RealStory : హనీమూన్ మర్డర్ మిస్టరీ: సినిమాగా రాజా రఘువంశీ ఉదంతం:మేఘాలయలో జరిగిన హనీమూన్ హత్యకేసు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ హృదయ విదారక ఘటన ఆధారంగా ఇప్పుడు బాలీవుడ్‌లో సినిమా రాబోతోంది.
మేఘాలయ హనీమూన్ హత్యకేసు: వెండితెరపై ‘హనీమూన్ ఇన్ షిల్లాంగ్’
మేఘాలయలో జరిగిన హనీమూన్ హత్యకేసు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ హృదయ విదారక ఘటన ఆధారంగా ఇప్పుడు బాలీవుడ్‌లో సినిమా రాబోతోంది. ఈ ఉదంతం వెనుక ఉన్న వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని భావించి, సినిమా తీయడానికి తాము అంగీకరించినట్లు రాజా రఘువంశీ కుటుంబ సభ్యులు తెలిపారు.
బాలీవుడ్ దర్శకుడు ఎస్.పి. నింబావత్ దర్శకత్వంలో ‘హనీమూన్ ఇన్ షిల్లాంగ్’ పేరుతో ఈ చిత్రం తెరకెక్కనుంది. షూటింగ్ ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయని నింబావత్ వెల్లడించారు. “భవిష్యత్తులో ఇలాంటి దారుణాలు జరగకూడదనే ఉద్దేశంతో ఈ సినిమా తీయడానికి సిద్ధమయ్యాం. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయి. సినిమాలోని 80 శాతం చిత్రీకరణ ఇండోర్‌లో, మిగిలిన 20 శాతం మేఘాలయలో జరుగుతుంది” అని ఆయన పేర్కొన్నారు. అయితే, నటీనటుల వివరాలను మాత్రం ఆయన ఇంకా వెల్లడించలేదు.
ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీకి ఈ ఏడాది మే 11న సోనమ్ రఘువంశీతో వివాహం జరిగింది. కొత్త జంట హనీమూన్ కోసం మే 20న మేఘాలయకు వెళ్లారు. ఆ తర్వాత ఇద్దరూ కనిపించకుండా పోయారు. పదకొండు రోజుల తర్వాత పోలీసులు రాజా రఘువంశీ మృతదేహాన్ని లోయలో గుర్తించారు. అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
జూన్ 7న, ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో ఒక రోడ్డు పక్కన ఉన్న డాబా వద్ద సోనమ్ రఘువంశీ ప్రత్యక్షమైంది. గుర్తు తెలియని వ్యక్తులు తనను కిడ్నాప్ చేస్తే, వారి నుంచి తప్పించుకుని వచ్చానని ఆమె పోలీసులకు తెలిపింది. అయితే, విచారణలో దిగ్భ్రాంతికరమైన నిజం బయటపడింది. సోనమ్ రఘువంశీ తన ప్రియుడితో కలిసి భర్త రాజా రఘువంశీని హత్య చేసినట్లు తేలింది. ఈ హనీమూన్ మర్డర్ అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Read also:MadhyaPradesh : మధ్యప్రదేశ్‌లో 23,000 మందికి పైగా మహిళలు, బాలికలు అదృశ్యం; 1500 మంది నిందితులు పరారీ
