Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

 ముసుగు తీసేసిన ముద్రగడ…

0

కాకినాడ, మార్చి 12 (న్యూస్ పల్స్)
ముద్రగడ ఎట్టకేలకు ముసుగు తీశారు. కాపు ఉద్యమ నాయకుడి నుంచి రాజకీయ నేతగా అవతారం ఎత్తనున్నారు. సుదీర్ఘకాలం రాజకీయ నేతగా, ప్రజా ప్రతినిధిగా వ్యవహరించిన ఆయన.. కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని అందుకున్నారు. 2009 తర్వాత ఏ పార్టీతో సంబంధం లేకుండా గడిపారు. 2014 ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత కాపు ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లగలిగారు. అయితే కాపులపై అభిమానం కంటే చంద్రబాబుపై ఉన్న కసితోనే ఆయన ఆ పని చేశారన్న విమర్శ ఉంది. గత ఎన్నికలకు ముందు నుంచే జగన్ కోసం పని చేస్తున్నారన్న ఆరోపణ ముద్రగడపై ఉంది. ఇప్పుడు అదే పార్టీలోకి ముద్రగడ వెళ్తుండడం విశేషం. ఈనెల 14న వైసీపీలో చేరికకు ముహూర్తం నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఆయన అభిమానులకు లేఖ రాశారు. తనతో ప్రయాణం చేయాలని కోరారు.వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత ముద్రగడ ఆ పార్టీలో చేరతారని ప్రచారం జరిగింది. చాలాసార్లు వైసీపీ నేతలు నేరుగా కిర్లంపూడి లోని ఆయన ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. అటు వైసిపి పట్ల ముద్రగడ అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చారు. అయితే తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసమే వైసీపీలో చేరతారని ప్రచారం జరిగింది. ఇటువంటి తరుణంలో వైసిపి అభ్యర్థుల జాబితాలను ప్రకటిస్తూ వస్తోంది.

కానీ ఎక్కడా ముద్రగడ కుటుంబ సభ్యుల పేర్లు కనిపించలేదు. దీంతో ముద్రగడ మనస్థాపానికి గురయ్యారని ప్రచారం జరిగింది. అదే సమయంలో జనసేన నేతలు ముద్రగడకు టచ్లోకి వెళ్లారు. పవన్ వచ్చి నేరుగా ముద్రగడతో చర్చలు జరుపుతారని చెప్పుకొచ్చారు. కానీ పవన్ మాత్రం ముద్రగడను కలవలేదు. దీంతో మనస్థాపానికి గురైన ముద్రగడ వైసీపీలో చేరిపోవాలని డిసైడ్ అయ్యారు. అయితే తనకు కానీ, తన కుమారుడికి కానీ ఎన్నికల్లో టికెట్ ఇచ్చే పరిస్థితి కనిపించకపోయినా.. ముద్రగడ వైసీపీలో చేరుతుండడం విశేషం.అయితే ఎటువంటి గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ముద్రగడ వైసీపీ వైపు వెళ్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఉభయగోదావరి జిల్లాల్లోటిడిపి,జనసేన కూటమి బలంగా ఉంది. అందుకే జనసేన వైపు వెళ్లి కుమార్ రెడ్డికి టికెట్ ఇప్పించుకోవాలని ముద్రగడ భావించినట్లు తెలుస్తోంది. వైసీపీకి ఎన్నో విధాలుగా లబ్ధి చేకూర్చినా టిక్కెట్ విషయంలో తనకు భరోసా ఇవ్వకపోవడంతో ముద్రగడ ఒకరకమైన బాధతో కనిపించారు. అదే సమయంలో జనసేన లోకి వెళ్లాలని చూశారు. కానీ పవన్ నుంచి అంతగా సానుకూలత రాలేదు. దీని వెనుక చంద్రబాబు హస్తం ఉందని అనుమానించారు. అందుకే వైసిపి వైపు వెళ్లిపోవాలని డిసైడ్ అయ్యారు. అయితే ఇప్పటివరకు వైసీపీ ప్రయోజనాల కోసం పనిచేశారు అన్న విమర్శ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన అభిమానులకు నేరుగా లేఖ రాశారు.ముద్రగడ రాసిన లేఖ వివరాలు ఇలా ఉన్నాయి.

‘ఈమధ్య జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి మీడియా ద్వారా మీకందరికీ తెలుసు అనుకుంటున్నాను.సీఎం జగన్ పిలుపుమేరకు వైసీపీలోకి వెళ్లాలని భావించి.. మీ ఆశీస్సులతో నిర్ణయం తీసుకున్నాను. మరోసారి ముఖ్యమంత్రి పీఠం మీద వైయస్ జగన్ కూర్చోబెట్టడానికి ఎలాంటి కోరికలు లేకుండా పని చేస్తాను. పేదలకు మరెన్నో సంక్షేమ పథకాలు.. అభివృద్ధిని సీఎం జగన్ తో చేయించాలని ఆశతో ఉన్నాను. మీ బిడ్డ అయిన నేను ఎప్పుడు తప్పు చేయలేదు. చేయను కూడా. ఈనెల 14న కిర్లంపూడి నుంచి తాడేపల్లి కి బయలుదేరుతున్నాను. మీ అవకాశాన్ని బట్టి నా ప్రయాణంలో మీరు పాలుపంచుకొని తాడేపల్లి కి రావాలని కోరుతూ ‘ మీ ముద్రగడ అంటూ లేక ముగించారు.అయితే బే షరతుగా వైసీపీలో చేరుతున్నట్లు ముద్రగడ ప్రకటించడం విశేషం. మరోసారి ముఖ్యమంత్రిగా జగన్ అధికారం చేపట్టిన తరువాతనే.. వారు ఏ పదవి ఇచ్చినా తీసుకోవడానికి సుముఖంగా ఉన్నానని ముద్రగడ చెప్పడం విశేషం. అయితే గతంలో ముద్రగడ కుమారుడు కీలక ప్రకటన చేశారు. జనసేన, టిడిపి.. ఈ రెండింటిలో ఏదో ఒక పార్టీలో చేరుతాం తప్పించి.. వైసీపీలో చేరే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. అయితే ఇప్పుడు అదే కుటుంబం యూ టర్న్ తీసుకుని వైసీపీలోకి వెళుతుండడం విశేషం. ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వకపోయినా.. రాజ్యసభ సీటు ఆఫర్ చేసినందుకే ముద్రగడ వైసీపీ వైపు వెళ్లినట్లు తెలుస్తోంది. మొత్తానికైతేసుదీర్ఘ విరామం తర్వాత ముద్రగడ రాజకీయ నేతగా అవతరించనున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie