Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

8 నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు

0

నల్గోండ, మార్చి 5 (న్యూస్ పల్స్)
యాదాద్రిలో ఫాల్గుణ మాసంలో బ్రహ్మోత్సవాలకు అంతా సిద్ధమౌతోంది.. ఫాల్గుణ శుద్ధ విదియ మొదలు శుద్ధ ద్వాదశి వరకు సశాస్త్రీయంగా, లోకోత్తరంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. నిత్యపూజలు, కైంకర్యాలకు తోడు వేదమంత్రాల ఘోషతో స్వామివారి సన్నిధి మార్మోగుతుంది. పుష్పార్చనలు కొండగాలికి పరిమళం అద్దుతాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ లోని బర్కత్‌పుర నుంచి శ్రీ లక్ష్మీనరసింహస్వామి అఖండ జ్యోతి యాత్ర మార్చి 8న ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి బయల్దేరిన జ్యోతి యాత్ర యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాల ప్రచారం నిర్వహిస్తూ వార్షిక ఉత్సవాల అంకురార్పణ రోజు 11వ తేదీన యాదగిరిగుట్టకు చేరుకుంటుంది.అలంకారాలు అలౌకిక ఆనందాన్ని కలిగిస్తాయి. వాహన సేవలు అబ్బుర పరుస్తాయి. పాల్గుణ మాసం తొలిరోజు అంటే మార్చి 11న ఆలయ ఉత్సవాలు స్వస్తి వాచనం, విష్వక్సేన ఆరాధనతో ప్రారంభమై.. ద్వాదశి రోజు మార్చి 21న గర్భాలయంలోని మూలవరులకు చేపట్టే సహస్ర కలశాభిషేకం మహాక్రతువుతో ముగుస్తాయి.

11 రోజులు జరిగే ఈ బ్రహ్మోత్సవాల్లో మూడ్రోజుల విశేష ఉత్సవాలు ఉంటాయి. 11వ తేదీన స్వస్తి వచనంతో మొదలయ్యే బ్రహ్మోత్సవాలు విష్వక్సేనుడి ఆరాధనతో ఊపందుకుంటాయి. ధ్వజారోహణం, ఎదుర్కోలు, తిరుకల్యాణ మహోత్సవం, దివ్యవిమాన రథోత్సవం, చక్రతీర్థ స్నానం ప్రధానమైనవి. అష్టోత్తర శతఘటాభిషేకంతో పూర్తి అవుతాయి. బ్రహ్మోత్సవాల్లో 18న రాత్రి శ్రీస్వామి, అమ్మవారల తిరుకల్యాణ మహోత్సవాన్ని ఆలయ ఉత్తర ముఖంగా ఉన్న మాడవీధిలో చేపట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వస్త్రాలు, తలంబ్రాలను స్వామివారికి అందజేస్తారు. నరసింహుడు గజవాహనంపై మంటపానికి ఊరేగి రాగా, పూల పల్లకీలో అమ్మవారు తరలి వస్తారు. సముద్ర దేవుడే స్వయంగా వచ్చి నరకేసరి పాదాలు కడిగి అమ్మవారిని ఆయనకు అప్పగించాడన్న అనుభూతికి లోనై ఈ సందర్భాన్ని భక్తులు తిలకించి తరిస్తారు. మాంగల్య ధారణ, తలంబ్రాల ఉత్సవం జరిగినంత సేపూ కల్యాణ మంటపం గోవింద నామస్మరణతో మార్మోగుతుంది. 19 నాటి రాత్రి దివ్యవిమాన రథోత్సవం నిర్వహిస్తారు.త్వరలోనే రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, ఆ శాఖ కమిషనర్‌ ప్రత్యేక సమావేశం కానున్నారు. ఉత్సవాలకు ముందస్తు ఏర్పాట్లపై ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల సహకారానికి ఆయా శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించేందుకు దేవస్థానం లేఖలు రాసింది. సాంస్కృతిక కార్యక్రమాలను అయిదు రోజులపాటు నిర్వహించనున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie