-
బలగం తర్వాత వేణు యెల్దండి దర్శకత్వంలో రానున్న ‘ఎల్లమ్మ’
-
హీరో ఫైనల్ కాకపోవడంతో రెండేళ్లుగా ప్రాజెక్ట్‌లో జాప్యం
-
గతంలో ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న నాని, నితిన్
‘బలగం’ చిత్రంతో దర్శకుడిగా బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న వేణు యెల్దండి తదుపరి ప్రాజెక్ట్‌పై టాలీవుడ్‌లో ఆసక్తికరమైన ప్రచారం జోరందుకుంది. ఆయన దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్న ‘ఎల్లమ్మ’ చిత్రంలో హీరోగా స్టార్ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ (డీఎస్పీ) నటించనున్నారంటూ సోషల్ మీడియాలో తాజాగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్త ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
‘బలగం’ లాంటి భారీ విజయం తర్వాత వేణు రెండో సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆయన తన గురువు దిల్ రాజు బ్యానర్‌లోనే ‘ఎల్లమ్మ’ ప్రాజెక్ట్‌ను ప్రకటించి దాదాపు రెండేళ్లు గడుస్తున్నా, ఇంతవరకు హీరో ఎవరనేది ఖరారు కాలేదు. దీంతో సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందనే దానిపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది.
గతంలో ఈ కథ కోసం ముందుగా హీరో నానిని సంప్రదించారు. కానీ, ఇతర కమిట్‌మెంట్ల వల్ల ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత హీరో నితిన్ పేరు ఖరారైనట్లు వార్తలు వచ్చాయి. అధికారిక ప్రకటన కూడా వెలువడింది. అయితే, ఆ తర్వాత నితిన్ కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగినట్లు ప్రచారం జరిగింది. మధ్యలో శర్వానంద్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పేర్లు కూడా వినిపించినా, అవి కేవలం ఊహాగానంగానే మిగిలిపోయాయి.
ఇలా పలువురు హీరోల పేర్లు పరిశీలనకు వచ్చిన తర్వాత, ఇప్పుడు అనూహ్యంగా దేవిశ్రీ ప్రసాద్ పేరు తెరపైకి వచ్చింది. డీఎస్పీని హీరోగా చూడాలని చాలాకాలంగా ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పుడు వేణు-దిల్ రాజు కాంబినేషన్‌లో అది నిజం కాబోతోందనే వార్త ప్రాజెక్ట్‌పై అంచనాలను మరింత పెంచింది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటించవచ్చని కూడా వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రానప్పటికీ, ఈ క్రేజీ కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అసలు ‘ఎల్లమ్మ’ హీరో ఎవరో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.
Read also : SidduJonnalagadda : ఫేవరెట్ హీరో పై సిద్దు జొన్నలగడ్డ కామెంట్స్… సోషల్ మీడియాలో ట్రోలింగ్!
