Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

వైసీపీలో టిక్కెట్ల అలజడి …… పక్క చూపులు చూస్తున్న నేతలు

0

విజయవాడ, డిసెంబర్ 16, 

ఎన్నికలకు  ముందు ఓ రాజకీయ పార్టీపై అంచనాలు ఎలా ఉన్నాయనేది ఆ పార్టీలో ఉండే చేరికల్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో చేరికల జోరు కొనసాగింది. టిక్కెట్లు రావని తెలిసినా చాలా మంది నేతలు చేరిపోయారు. దీనికి కారణం కాంగ్రెస్ అధికారంలోకి  వస్తందని.. తమకు ఎమ్మెల్యే కాకపోతే మరో పదవి ఇస్తారని ఆశాభావం. ప్రజల్లో ఉన్న మూడ్ రాజకీయ నేతలకు కాక ఇంకెవరికి తెలుస్తుంది…?. తెలంగాణ ఎన్నికలు  ముగిసిన తర్వాత ఇప్పుడు ఏపీలో రాజకీయం వేడెక్కుతోంది. ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్  వస్తుందన్న నమ్మకంతో  అన్ని రాజకీయ పార్టీలు కార్యకలాపాలు పెంచాయి.వ్యూహాత్మకమో.. వ్యూహాత్మక తప్పిదమో కానీ వైసీపీ చీఫ్ , సీఎం జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల ఎంపికపై త్వర త్వరగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాత్రికి  రాత్రి పదకొండు స్థానాల్లో ఇంచార్జుల్ని మార్చేశారు. అంటే వారే అభ్యర్థులని చెప్పినట్లు. .మార్చింది కేవలం 11 చోట్ల మాత్రమేనని.. కానీ జాబితా వంద వరకూ ఉంటుందని  సంకేతాలు పంపారు.

ఇందులో పది మంది మంత్రుల పేర్లూ ప్రచారంలోకి వచ్చాయి. దీంతో అందరిలోనూ ఆందోళన ప్రారంభమయింది. అధికారికంగా టిక్కెట్ రాదని తెలిసిపోయిన  వారి అనుచరులు రాజీనామాల బటపట్టారు. అసలు  ఆళ్ల  రామకృష్ణారెడ్డి లాంటి వాళ్లు రాజీనామాలు చేశారు మోపిదేవి వంటి వారుసైలెంట్ అయిపోయారు. కానీ వారి అనుచరులు మాత్రం రాజీనామాల బాట పట్టారు. టిక్కెట్ రాదని కంగారు పడుతున్న నేతల సంఖ్య తక్కువేం లేదు. అలాంటి వారందరూ  ఇప్పటికైతే సైలెంట్ గా ఉన్నారు. కానీ.. తెర వెనుక ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం వైసీపీలో చేరికలేమీ లేకపోగా.. ఉన్నవారు రాజీనామా చేస్తున్నారు.  ముందు ముందు వైసీపీలో  చేరే వారు కూడా ఉండే అవకాశం లేదని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలుగుదేశం, జనసేన పార్టీ  పొత్తులు పెట్టుకుని పోటీ చేస్తూండటం, మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలవడంతో పాటు  ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్న అభిప్రాయం, తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడం వంటి కారణాలతో ప్రతిపక్షానికి మంచి ఊపు వచ్చింది. అందుకే రోజు మార్చి రోజు.. ఆ పార్టీ కార్యాలయాలు సందడిగా మారుతున్నాయి. పార్టీలో చేరేందుకు వివిధ నియోజకవర్గాల నుంచి జిల్లాల వారీగా వైసీపీకి చెందిన ద్వితీయ శ్రేణి నేతలు వస్తున్నారు. గురువారం టీడీపీ , జనసేన కార్యాలయాల్లో జోరుగా చేరికలు జరిగాయి. కానీ మంగళగిరిలోని వైసీపీ కార్యాలయం ముందు మాత్రం ఎలాంటి సందడి లేదు.

నిజానికి ఈ ద్వితీయ శ్రేణి నేతల్ని వారి గాడ్ ఫాదర్లే ముందస్తుగా.. టీడీపీ, బీజేపీల్లో  చేరమని ప్రోత్సహిస్తున్నారన్న ప్రచారమూ ఉంది. ముందు ముందు ఈ చేరికలు మరింతగా జోరందుకోనున్నాయి. వైసీపీలో వంద మందికి టిక్కెట్లు నిరాకరిస్తున్నారని  తేలిపోవడంతో చంద్రబాబు నాయుడు టీడీపీ ఆఫీసులో వ్యూహాత్మక వ్యాఖ్యాలు చేశారు. మిచౌంగ్ తుపాను కారణంగా 25 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినా రైతులకు రూపాయి సాయం చేయలేదని..కనీసం కేంద్రానికి నివేదికలు పంపలేదని చెప్పేందుకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన చంద్రబాబునాయుడు .. వైసీపీలో పరిస్థితిపై వ్యూహాత్మకంగా మాట్లాడారు. 151 మందిని మార్చినా ప్రయోజనం లేదని తేల్చేశారు. అదే సమయంలో తమ పార్టీలోకి రావాలనకునేవారికి ఓ రకమైన సందేశం పంపారు. అన్నీ పరిశీలించి.. సర్వేలు .. ప్రజాభిప్రాయం సేకరించి టిక్కెట్లు ఇస్తామన్నారు. అంటే.. వస్తామన్న వారికి టిక్కెట్ ఆప్షన్ ఉన్నట్లే. అదే సమయంలో నేరుగా వైసీపీ నుంచి ఎవరైనా వస్తే పరిశీలిస్తామని కూడా హామీై ఇచ్చారు. ఇప్పటికే వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీ వైపు వచ్చారు. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన సమయంలో మరో ఇరవై మంది కూడా టీడీపీలో చేరేందుకు రెడీగా ఉన్నారని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. అది మైండ్ గేమా..నిజమా అన్నది తెలియదు కానీ..ఇప్పుడు చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు మాత్రం.. వైసీపీ పెద్దల్లో  కాస్త ఆలోచన రేకెత్తించే అవకాశం ఉంది.

తెలుగుదేశం పార్టీ కాకపోతే జనసేన అన్నట్లుగా ఆ పార్టీ కూడా నేతల కోసం చూస్తోంది. జనసేన పార్టీకి పొత్తుల్లో భాగంగా వచ్చే సీట్లలో పోటీ చేయడానికి ఇంకా బలమైన అభ్యర్థులు లేరు. చాలా కొద్ది చోట్ల మాత్రమే ఉన్నారు. ఇతర నియోజకవర్గాల్లో ప్రస్తుత రాజకీయాలకు తగ్గట్లుగా పోటీ పడే నేతలు కావాలి. వారి కోసం జనసేన పార్టీ ఎదురు చూస్తోంది. వైసీపీలో అలజడితో ఆ పార్టీ నేతలతో సంప్రదింపులు జరిపేవారు పెరిగారన్న వాదన వినిపిస్తోంది. వైసీపీ నేతలకు టీడీపీ, జనసేన తలుపులు తెరిచే పరిస్థితులు కనిపిస్తూండటంతో.. మూడు నెలల ముందుగానే ఇంచార్జుల మార్పులతో  పార్టీ నేతల్లో అలజడి రేపడం వ్యూహాత్మక తప్పిదం ఏమోనని వైసీపీ నేతలు ఇప్పుడు ఆలోచిస్తున్నారు. 11 మంది ఇంచార్జుల మార్పు తర్వాత ఒక్క సారిగా నెగటివ్ ప్రచారం పెరిగిపోయింది. వైసీపీ పరిస్థితి బాగోలేదని అందుకే ప్రజా వ్యతిరేకత తగ్గించుకునేందుకు ఇంచార్జుల్ని, అభ్యర్థుల్ని మారుస్తున్నారన్న ప్రచారం ఊపందుకుంది. అదే సమయంలో వైసీపీ క్యాంప్ నుంచే వచ్చిన వంద మంది అభ్యర్థుల మార్పు అనే అంశం కూడా మరింత నెగటివ్ గా వెళ్లింది. పేర్లతో సహా ప్రచారంలోకి రావడం మరింత  మైనస్ అయింది. దీంతో ఎక్కువ మంది నేతలు సైలెంట్ అయిపోతున్నారు. ప్రత్యామ్నాయ రాజీకయ భవిష్యత్ కోసం ఆలోచించే ప్రణాళికలు వేసుకుంటున్నారు. దీంతో వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్ అలర్ట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దూకుడు తగ్గించి .. పార్టీ నేతల్లో భరోసా నింపాలనే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా వైసీపీ ప్రకటించిన ఇంచార్జ్ లు మార్పు.. రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు తెచ్చాయి. అది వైసీపీ పెద్దలు ఊహించినట్లగా పాజిటివ్‌గా కాకుండా నెగెటివ్‌గా ఉండటమే అసలు రాజకీయం

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie