Health News : కీళ్లవాతం చికిత్సలో కొత్త ఆశ: జపాన్ పరిశోధకులు గుర్తించిన ‘రహస్య రోగనిరోధక కేంద్రాలు’

New Hope for RA Patients: Japanese Researchers Identify Root Cause of Joint Inflammation.

Health : కీళ్లవాతం చికిత్సలో కొత్త ఆశ: జపాన్ పరిశోధకులు గుర్తించిన ‘రహస్య రోగనిరోధక కేంద్రాలు:రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న లక్షలాది మందికి జపాన్ శాస్త్రవేత్తలు ఒక శుభవార్త అందించారు. ఈ వ్యాధికి చికిత్సలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగల ఒక కీలకమైన ఆవిష్కరణ చేశారు. కీళ్లలో వాపు, నొప్పికి కారణమవుతున్న ‘రహస్య రోగనిరోధక కేంద్రాలను’ (ఇమ్యూన్ హబ్స్) వారు గుర్తించారు.

రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కి విప్లవాత్మక చికిత్స: జపాన్ శాస్త్రవేత్తల కీలక ఆవిష్కరణ.

రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న లక్షలాది మందికి జపాన్ శాస్త్రవేత్తలు ఒక శుభవార్త అందించారు. ఈ వ్యాధికి చికిత్సలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగల ఒక కీలకమైన ఆవిష్కరణ చేశారు. కీళ్లలో వాపు, నొప్పికి కారణమవుతున్న ‘రహస్య రోగనిరోధక కేంద్రాలను’ (ఇమ్యూన్ హబ్స్) వారు గుర్తించారు. ఈ కేంద్రాలపై నేరుగా దాడి చేయడం ద్వారా వ్యాధిని సమర్థవంతంగా నియంత్రించవచ్చని వారి పరిశోధన సూచిస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని వేధిస్తున్న రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి. అంటే, మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ పొరపాటున మన సొంత కణాలపైనే, ముఖ్యంగా కీళ్లపై దాడి చేస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సలు చాలామందికి ఉపశమనం కలిగిస్తున్నా, ప్రతి ముగ్గురిలో ఒకరిపై మందులు సరిగా పనిచేయడం లేదు. దీనికి కారణం ఏమిటనే దానిపై క్యోటో యూనివర్సిటీ పరిశోధకులు దృష్టి సారించారు.

వారి అధ్యయనంలో రోగనిరోధక వ్యవస్థకు చెందిన ‘పెరిఫెరల్ హెల్పర్ టీ కణాలు’ (టీపీహెచ్ కణాలు) రెండు రకాలుగా ఉన్నాయని కనుగొన్నారు. మొదటివి మూల కణాల వంటివి (స్టెమ్-లైక్ టీపీహెచ్ కణాలు), రెండవవి వాపును కలిగించేవి (ఎఫెక్టర్ టీపీహెచ్ కణాలు). ఈ మూల కణాల వంటివి కీళ్లలో ‘టెర్షియరీ లింఫోయిడ్ స్ట్రక్చర్స్’ అనే ప్రత్యేక కేంద్రాలలో నివసిస్తూ, తమ సంఖ్యను పెంచుకుంటూ ఉంటాయి.

అక్కడే అవి ‘బి కణాలను’ ఉత్తేజపరుస్తాయి. ఈ ప్రక్రియలో కొన్ని కణాలు వాపును కలిగించే ఎఫెక్టర్ కణాలుగా రూపాంతరం చెంది ఆ కేంద్రాల నుంచి బయటకు వస్తాయి. బయటకు వచ్చిన ఈ కణాలే కీళ్లలో తీవ్రమైన వాపు, నొప్పికి కారణమవుతున్నాయి. ఈ కేంద్రాల నుంచి ఎఫెక్టర్ కణాలు నిరంతరం సరఫరా అవుతుండటం వల్లే కొన్నిసార్లు మందులు వాడినా వ్యాధి అదుపులోకి రావడం లేదని పరిశోధకులు భావిస్తున్నారు.

“అత్యాధునిక విశ్లేషణ పద్ధతులను ఉపయోగించి, కీళ్లలో వ్యాధి తీవ్రతకు సంబంధించిన ఒక కొత్త కోణాన్ని మేము ఆవిష్కరించాం. మూల కణాల వంటి టీపీహెచ్ కణాలు తమను తాము పునరుత్పత్తి చేసుకోగలవు. అలాగే ఇతర కణాలుగా మారగలవు. కాబట్టి, వ్యాధికి అసలు మూలం ఇవే కావచ్చు” అని ఈ పరిశోధన బృందానికి చెందిన యూకీ మసువో వివరించారు.

ఈ రహస్య కేంద్రాలలో ఉన్న మూల కణాలను లక్ష్యంగా చేసుకొని కొత్త చికిత్సలను అభివృద్ధి చేస్తే, వ్యాధిని మూలాల్లోనే అరికట్టవచ్చని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆవిష్కరణ రుమటాయిడ్ ఆర్థరైటిస్ రోగుల జీవితాల్లో మెరుగైన మార్పుకు నాంది పలుకుతుందని వారు తెలిపారు. ఈ పరిశోధన వివరాలు ప్రఖ్యాత ‘సైన్స్ ఇమ్యునాలజీ’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

Read also:NaraLokesh : ఏపీ యువతకు విదేశాల్లో ఉద్యోగాల కోసం శిక్షణ, డేటా సిటీకి కేంద్ర సహకారం కోరిన మంత్రి లోకేశ్

 

Related posts

Leave a Comment