Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

హనుమాన్ మూవీ రివ్యూ

0

హైదరాబాద్, జనవరి 12, (న్యూస్ పల్స్)
సూపర్ హీరోలు మన ప్రేక్షకులకు కొత్త కాదు. ఇప్పటి వరకు హాలీవుడ్ సూపర్ హీరోలను ఎక్కువగా చూశారు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద సూపర్ హీరో అంటే హిందీ హీరో, గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ‘క్రిష్’ గుర్తుకు వస్తుంది. అయితే… దర్శకుడు ప్రశాంత్ వర్మ హిందూ పురాణాల స్ఫూర్తితో ‘హను మాన్’ తీశారు. ఒరిజినల్ సూపర్ హీరో హనుమంతుడిని స్క్రీన్ మీదకు తీసుకు వచ్చారు. తేజ సజ్జ హీరోగా నటించిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. హనుమంతు (తేజ సజ్జ)ది అంజనాద్రి గ్రామం. అతను ఓ దొంగ. చిన్నప్పటి నుంచి మీనాక్షి (అమృతా అయ్యర్) అంటే ప్రేమ. ఆమె డాక్టర్. వేసవి సెలవులకు తాతయ్య ఊరు అంజనాద్రి వస్తుంటుంది. అక్కడి ప్రజలకు వైద్యం చేస్తుంటుంది. ఊరి ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడం తప్ప పాలెగాడు (రాజ్ దీపక్ శెట్టి) అభివృద్ధిని పట్టించుకోడు. అతడిని ఎదిరించడంతో మీనాక్షికి ప్రమాదం ఎదురు అవుతుంది. దాన్నుంచి ఆమెను కాపాడే క్రమంలో హనుమంతుకు గాయాలు అవుతాయి. తెల్లారే సరికి గాయాలు మాయం అవుతాయి. సూపర్ పవర్స్ వస్తాయి. హనుమంతుకు సూపర్ పవర్స్ ఎలా వచ్చాయి? అతని గురించి తెలిసి ఆ ఊరు వచ్చిన మైఖేల్ (వినయ్ రాయ్), సిరి అలియాస్ సిరివెన్నెల (వెన్నెల కిశోర్) ఎవరు? ఊరిలో ఆస్పత్రి కడతామని నమ్మించిన మైఖేల్ ఏం చేశాడు? అంజమ్మ (వరలక్ష్మీ శరత్ కుమార్), హనుమంతు… అక్కా తమ్ముడి అనుబంధం ఏమిటి? హనుమతుకు విభీషణుడు (సముద్రఖని) ఎటువంటి సాయం చేశాడు? రుధిర మణి కథేంటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

 

సూపర్ హీరో సినిమాలకు ఒక టెంప్లేట్ ఉంటుంది. ‘హనుమాన్’ టెంప్లేట్ నుంచి బయటకు వెళ్లలేదు. అలాగని, ఇది రొటీన్ సినిమా కాదు. తెలుగు నేటివిటీ మిస్ కాకుండా కామెడీతో పాటు క్యూరియాసిటీ కంటిన్యూ చేస్తూ ప్రశాంత్ వర్మ ఈ సినిమా తీశారు. సూపర్ పవర్ కోసం విపరీతంగా ప్రయత్నించే విలన్, సాదాసీదా హీరో, సూపర్ పవర్ కోసం ఊరికి వచ్చిన విలన్‌ను హీరో ఎలా ఎదుర్కొన్నాడు? అనేది క్లుప్తంగా ‘హనుమాన్’ కథ. ముందు చెప్పినట్టు ఈ కథకు నేటివిటీ కామెడీ టచ్ ఇవ్వడంలో ప్రశాంత్ వర్మ సూపర్ సక్సెస్ అయ్యారు. సినిమా స్టార్టింగ్ టు ఎండింగ్ కామెడీ వర్కవుట్ అయ్యింది.హీరో తేజ సజ్జ క్యారెక్టర్ విషయంలో దర్శకుడి తెలివిగా వ్యవహరించారు. ముందు నుంచి హీరో ధీరుడు, సూరుడు, వీరుడు అంటూ చూపించలేదు. సామాన్యుడిగా పరిచయం చేశారు. తేజ సజ్జ ఫైట్స్ చేస్తే ప్రేక్షకులు నమ్మేలా ఆ సన్నివేశాలన్నీ రూపొందించారు. చివరకు హనుమంతుడిని సైతం కథలోకి తెలివిగా తీసుకొచ్చారు. అలాగని, సినిమాలో ఇబ్బంది పెట్టే సన్నివేశాలు లేవని కాదు. పాలెగాడు సీన్లు, కొన్ని క్యారెక్టర్లను డిటైల్డ్‌గా చూపించడంతో నిడివి పెరిగింది. విలన్ క్యారెక్టరైజేషన్ ఎస్టాబ్లిష్ చేయడం బావుంది. అయితే… అతని నేపథ్యాన్ని పూర్తిగా వివరించలేదు. ఆ లోపాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు.

 

‘అ!’, ‘కల్కి’, ‘జాంబీ రెడ్డి’… తీసినవి మూడు సినిమాలే అయినప్పటికీ ప్రశాంత్ వర్మ హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నారు. టెక్నికల్‌గా మంచి ఫిలిమ్స్ ఇచ్చారు. ‘హనుమాన్’ కూడా టెక్నికల్‌గా బావుంది. ప్రశాంత్ వర్మకు ఇచ్చిన బడ్జెట్‌ ప్రతి సన్నివేశంలో కనిపించింది. వీఎఫ్ఎక్స్ బాగా చేశారు. సాంగ్స్, నేపథ్య సంగీతం విషయానికి వస్తే… ముగ్గురు సంగీత దర్శకులు ఎక్సట్రాడినరీ అవుట్ పుట్ ఇచ్చారు. క్లైమాక్స్ 15 నిమిషాలకు నేపథ్య సంగీతం అదరగొట్టారు.హనుమంతు పాత్రలో తేజ సజ్జ ఒదిగిపోయారు. కామెడీ, ఫైట్స్, ఎమోషన్… ప్రతిదీ పర్ఫెక్ట్‌గా చేశారు. క్యారెక్టర్ పరిధి దాటకుండా హీరోయిజం చూపించారు. అమృతా అయ్యర్ అందంగా కనిపించారు. నటిగానూ మెరిశారు. వరలక్ష్మీ శరత్ కుమార్ ఫైట్ వచ్చినప్పుడు ప్రేక్షకులు విజిల్స్ వేయడం గ్యారంటీ. రాజ్ దీపక్ శెట్టి పాత్రకు ముందు ఇచ్చిన బిల్డప్ తర్వాత లేదు. నటుడిగా తన పరిధి మేరకు చేశారు. వినయ్ రాయ్ మరోసారి స్టైలిష్ విలన్ రోల్ చేశారు. గెటప్ శ్రీను, సత్య, జబర్దస్త్ రోహిణి, రాకేష్ మాస్టర్ తదితరులు నవ్వించారు. అందరి కంటే ఎక్కువగా హీరో తేజ సజ్జ టైమింగ్ (యాక్షన్ సన్నివేశాల్లో) నవ్విస్తుంది. విభీషణుడిగా సముద్రఖని హుందగా నటించారు.
చివరగా… సంక్రాంతి పండక్కి పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘హనుమాన్’. సూపర్ హీరో సినిమాలు అంటే పిల్లలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. వాళ్లను ఎంటర్టైన్ చేసే అంశాలు సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. క్లైమాక్స్ పదిహేను నిమిషాలు థియేటర్లు జై హనుమాన్, జై శ్రీరామ్ నామస్మరణతో మార్మోగుతాయి. పిల్లలతో పాటు పెద్దలు కూడా ఎంజాయ్ చేసే చిత్రమిది. హనుమంతుడి ఎపిసోడ్‌కు గూస్ బంప్స్ గ్యారంటీ.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie