Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ఎమ్మెల్సీ పదవిపై అద్దంకి దయాకర్‌ ఆశలు

0

నల్గోండ, జనవరి 11, 

తెలంగాణ శాసన సభలో ఎమ్మెల్యేల బలాబలాలను పరిగణలోకి తీసుకుంటే అధికార కాంగ్రెస్ రెండు ఎమ్మెల్సీ స్థానాలను దక్కించుకునే వీలుంది. వాస్తవానికి తెలంగాణ శాసన మండలిలో ప్రస్తుతానికి వివిధ కోటాలు కలిపి ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో సునాయసంగా కైవసం చేసుకునే వాటిలో ఎమ్మెల్యే కోటా, గవర్నర్ నామినేటెడ్ కోటాలో ఉన్నాయి. పట్టభద్రుల నియోజక వర్గం ఎమ్మెల్సీ పదవి దక్కాలంటే మూడు జిల్లాల పరిధిలోని పట్టభద్రుల మనసు చూరగొని ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ కారణంగానే పైసా ఖర్చులేని గవర్నర్ నామినేటెడ్ కానీ, ఎమ్మెల్యే కోటాలో జరిగే ఎన్నిక ద్వారా కానీ ఎమ్మెల్సీ పదవులు పొందాలని పట్టుదలతో ఉన్నారు. రెండు ఎమ్మెల్సీ పదవుల్లో ఒకటే ముస్లిం మైనారిటీలకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుందట.రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో స్వీప్ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే ముస్లిం మైనారిటీ ఓట్లు కీలకం కానున్నాయి. ప్రస్తుత శాసనసభలో కాంగ్రెస్ నుంచి ముస్లిం మైనారిటీ ఎమ్మెల్యేలు ఎవరూ లేరు. అటు శాసన మండలిలో కూడా కాంగ్రెస్ నుంచి ముస్లిం మైనారిటీలు ఎవరు లేరు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ముస్లిం మైనారిటీని తీసుకుని మంత్రివర్గంలో కూడా ముస్లిం మైనారిటీలకు స్థానం భర్తీ చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుందట.కాంగ్రెస్ నుంచి భర్తీ కానున్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఆశావహులు అధిక సంఖ్యలో ఉన్నారు.

అయితే ఒక స్థానాన్ని ముస్లిం మైనారిటీకి కేటాయిస్తుండగా, మరో స్థానంపైనే అందరు ఆశలు పెట్టుకున్నారు. ఈ ఎమ్మెల్సీ పదవు భర్తీలో అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన వారికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తోంది. వీరితోపాటు గత ఎన్నిల్లో ఓటమి పాలైన వివిధ సామాజిక వర్గాలకు చెందిన నాయకులు ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు. వీరిలో అద్దంకి దయాకర్ ముందు వరసలో ఎమ్మెల్సీ రేసులో ఉన్నారట. తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2014, 2018, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అద్దంకి దయాకర్ 2023 ఎన్నికల్లోనూ టికెట్ ఆశించారు. ఎమ్మెల్సీ పదవి ఇస్తామని అధినాయకత్వం ఇచ్చిన హామీతోనే తన టికెట్ ను త్యాగం చేశారట. దీంతో బీఆర్ఎస్ నుంచి వచ్చి కాంగ్రెస్ లో చేరిన మందుల సామేలుకు ఆ టికెట్ ఇవ్వగా ఆయన ఘన విజయం సాధించారు.ఎమ్మెల్సీ ఖాళీలను భర్తీ చేసేందుకు షెడ్యూలు విడుదలైంది. జనవరి 29వ తేదీన ఎన్నిక జరగ నుండడంతో ఆశావహులు తమ ప్రయత్నాలకు పదును పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వారిలో షబ్బీర్ అలీ, ఫిరోజ్ ఖాన్, అజారుద్దీన్, సంపత్, మధు యాష్కీ గౌడ్ వంటి నాయకులు వీరిలో ఉన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి పటేల్ రమేష్ రెడ్డి కూడా రేసులో ఉన్నారు. సూర్యాపేట టికెట్ ను పటేల్ రమేష్ రెడ్డి ఆశించారు. ఎమ్మెల్సీ పదవి ఇస్తామని బుజ్జగించి ఆ టికెట్ ను మాజీ మంత్రి దామోదర్ రెడ్డికి ఇచ్చారు. రమేష్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డికి అనుచరుడుగా కొనసాగుతున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా ఉన్న అద్దంకి దయాకర్.. ఏఐసీసీ లో కీలకంగా ఉన్న కొప్పుల రాజుతో తన ప్రయత్నాలను ముమ్మరం చేశారట. దీంతోపాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా దయాకర్ అభ్యర్థిత్వం పట్ల సానుకూలంగా ఉన్నారట. శాసన మండలిలో బలమైన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్‌ను ఎదుర్కోవడంలో అద్దంకి కీలకంగా ఉంటారని పార్టీ భావిస్తోందట. తన ప్రభుత్వంలో అన్ని అంశాల పట్ల అవగాహన కలిగిన వారికి ప్రాధాన్యం ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారట. ఇందులో భాగంగానే అద్దంకిని తన టీంలో చేర్చుకునేందుకు ఎమ్మెల్సీ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో అద్దంకి దయాకర్ పేరు రేసులో ముందున్నదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఒక వేళ ఆయన అభ్యర్థిత్వానికి ఏఐసీసీ నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఎమ్మెల్సీ పదవి దక్కినట్టవుతుంది..

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie