Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

 రాయలసీమలో వైసీపీ పట్టు సాధించేదేలా…?

0

కడప, మార్చి 20 (న్యూస్ పల్స్)
రాయలసీమలో వైఎస్ జగన్ కు ఎదురు లేదు. అది మొన్నటి వరకూ వినిపించిన టాక్. కానీ రాను రాను పరిస్థితుల్లో మార్పు కనిపిస్తుంది. క్రమంగా విపక్షాలు బలం పుంజుకుంటున్నాయి. అభ్యర్థుల మార్పు కావచ్చు. స్థానిక పరిస్థితులు సహకరించకపోవడం కావచ్చు. ఏది ఏమైనా ఈసారి రాయలసీమలో గతంలో వచ్చిన సీట్లు ఈసారి దక్కుతాయా? అన్న అనుమానాలు వైసీపీ నేతల్లోనే కలుగుతున్నాయి. వైసీపీ నేతల్లో నెలకొన్న విభేదాలతో పాటు క్యాడర్ లో అలుముకున్న అసంతృప్తి కూడా ఒక కారణంగా గుర్తించారని చెబుతున్నారు. వైసీపీకి ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్న రాయలసీమలోనే కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొన్నాయన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.  నాలుగు జిల్లాల్లో… రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో గత ఎన్నికల్లో ప్రస్తుత ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కేవలం మూడు స్థానాలకే పరిమితమయింది. కడప జిల్లాలో పది పదికి పది స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. కర్నూలు జిల్లాలోనూ ఫ్యాన్ పార్టీ గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది. అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో మాత్రం కొన్ని స్థానాలను కోల్పోయింది.

అనంతపురం జిల్లాలోని ఉరవకొండ, హిందూపురంతో పాటు చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో టీడీపీ గెలిచింది. మిగిలిన అన్ని స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. అంత పెద్ద సంఖ్యలో సీట్లు గెలవడం కారణంగానే వైసీపీకి గత ఎన్నికల్లో 151స్థానాలు దక్కాయి. అయితే ఈసారి కడప, అనంతపురం జిల్లాల్లో కొంత ఫ్యాన్ పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొన్నాయని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. కడప జిల్లాలో రాజంపేట, కమలాపూర్, మైదుకూరు వంటి స్థానాల్లో టీడీపీ ఈసారి గట్టి పోటీ ఇచ్చే అవకాశాలున్నాయి. అయితే అనంతపురం జిల్లాలో మాత్రం టీడీపీకి ఎక్కువ సంఖ్యలో స్థానాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈసారి ఐదారు స్థానాలకు మించి వైసీపీకి రావన్న అంచనాలు వినపడుతున్నాయి. చిత్తూరు, కర్నూలు జిల్లాలో కొంత పరవాలేదని అంటున్నారు. అదే జరిగితే సీమలో జగన్ పార్టీ అతి తక్కువ స్థానాలు దక్కే అవకాశముంది. ఈ ప్రభావం అధికారంలోకి రావడంపైన కూడ పడనుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గ్రామీణ స్థాయిలో ఓటు బ్యాంకు వైసీపీకి బలంగా ఉన్నప్పటికీ వర్గ విభేదాలే ఆ పార్టీ కొంప ముంచేట్లు కనిపిస్తున్నాయి. నేతల మధ్య కొరవడిన సహకారంతో పాటు క్యాడర్ లో నెలకొన్న నిరాశ, నిస్పృహలు కూడా సీమలో జగన్ పార్టీ బలహీన పడటానికి కారణంగా చెబుతున్నారు. అయితే ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో నష్ట నివారణ చర్యలు చేపడితే ఏదైనా మార్పు వచ్చే అవకాశముందని కూడా అంటున్నారు. రాప్తాడులో సిద్ధం సభ జరిగింది. ఈ సభ తర్వాత కూడా పరిస్థితుల్లో పెద్దగా మార్పు రాలేదంటున్నారు. రెడ్డి సామాజికవర్గం కూడా ఫ్యాన్ పార్టీ పట్ల గుర్రుగా ఉందంటున్నారు. ఇప్పటి వరకూ అయితే మాత్రం సీమలో కొంత పైచేయి వైసీపీదే అయినా గత ఎన్నికల్లో వచ్చిన సీట్లు మాత్రం రావదన్న అంచనాలు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie