మహారాష్ట్రలో మూడో భాషపై సవరించిన నిబంధనలు: హిందీ ఇకపై ‘తప్పనిసరి’ కాదు, కానీ ‘సాధారణంగా’ బోధించే భాష!
మహారాష్ట్ర ప్రభుత్వం నిన్న విడుదల చేసిన సవరించిన నోటిఫికేషన్ ప్రకారం, రాష్ట్రంలోని 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు హిందీని మూడో భాషగా బోధించనున్నారు. గత ఏప్రిల్‌లో మరాఠీ, ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో హిందీని తప్పనిసరి మూడో భాషగా చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పుడు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.
తాజా నోటిఫికేషన్ ప్రకారం, హిందీ “తప్పనిసరి” కాదు, అయితే “సాధారణంగా” బోధించే మూడో భాషగా ఉంటుందని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. విద్యార్థులు కోరుకుంటే ఇతర భాషలను ఎంచుకోవచ్చు. అయితే, ఈ ఎంపికకు ఒక షరతు ఉంది: ఒక తరగతిలో కనీసం 20 మంది విద్యార్థులు మరో భాషను ఎంచుకుంటేనే ఆ సబ్జెక్టును అందుబాటులో ఉంచుతారు. ఆ భాషకు ఉపాధ్యాయులు లభించకపోతే, ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. అయితే, మరాఠీ మాత్రం రాష్ట్రంలోని విద్యార్థులందరికీ తప్పనిసరి సబ్జెక్టుగా కొనసాగుతుంది. ఈ త్రిభాషా సూత్రాన్ని జాతీయ విద్యా విధానం 2020లో భాగంగా అమలు చేస్తున్నారు.
ఈ 20 మంది విద్యార్థుల నిబంధనపై విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది చాలా ఎక్కువ సంఖ్య అని, హిందీయేతర భాషలను ఎంచుకోకుండా విద్యార్థులను నిరుత్సాహపరిచే ప్రయత్నమని మహారాష్ట్ర మాధ్యమిక, ఉన్నత మాధ్యమిక విద్యామండలి మాజీ ఛైర్‌పర్సన్ వసంత్ కల్పాండే ఆరోపించారు. మరాఠీ, హిందీ భాషల లిపి ఒకేలా ఉండటంతో చిన్న పిల్లలకు రెండూ నేర్చుకోవడం కష్టమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Read also:Nara Lokesh : కార్యకర్తలకు అండగా మంత్రి నారా లోకేష్: బాలకోటిరెడ్డి కుటుంబానికి ఆసరా
