Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

వేగంగా  అయోధ్య పనులు – 3 రోజుల పాటు డ్రై డే

0

లక్నో, జనవరి 13, (న్యూస్ పల్స్)
అయోధ్యలో  ఈ నెల 22న రామ మందిర ప్రారంభోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా రామ మందిరం ప్రారంభం కానుంది. బాలరాముడిని ఆయన చేతుల మీదుగా ప్రతిష్టించనున్నారు. ఈ వేడుకకు ముందు దాదాపు 11 రోజులు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టనుంది. ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది తరలి రానున్నారు. వేలాది మంది సాధువులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. రామ మందిరాన్ని నిర్మించిన కూలీల కుటుంబ సభ్యులకూ ఆహ్వానం అందింది. దాదాపు 11 వేల మంది ప్రముఖులు ఈ వేడుకకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అతిథులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రామతీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏర్పాట్లు చేస్తోంది.

రామ మందిర వేడుక నేపథ్యంలో ఈ నెల 22న పలు రాష్ట్రాలు ‘డ్రై డే’గా  ప్రకటించాయి. ఆ రోజున అయోధ్యతో సహా రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలను మూసివేయాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్ణయించారు. అలాగే, మాంసం దుకాణాలు సైతం మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ప్రత్యేక కార్యక్రమం నేపథ్యంలో ఆ రోజున రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అదే బాటలో ఛత్తీస్ గఢ్, అసోం సైతం ఆ రోజును ‘డ్రై డే’గా పాటించనున్నారు. రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఈ నెల 22న రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాలు, పబ్బులు మూసి వేయనున్నట్లు ఛత్తీస్ గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయ్ తెలిపారు. అలాగే, అయోధ్యకు 300 మెట్రిక్ టన్నుల సువాసన గల బియ్యాన్ని పంపనున్నట్లు చెప్పారు. ఆ రోజున అస్సాంలో సైతం మద్యం దుకాణాలు మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జయంత్ మల్లా వెల్లడించారు. అటు, రాజస్థాన్ లోని కొన్ని ప్రాంతాల్లోనే ఆంక్షలు విధించారు. జైపూర్ మున్సిపాలిటీ పరిధిలోని హెరిటేజ్ ఏరియాల్లో 22న మాంసం దుకాణాలు మూసివేయనున్నారు.’డ్రై డే’ అంటే మద్యం పానీయాల అమ్మకాలకు అనుమతించని రోజు అని అర్థం. ఆ రోజున మద్యం దుకాణాలు సహా పబ్బులు, రెస్టారెంట్లలోనూ మద్యం విక్రయాలకు అనుమతించరు. జనవరి 22న జాతీయ పండుగలా జరుపుకొంటామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే ప్రకటించారు. న్యూయార్క్ లోని ఐకానిక్ టైమ్ స్క్వేర్ నుంచి రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో దేశంలోని వేలాది దేవాలయాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ భారతీయ రాయబార కార్యాలయాలు, కాన్సులేట్స్ ల్లోనూ ప్రసారం చేయనున్నారు.ఈ నెల 15న అయోధ్యలో యజ్ఞ క్రతువులు ప్రారంభం కానున్నాయి. రాముడి విగ్రహాన్ని యాగశాల మండపంలోకి తీసుకొస్తారు.
ఈ నెల 16న శ్రీరాముని విగ్రహానికి ప్రతిష్టాపన ఆచారాలు ప్రారంభం, 17న విగ్రహ ఊరేగింపు, 18న మండప ప్రవేశ పూజ, వాస్తు, వరుణ, గణేశ పూజలతో ప్రాణ ప్రతిష్ట పవిత్రోత్సవానికి శ్రీకారం…ఈ నెల 19న యజ్ఞ అగ్ని గుండం స్థాపన, 20న 81 కలశాలతో పుణ్యాహవచనంతో రామ మందిర గర్భగుడిని వేద మంత్రాలతో పవిత్రం చేస్తారు.

ఈ నెల 21న జలాధివాసం అంటే అయోధ్య రాముడి విగ్రహాన్ని 125 కలశాల పవిత్ర జలాలతో అభిషేకం. ఈ నెల 22న అయోధ్య రామయ్య విగ్రహ ప్రతిష్టాపన. ఆ రోజున మృగశిర నక్షత్రం సందర్భంగా.. మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల 8 సెకనుల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల మధ్య 84 సెకన్ల పాటు శుభ ఘడియల సమయంలో గర్భగుడిలో కేటాయించిన స్థలంలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఈ నెల 24 నుంచి అయోధ్య రాముడిని దర్శించుకునేందుకు భక్తులకు అనుమతించనున్నారు.ప్రతిరోజూ ఉదయం 7 నుంచి 11:30 వరకు, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల వరకు, ప్రత్యేక సందర్భాల్లో.. పండుగల సమయాల్లో దర్శన వేళల్లో మార్పులుంటాయని అయోధ్య రామ తీర్ధ క్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. అలాగే, ఉదయం 6 : 30 గంటలకు శృంగార్ హారతి, మధ్యాహ్నం 12 గంటలకు భోగ్ హారతి, సాయంత్రం 07:30  గంటకు సంధ్యా హారతి నిర్వహించనున్నట్లు తెలిపింది. భక్తులందరికీ రామ మందిరంలోకి ప్రవేశం ఉచితమే కానీ ప్రత్యేక దర్శనం చేసుకోవాలనుకునే భక్తులకు టిక్కెట్లు కూడా అందుబాటులో ఉంచనున్నారు. వీటిని ఆన్‌లైన్‌లో కొనుక్కోవచ్చు. టిక్కెట్ ధర ఒక్కొక్కరికి రూ.100 నుంచి రూ.300 వరకు ఉంటుంది. రామ మందిరంలోనికి ప్రవేశించేటప్పుడు భక్తులు తప్పనిసరిగా డ్రెస్ కోడ్‌ను పాటించాలి. ఆలయంలోనికి ప్రవేశించే సమయంలో భక్తులు సంప్రదాయ బద్ధమైన దుస్తులు మాత్రమే ధరించాలి.
పురుషులు ధోతీ, గంచా, కుర్తా-పైజామాను ధరించాల్సి ఉంటుంది. మహిళలు చీర లేదా సల్వార్ సూట్స్, పంజాబీ డ్రెస్ ధరించవచ్చు. జీన్స్ ప్యాంట్స్, షర్ట్స్, టాప్స్, షార్ట్స్ లేదా వెస్ట్రన్ డ్రెస్సులను అస్సలు అనుమతించరు.
భక్తులు తమ వెంట మొబైల్ ఫోన్లను తీసుకుని వెళ్లడం నిషేధం, పర్సులు, హ్యాండ్ బ్యాగులు, వాలెట్స్, ఇయర్ ఫోన్లు, హెడ్ ఫోన్లు, రిమోట్‌తో కూడిన కీ- చైన్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను ఆలయంలోనికి తీసుకెళ్లకూడదు, గొడుగులు, బ్లాంకెట్లు, గురు పాదుకలను తీసుకెళ్లడంపైనా నిషేధం ఉంది.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie