్రతికూలత చూపనుందని విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. అటు చంద్రబాబు, ఇటు పవన్ లు ఎలా స్పందిస్తారో చూడాలి.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie