Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ఏపీ కాపులు ఎటూ వైపు

0

కాకినాడ, మార్చి 26, (న్యూస్ పల్స్)
ఏపీలో ఎన్నికల సమీపిస్తున్న కొలది ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా కాపుల చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. కాపు ఓట్లను తమ వైపు తిప్పుకుంటే గెలుపు ఖాయమని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాపు ఫ్యాక్టర్ బలంగా వినిపిస్తోంది. ఈసారి కూడా అదే పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ వైపు కాపులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ బరిలో నిలిచినా.. రకరకాల కారణాలతో కాపులు జగన్ వైపు ఆసక్తి చూపారు. వారిని తన వైపు తిప్పుకోవడంలో జగన్ కూడా సక్సెస్ అయ్యారు. ఇందుకు ముద్రగడ కూడా పరోక్షంగా కారణమయ్యారు. చంద్రబాబు పై ఉన్న కోపంతో ముద్రగడ కాపులను తెలుగుదేశం పార్టీ నుంచి దూరం చేశారు. కానీ పవన్ కళ్యాణ్ జనసేన వైపు వారిని మరల్చలేదు. జగన్ వైపు వెళ్లేలా తెర వెనుక ప్రోత్సాహం అందించారన్న అపవాదు ముద్రగడ పై ఉంది. ఇప్పుడు కూడా ముద్రగడ నేరుగా వైసీపీలో చేరి.. కాపులను ఆ పార్టీ వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.2009 ఎన్నికల వరకు ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లో ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో ఎంపీ తో పాటు మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో సైతం వర్క్ చేశారు. ఆ సమయంలో కాపుల కోసం ప్రత్యేకంగా ఏ పని చేయలేకపోయారన్న అపవాదు ఉంది. 2009 ఎన్నికల్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి పిలిచి మరీ టిక్కెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ బరిలో ఉండడంతో.. కాపుల్లో బలమైన నాయకుడిగా ఉన్న ముద్రగడను పిఠాపురం నుంచి పోటీ చేయించారు. అక్కడ కాపు సామాజిక వర్గం అధికంగా ఉన్నా.. వారు పెద్దగా ముద్రగడను ఆదరించలేదు.

అక్కడ దారుణ ఓటమి ఎదురు కావడంతో ముద్రగడ మనస్థాపానికి గురయ్యారు. రాజకీయాలకు దూరమయ్యారు. అయితే తన రాజకీయ ఆధిపత్యానికి చంద్రబాబు గండి కొట్టారన్న కోపం మాత్రం ముద్రగడను వెంటాడింది. అన్నింటికీ మించి పిఠాపురంలో కాపు సామాజిక వర్గం తనను ఆదరించలేదన్న బాధ నివురు గప్పిన నిప్పులా మారింది.2014 ఎన్నికల్లో కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత రిజర్వేషన్లు కల్పించడంలో జాప్యం చేశారు. దీంతో ముద్రగడ తెరపైకి వచ్చారు. కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని అందుకున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టే కాపులకు రిజర్వేషన్లు ప్రకటించాలని కోరారు. అందుకు చంద్రబాబు పెద్దగా పట్టించుకోకపోవడంతో ఉద్యమాన్ని ప్రారంభించారు. అయితే ఈ ఉద్యమంలో ముద్రగడ చిత్తశుద్ధి ఎంత ఉందో తెలియదు కానీ.. ఉద్యమం హింసకు దారి తీయడానికి అప్పటి విపక్షం వైసీపీ కారణమన్న ఆరోపణ ఉంది. అదే సమయంలో వైసీపీ కోసమే ముద్రగడ కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని తలపై ఎత్తుకున్నారన్న కామెంట్స్ కూడా ఉన్నాయి. ఉద్యమం పతాక స్థాయికి చేరడం.. తునిలో రైలు విధ్వంసం జరగడం.. వందలాదిమంది పై కేసులు నమోదు కావడం జరిగిపోయింది. ఈ మొత్తం పరిణామంతో రాజకీయ పరిస్థితులే మారిపోయాయి. చంద్రబాబుపై కాపుల ఆగ్రహానికి ఈ పరిణామాలన్నీ కారణమయ్యాయి. అయితే అప్పట్లో జనసేన ప్రత్యామ్నాయ పార్టీగా ఉన్నా.. కాపులు అటువైపు టర్న్ కాకుండా.. వైసీపీ వైపు వెళ్లేలా ముద్రగడ ప్లాన్ చేశారన్నది ఒక ఆరోపణ.2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కాపులు దూరమయ్యారు. జనసేన వైపు వెళ్లకుండా వైసీపీ వైపు టర్న్ కావడంతో జగన్ అధికారంలోకి రాగలిగారు. కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని కోరుకున్న పద్మనాభం ఆ డిమాండ్ చేయాలి కదా? అలా చేయలేదు సరి కదా.. కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని ఉన్నఫలంగా నిలిపివేశారు. తనను శంకించినందుకుగాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. అందరిలో అప్పటి వరకు ఉన్న అనుమానాలను నిజం చేసేలా ఉద్యమాన్ని నిలిపివేయడం విశేషం. అయితే నాడు ముద్రగడ ఉద్యమానికి తలంచి చంద్రబాబు ఇచ్చిన ఐదు శాతం ఈ బీసీ రిజర్వేషన్లను జగన్ నిలిపివేశారు. కాపులకు ఉద్దేశించి ప్రారంభించిన పథకాలకు సైతం మంగళం పలికారు. కానీ ఆ సమయంలో ముద్రగడ నోరు తెరవలేదు.

పైగా సీఎం జగన్ కు అనుకూల ప్రకటనలు చేస్తూ వచ్చారు. ఈ ఎన్నికల ముంగిట వైసీపీలో చేరిపోయారు. దీంతో ఇప్పటి వరకు ముద్రగడ పై ఉన్న అనుమానాలన్నీ నిజమని అభిప్రాయాలు బలపడేలా ఆయనే వ్యవహరించడం విశేషం.అయితే ఇప్పటివరకు కాపుల కోసం ముద్రగడ పద్మనాభం ఏం చేశారు అన్నది మాత్రం చెప్పడం లేదు. టిడిపి ప్రభుత్వ హయాంలో కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని చేయడం నిజం.ఆ ఉద్యమానికి స్పందించి చంద్రబాబు ఐదు శాతం ఈ బీసీ రిజర్వేషన్లు కల్పించడం వాస్తవం. అటు విదేశీ విద్యకు సంబంధించి కొన్ని రకాల పథకాలను సైతం అమలు చేశారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రిజర్వేషన్లను నిలిపివేశారు. కాపుల ప్రత్యేక పథకాలకు కోత విధించారు. అయినా ఎన్నడూ ముద్రగడ పద్మనాభం నోరు తెరవలేదు. కనీసం ఖండించలేదు. కానీ ఇప్పుడు వైసీపీలోకి అధికారికంగా చేరి పవన్ ను టార్గెట్ చేసుకుంటున్నారు. కాపు ఉద్యమానికి చంద్రబాబు కారకుడని ఆరోపిస్తున్నారు. నాడు విధ్వంశాలపై నోరు తెరవలేదని నిందలు వేస్తున్నారు. అయితే రాజకీయ ఉద్దేశంతోనే ముద్రగడ ఉద్యమాన్ని తలపెట్టారని ఆరోపణలు ఉన్నాయి. అయినప్పటికీ పవన్ స్పందించారు. అప్పటి చంద్రబాబు ప్రభుత్వ చర్యలను తప్పుపట్టారు. ఐదు శాతం ఈ బీసీ రిజర్వేషన్లు ప్రకటించడానికి పవన్ కారణం. ఆ రిజర్వేషన్లు ఎత్తివేసిన ముద్రగడ మాట్లాడకపోవడం కూడా కాపులకు శాపంగా మారింది. గత ఐదు సంవత్సరాలుగా కొన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలు దక్కకుండా పోయాయి. ఇలా ఎలా చూసుకున్నా కాపుల కోసం ఉద్యమించిన ముద్రగడ పద్మనాభం.. ఏం సాధించలేదని తెలుస్తోంది. కేవలం ఇప్పుడు రాజకీయ కోణంలోనే ఆయన పవన్ పై ఆరోపణలు చేయడాన్ని కాపులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటువంటివి కాపు జాతికి సహేతుకం కాదని అభిప్రాయపడుతున్నారు. కాపులను అడ్డం పెట్టుకుని ఎన్నడూ పవన్ రాజకీయాలు చేయలేదు. ఆ మంచి గుణమే కాపులను ఆకట్టుకుంటుంది. గత ఎన్నికల్లో పవన్ ఉన్నా జగన్ వైపు అడుగులు వేసామన్న బాధ కాపుల్లో ఉంది. అందుకే ముద్రగడ కంటే పవన్ కళ్యాణ్ ని కాపుల్లో మెజారిటీ వర్గం విశ్వసిస్తోంది. ఈ ఎన్నికల్లో అండగా ఉంటామని చెబుతోంది.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie