Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలకు అంతా రెడీ

0

కడప, మార్చి 26 (న్యూస్ పల్స్)
ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు విస్తృతంగా చేస్తున్నట్లు టీటీడీ జేఈవో వీరబ్రహ్మం తెలిపారు. ఏప్రిల్ 17 నుంచి 25 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 22న సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు.ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఆల‌యంలో ఏప్రిల్ 17 నుంచి 25వ తేదీ వ‌ర‌కు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు టీటీడీ జేఈవో వీరబ్రహ్మం తెలిపారు. ఏప్రిల్ 22వ తేదీ సాయంత్రం 6.30 నుంచి 8.30 గంట‌ల వ‌ర‌కు సీతారాముల క‌ల్యాణం అత్యంత వైభ‌వంగా నిర్వహించ‌నున్నట్లు చెప్పారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ విజయరామరాజు, ఎస్పీ సిద్ధార్థ్ కౌశిల్ జిల్లా యంత్రాంగంతో సోమ‌వారం ఒంటిమిట్టలో జేఈవో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈవో వీరబ్రహ్మం మాట్లాడుతూ.. టీటీడీలోని అన్ని విభాగాలు, జిల్లా యంత్రాంగం, పోలీసులు స‌మష్టి కృషి చేసి ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. గతంలో జరిగిన లోటుపాట్లను సవరించుకుని సీతారాముల కల్యాణాన్ని(అంగరంగ వైభవంగా నిర్వహించాలన్నారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయం చేసుకుని బ్రహ్మోత్సవ ఏర్పాట్లను వేగంగా పూర్తి చేయాలన్నారు.

ఏప్రిల్ 16వ తేదీన బ్రహ్మోత్సవాల అంకురార్పణ‌, ఏప్రిల్ 17న‌ శ్రీరామనవమితో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని జేఈవో తెలిపారు. ఏప్రిల్ 20న హనుమంత వాహనం, ఏప్రిల్ 21న గరుడవాహనం, ఏప్రిల్ 22న సీతారాముల కల్యాణాన్ని అత్యంత అద్భుతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 23న రథోత్సవం, ఏప్రిల్ 25న చక్రస్నానం, ఏప్రిల్ 26న పుష్పయాగము నిర్వహించనున్నామని చెప్పారు.వైఎస్ఆర్‌ జిల్లా కలెక్టర్ విజయరామరాజు మాట్లాడుతూ… బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా సీతారాముల కల్యాణానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ, జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా భద్రత, పార్కింగ్, అన్నప్రసాదాల పంపిణీ, తాత్కాలిక మరుగుదొడ్లు, నిరంతర విద్యుత్ సరఫరా, ప్రథమ చికిత్స కేంద్రాలు, ఆర్టీసీ బస్సులు, సైన్ బోర్డులు, పారిశుద్ధ్యం, పబ్లిక్ అడ్రస్ సిస్టం విభాగాల‌పై సమీక్షించి పలు సూచనలు చేశారు. జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశిల్ మాట్లాడుతూ.. టీటీడీ విజిలెన్స్‌ సిబ్బంది, జిల్లా పోలీసు యంత్రాంగం కలిసి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తారన్నారు. అవసరమైన అన్ని ప్రాంతాలలో సీసీ కెమ‌రాలు, కంట్రోల్ రూం ఏర్పాటు త‌దిత‌ర అంశాల‌పై అధికారుల‌కు సూచ‌న‌లు చేశారు.

ఒంటిమిట్టను ఆంధ్ర భద్రాచలంగా పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీరామనవమి రోజున అధికారికంగా కార్యక్రమాలను చేపడుతుంది. శ్రీరామనవమి రోజున ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తారు. మూల విగ్రహాలలో రాముని విగ్రహం పక్కన హనుమంతుడు విగ్రహం లేని రామాలయం భారతదేశంలో ఇదొక్కటే అంటారు. శ్రీరామహనుమంతుల కలయికకు ముందే ఒంటిమిట్టలో సీతారామలక్ష్మణుల ఏకశీలా విగ్రహం స్థాపించినట్లు స్థలపురాణం చెబుతోంది. దేశం మొత్తం శ్రీరామనవమి నాడు సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. కానీ ఒంటిమిట్టలో శ్రీరామనవమికి ఐదో రోజున సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie