Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ఇవాళ్టి నుంచి వైకుంఠ ద్వారా దర్శనాలు

0

తిరుమల, డిసెంబర్ 22, 

తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్‌ 23 నుంచి జనవరి 1 వరకు వైకుంఠ ద్వార పదిరోజులు తెరిచి ఉంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను టీటీడీ విస్తృతంగా చేస్తోంది. పురాణాల ప్రకారం వైకుంఠంలో శ్రీ‌మ‌హావిష్ణువుకు ఒక రోజు అంటే భూలోకంలో ఒక సంవ‌త్స‌రం అని అర్థం. అదేవిధంగా అక్క‌డ ప‌గ‌లు 12 గంట‌లు ఇక్క‌డ 6 నెల‌లు ఉత్త‌రాయ‌ణం, రాత్రి 12 గంట‌లు ఇక్క‌డ 6 నెల‌లు ద‌క్షిణాయణం. వైకుంఠంలో తెల్ల‌వారుజామున 120 నిమిషాలు భూలోకంలో 30 రోజులతో సమానం. దీన్ని ధ‌నుర్మాసంగా పిలుస్తున్నాం. తెల్ల‌వారుజామున బ్ర‌హ్మ ముహూర్తంలో 40 నిమిషాలు శ్రీ‌మ‌హావిష్ణువు దేవ‌త‌ల‌కు, ఋషుల‌కు ద‌ర్శ‌న‌మిస్తారు. ఇది వైకుంఠంలో ఆ కాలమానం ప్రకారం ప్రతిరోజు జరిగే ప్రక్రియ. భూలోకం కాలమానం ప్రకారం సంవత్సరంలో ఒకసారి జరిగే ప్రక్రియగా కనిపిస్తుంది. ఈ 40 నిమిషాలు భూలోకంలో 10 రోజులకు స‌మానం కాబ‌ట్టి వైష్ణ‌వాల‌యాల్లో ఈ 10 రోజుల‌లో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం చేసుకుంటే శ్రీ‌మ‌హావిష్ణువును ప్ర‌త్య‌క్షంగా ద‌ర్శ‌నం చేసుకున్న భాగ్యం క‌లుగుతుంది అనేది న‌మ్మ‌కం.

కాబ‌ట్టి వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఈ 10 రోజుల‌్లో  ఏ రోజు చేసుకున్నా అన్ని రోజులూ స‌మాన‌మే. భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి ద‌ర్శ‌నానికి రావాల్సిందిగా టిటిడి విజ్ఞ‌ప్తి చేస్తుంది.తిరుమ‌ల‌లో గ‌దులు ప‌రిమితంగా ఉన్న కార‌ణంగా ఈ ప‌ర్వ‌దినాల‌లో భ‌క్తుల ర‌ద్దీ దృష్ట్యా తిరుప‌తిలో గ‌దులు తీసుకోవాలని భ‌క్తులకు సూచిస్తున్నారు. గ‌తంలో చేసినట్టుగానే ఈ సంవ‌త్స‌రం కూడా ప్రోటోకాల్ విఐపిల‌కు ప‌రిమితంగానే బ్రేక్ ద‌ర్శ‌నం ఇవ్వబోతున్నారు. సిఫార‌సు లేఖ‌లు స్వీక‌రించ‌డం లేదని తెలిపారు. తొలిరోజు అంటే వైకుంఠ ఏకాద‌శి రోజు మాత్ర‌మే ద‌ర్శ‌నం చేసుకోవాల‌నే తొంద‌ర‌పాటు వద్దని సూచిస్తున్నారు. ప‌ది రోజుల్లో ఏదో ఒక‌రోజు ద‌ర్శ‌నం చేసుకోవ‌డానికి రావాలని హితవు చెబుతున్నారు. అన్ని రోజులు సమానమేనని అందరూ ఒకేసారి రావడంతో దర్శన భాగం సరిగా జరగదని అంటున్నారు. డిసెంబర్ 23వ తేదీ వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని టీటీడీ ఇప్పటికే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలను ఆన్లైన్ లో విడుదల చేసింది. అరగంట లోపే టికెట్లు అమ్ముడైపోయాయి. సామాన్య భక్తుల కోసం టీటీడీ ప్రత్యేక టికెట్లు విడుదల చేస్తుంది. స్థానికులతోపాటుగా, సామామ్య భక్తులకు సులభతరంగా శ్రీవారి దర్శనం అందించబోతోంది. తిరుపతిలోని వివిధ ప్రాంతాల్లో ఎస్ఎస్డీ టైం స్లాట్ టాకెన్స్‌ను డిసెంబర్ 22వ తేదీ నుంచి జారీ చేయనుంది. మొత్తం 10 రోజులకు 4,23,500 టికెట్లు జారీ చేయనున్నారు. 9 ప్రాంతాల్లో ఈ టోకెన్ల ఇస్తారు. 4 లక్షల టోకెన్స్ పూర్తి అయ్యే వరకు టాకెన్స్ జారీ ప్రక్రియ సాగనుంది. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని శ్రీనివాసం రెస్ట్ హౌస్, రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణు నివాసం రెస్ట్ హౌస్, రైల్వే స్టేషన్ వెనుక వైపు ఉన్న గోవింద రాజ స్వామి సత్రాలు., అలిపిరి మెట్ల మార్గం సమీపంలోని  భూదేవి కాంప్లెక్స్, తుడా కార్యాలయం వద్ద ఉన్న ఇందిరా మైదానం, జీవకోనలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బైరాగి పట్టెడలోని రామానాయుడు ఉన్నత పాఠశాల, ఎంఆర్ పల్లిలోని ఉన్నత పాఠశాల, క్రైమ్ పోలీస్ స్టేషన్ సమీపంలోని రామచంద్ర పుష్కరిణి వద్ద టోకెన్స్ జారీ చేస్తారు. తిరుమల స్థానికుల కోసం సిఆర్ఓ కార్యాలయం వద్ద జారీ చేయనున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie