Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

పోలవరాన్ని వేధిస్తున్న నిధుల సమస్య

0

ఏలూరు, అక్టోబరు 16, 

పోలవరం ప్రాజెక్టు.. ఏపీ ప్రజల జీవనాడి. ఈ ప్రాజెక్టు ఒక అడుగు ముందుకు పగితే.. రెండు అడుగులు వెనక్కి వేస్తోంది. రెండేళ్ల క్రితమే పూర్తికావాల్సి ప్రాజెక్టు నిర్మణ  పనుల్లో… జాప్యం జరుగుతోంది. ఇందుకు నిధుల కొరత కూడా ప్రధాన కారణమే. దీంతో… పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేయాలని కేంద్రంపై ఒత్తిడి పెంచారు సీఎం  జగన్‌. కేంద్ర పెద్దలను కలిసి.. పోలవరం తాజా అంచనాలను ఆమోదించాలని కోరారు. ఇప్పుడు కేంద్ర జలసంఘం తాజా అంచనాలను కేంద్రానికి పంపింది. పోలవరం ప్రాజెక్టులో తొలిదశ నిర్మాణం పూర్తికావడానికి 17వేల 148 కోట్లు అవసరం అవుతాయని పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీడబ్ల్యూసీకి ప్రతిపాదనలు పంపింది. వాటిని పరిశీలించిన సీడబ్ల్యూసీ తొలిదశ పూర్తికి రూ.15,661 కోట్లు అవసరమవుతాయని లెక్కగట్టింది.  

తొలిదశ కింద 15,661 కోట్ల రూపాయలు విడుదల చేయాలని కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీకి సిఫారసు లేఖ పంపారు సీడబ్ల్యూసీ ఛైర్మన్‌ కుశ్విందర్‌సింగ్‌ వోరా. పోలవరం తొలిదశలో మిగిలిన పనులు పూర్తిచేయడానికి ఇప్పటికే 12,911 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అంగీకరిచారు. దీనికి సంబంధించి జూన్‌ 5న కేంద్ర ఆర్థిక శాఖ మెమో కూడా జారీచేసింది. అయితే.. అవి సరిపోవమని రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడింది. లైడార్‌ సర్వే ప్రకారం 1.15 మీటర్ల కాంటూర్‌ పరిధిలో అదనంగా 36 గ్రామాలు వస్తాయని తేలిందన్నారు. దీంతో ఆ గ్రామాల ప్రజలకు తొలిదశ కిందే పునరావాసం కల్పించాలని వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదన పంపింది. ఆ ప్రతిపాదనను సూత్రప్రాయంగా అంగీకరించిన కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌.. ఆ మేరకు సవరించిన ప్రతిపాదనలను రూపొందించాలని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు.ప్రధాని మోడీ ఆదేశాల మేరకు తొలిదశ పూర్తికి రూ.12,911.15 కోట్లు విడుదల చేసేందుకు అంగీకరించిన కేంద్ర ఆర్థిక శాఖ..

41.15 మీటర్ల కాంటూర్‌ పరిధిలోని 36 గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించడానికి కూడా సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఆ గ్రామాల ప్రజలకు పునరవాసం కల్పించడానికి అదనంగా రూ.2,749.85 కోట్లు అవసరమని సీడబ్ల్యూసీ లెక్కగట్టింది. అంటే.. తొలిదశ పూర్తికి కేంద్రం విడుదల చేసేందుకు అంగీకరించిన రూ.12,911.15కు.. మరో రూ.2,749.85 కోట్లు కలిపి… మొత్తంగా రూ.15,661 కోట్లు అవుతుందని అంచనా వేసింది కేంద్రం జల సంఘం. రూ.15,661 కోట్లు విడుదల చేయాలని కేంద్ర జల్‌శక్తి శాఖకు సిఫార్సు చేసింది. కేంద్ర జల్‌శక్తి శాఖ ఆ మేరకు కేంద్ర ఆర్థిక శాఖకు సిఫార్సు చేయనుంది.

అంతేకాదు… జల్‌శక్తి, ఆర్థిక శాఖలు  కేంద్ర కేబినెట్‌కు కూడా ప్రతిపాదనలు పంపనున్నాయి. దీనిపై కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేస్తే పోలవరం తొలిదశ పూర్తికి అవసరమైన నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. పోలవరం పూర్తి చేయడానికి 2025 వరకు గడువు ఇవ్వాలని కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం కోరింది. అయితే అందుకు కేంద్రమంత్రి అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం. 2024 జూన్‌లోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని గజేంద్రసింగ్ షెకావత్ ఆదేశించారు. అనుకున్న సమయానికి పూర్తి చేయాలని సూచించారు. కేంద్రం నుంచి నిధులు విడుదల అయితే… పోలవరం ప్రాజెక్టు పనుల్లో వేగం పెరగనుంది. త్వరలోనే ప్రాజెక్టు తొలిదశ పనులు పూర్తి అవుతాయని అంచనా వేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie