Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ఆలీకి.. మళ్లీ ఖాళీ చేతులు

0

గుంటూరు, మార్చి 18 (న్యూస్ పల్స్)
కమెడియన్ ఆలీ పేరు తెలియని వారు తెలుగు రాష్ట్రాలలో ఎవరూ ఉండరు. ఒక్కో సినిమాలో ఒక్కో   విలక్షణ మ్యానరిజమ్ తో  హాస్యం పండించడంలో అలీ తనకు తానే సాటి. చిన్న తనం నుంచీ  సినీమాలే లోకంగా ఎదుగుతూ పెరిగాడు కనుక ఆయన సీనీ ఎంట్రీ ఇచ్చి 50వత్సరాలు దాటిపోయింది.  ఇక ఎలాంటి పాత్రలోనైనా అవలీలగా జీవించేయగలడన్న గుర్తింపూ పొందాడు. సినీమాలలో తిరుగులేని కమేడియన్ గా వెలుగొందుతూనే టీవీ రియాల్టీ షోలలోనూ ప్రేక్షకులను అలరిస్తూ అలీ దండిగా సంపాదించడమే కాదు. హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో అందరివాడుగా ప్రత్యేక గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. అయితే ఇలా సాఫీగా సాగిపోతున్న ఆలీకి ఎప్పుడు ఎలా కుట్టిందో తెలియదు కానీ రాజకీయం కుట్టింది. దాంతో ఆయనకు సినిమా పాత్రలు ఇరుకైపోయాయి. పొలిటికల్ ఎంట్రీ కోసం అదీ గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వాలన్న తపనతో అన్ని పార్టీలనూ చుట్టేసి, లెక్కలన్నీ వేసుకుని చివరకు వైసీపీ గూటికి చేరారు. ఇందుకోసం ఇండస్ట్రీలో తనకు అత్యంత ఆత్మీయుడిగా, అనుంగు స్నేహితుడిగా చెప్పుకునే పవన్ కల్యాణ్ తోనూ వైరం తెచ్చుకున్నాడు. రాజకీయం రాజకీయమే స్నేహం స్నేహమే అని అలీ సుద్దులు చెప్పొచ్చు కానీ అలీ పవన్ కల్యాణ్ ల మధ్య ఇప్పుడు సత్సంబంధాలు లేవనీ రాజకీయ, సినీ పరిశ్రమలలో దాదాపు అందరికీ స్పష్టంగానే తెలుసు.  

అసెంబ్లీ ఎన్నికలకు ముందు అంటే 2019 ఎన్నికల సమయంలో ఆయన తన రాజకీయ ఎంట్రీ కోసం స్వల్ప వ్యవధిలో మూడు పార్టీల గడపలు (తెలుగుదేశం, జనసేన, వైసీపీ) ఎక్కి దిగారు. చివరాఖరుకు వైసీపీ తీర్థం పుచ్చుకుని సెటిల్ అయ్యారు. అయితే ఆ ఎన్నికలలో అలీకి పోటీకి అవకాశం రాలేదు. రాలేదు పో.. ఓ కీలక నామినేటెడ్ పదవి,  వక్ఫ్ బోర్డు చైర్మన్ , లేదా రాజ్యసభ హామీతో గత ఐదేళ్లుగా చకోరపక్షిలా ఎదురు చూస్తూ వైసీపీలోనే కాలం గడిపేశారు. ఏదో కంటి తుడుపు చర్యగా ఓ నామ్ కేవాస్తే సలహాదారు పదవి దక్కినా అలీ కోరుకున్నట్లుగా రాజ్యసభ కానీ, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ పదవి కానీ దక్కలేదు. అసంతృప్తిని చిరునవ్వు మాటున దాచేసుకుని ఈ సారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల బరిలోకి దిగేందుకు అవకాశం కల్పిస్తామన్న జగన్ హామీని, వాగ్దానాన్ని పట్టుకు వేళాడారు.జగన్ యథా ప్రకారం షిక్కటి షిరునవ్వుతో సారీ అని చెప్పకనే చెప్పేశారు. వచ్చే ఎన్నికలలో వైపీపీ తరఫున పోటీ చేసే అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థుల జాబితాను జగన్ ప్రకటించారు. ఆ జాబితాలో  అలీ పేరు ఎక్కడా కనిపించలేదు.

అంటే సేమ్ ఓల్డ్ స్టోరీ. అలీకి జగన్ మరో సారి హాత్ ఇచ్చారు.   నమ్ముకున్నోళ్లని జగన్ కచ్చితంగా నట్టేట ముంచుతారని గతంలో ధర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఫృధ్వీ విషయంలో   రుజువైంది. ఆయనొక్కరి విషయంలోనే కాదు.. మోహన్ బాబు.. విషయంలో కూడా.  ఇలా ఇండస్ట్రీకి చెందిన ఎందరో జగన్ నమ్ముకుని రెంటికీ చెడ్డ రేవడలా మిగిలిన వారి జాబితా పెద్దగానే ఉంటుంది. అయితే అలీ ఈజ్ డిఫరెంట్.. అని  ఆయన తనకు తాను  భావించారు.కనీసం ఇప్పటికైనా అలీకి వాస్తవం అను బొమ్మ కనబడి తత్వం బోధపడి ఉంటుందా అంటే అనుమానమే అంటున్నారు పరిశీలకులు. మళ్లీ తాడేపల్లి ప్యాలెస్ నుంచి పిలుపు వచ్చి ఈ సారి రాజ్యసభ గ్యారంటీ అన్న హామీ ఇస్తే చాలు అక్కు బక్కుం అదే పదివేలు నాయకా అంటూ రెట్టించిన ఉత్సాహతో అలీ వైసీపీ తరఫున ప్రచారంలోకి దూకేయడానికి సిద్ధంగా ఉన్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా సినిమాల్లో కమేడియన్ గా రాణించిన అలీ.. రాజకీయాల్లో మాత్రం నవ్వుల పాలయ్యాడని నెటిజన్లు సెటైర్లు గుప్పిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie